జనపదం – శుక్రవారం -23-08-2024 E-Paper
నాన్చుడా..తేల్చుడా..?
సీఎం మళ్లీ ఢిల్లీ
ఉత్తమ్, భట్టికీ పిలుపు
హైకమాండ్ తో భేటీలు
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..?
ఊరిస్తున్న పీసీసీ
నామినేటెడ్ కోసం పడిగాపులు
సారు.. మళ్లెళ్లారు. ఈ సారైనా పని పూర్తి చేసుకొస్తారా…? లేదంటే ఢిల్లీ పెద్దలు చెప్పింది విని ఉట్టి చేతులతో ఊపుకుంటూ వస్తారా..? ఇప్పటికే మూడు సార్లు అటుపోవుడు., ఇటు రాకటతోనే సరిపోయింది. పోయినప్పుడల్లా ఇగో వచ్చే అనుమతులు.., అగో ఇచ్చే పదవులు… అన్నట్టుగా సాగుతూనే ఉంది తప్ప యవ్వారం తేలింది లేదు., అనుకున్నది అయ్యింది లేదు. ఊరించే ధోరణికి చరమగీతం పాడి, ఉవ్విళ్లూరుతున్న వారికి పదవులు కట్టబెట్టితే అదే పదివేలు అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో ఈ సారైనా సీఎం సారు విక్టరీ సింబల్ తో దిగుతారో లేదో చూడాలి మరి. సీఎం హస్తినా వెళ్లడంతో ఇక్కడున్నోళ్ల ఆశావహుల పాణమంతా అగులుబుగులు అవుతుంటే., తెగని ముచ్చటగా ఉన్న పీసీసీ, నామినేటెడ్, మంత్రి వర్గ విస్తరణకు ఇగనన్నా మోక్షం దొరక్కపోతుందా అని గంపెడాశతో నిమ్మలం చేసుకుంటా సూడవట్టే.
==========================
జనపదం, హైదరాబాద్ బ్యూరో
నాన్చుడా.. తేల్చుడా.., పేనుడా.. తెగ్గొట్టుడా.. అనేది చూడాలి మరి. ఢిల్లీ పెద్దల నుంచి ముఖ్యమంత్రికి పిలుపొచ్చింది. రాత్రికి వెళ్లనున్నారు. ఈ సారి కచ్ఛితంగా పనులు ముగించుకుని వస్తారని ఆశపడుతున్నోళ్లు అనుకుంటుంటే, ఏఐసీసీలో ఏం తేలుస్తారోనని పార్టీ శ్రేణులు ఆత్రుతగా చూస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి కావచ్చింది., పదవుల పంపకానికి ముహూర్తం కుదరకపోవడంతో అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రసన్నంలో కాలం వెల్లదీస్తున్నవారు, హైకమాండ్ తో సాన్నిహిత్యం ఉన్నవారు., ఇలా ఎవరికి వారుగా గోతికాడి నక్కలా చూస్తున్నారు. దీనికి తోడు ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి, ఇతర ప్రముఖులు కూడా వారివారి అనయాయులకు పదవులు కట్టబెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు.
సీఎం మళ్లీ ఢిల్లీకి..
సీఎం రేవంత్ రెడ్డికి గురువారం రాత్రికి ఢిల్లీకి రావాలని ఏఐసీసీ నుంచి పిలుపొచ్చింది. ఈ నెల 15వ తేదీన సీఎం హస్తినా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నామినేటెడ్, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీపై ఎటూ తేల్చలేదని చెప్పడంతో నిరాశకు లోనైన రాష్ట్ర నాయకులు, ఇప్పుడు మళ్లీ రేవంత్ ఢిల్లీకి వెళ్లారని తెలియడంతో పర్యటనపై గంపెడాశతో ఉన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు రాహుల్ ను ఆహ్వానించడంతో పాటు రుణమాఫీపై వరంగల్ డిక్లరేషన్ విజయోత్సవ సభకు కూడా సోనియా, రాహుల్ ను సాదరంగా పిలిచే అవకాశం ఉండడంతో పెద్దలిద్దరిని సీఎం ప్రత్యేకంగా కలుస్తారనేది ఇప్పటికే తేలిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పదవుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించి ఓ కొలిక్కి తెచ్చి విజయగర్వంతో తిరిగొస్తారని రాష్ట్రంలోని నాయకులంతా చూస్తున్నారు.
ఉత్తమ్, భట్టికీ పిలుపు..
సీఎం పర్యటనలో వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మున్షీ కూడా వెళ్లనున్నారు. రాష్ట్ర పరిస్థితులు, మంత్రి వర్గ పనులు తదితరాలపై మాట్లాడే అవకాశాలున్నాయి. అదే సమయంలో పదవులపై కూడా వేర్వేరుగానో, కలిసికట్టుగానే మాట్లాడి ఓ కొలిక్కి తేవడానికే ఈ సారి వీళ్లని కూడా పిలుస్తున్నట్టు తెలుస్తోంది.
హైకమాండ్ తో భేటీలు
సీఎం రేవంత్, డిప్యూటీసీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, మున్షీ తదితరులతో హైకమాండ్ తో భేటీలు ఉండనున్నాయి. రుణమాఫీ, ప్రతిపక్షాల నిరసనలు, రైతులకు జరిగిన న్యాయాన్యాయాలు., రాజీవ్, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపై రగడ…., వంటి సున్నిత అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి రావాలనుకుంటున్న వారికి, ఇప్పటికే పార్టీలో చేరిన వారికి చేయాల్సిన న్యాయం, స్థానిక సమరంలో పార్టీ బలం పెంచడం వంటి వాటిపై పెద్దలంతా చర్చించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..?
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నుంచి పదవులు ఊరిస్తున్నాయి. 12 మందితో మంత్రి వర్గం కొలువుదీరిన తర్వాత విస్తరణ విషయం ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. మళ్లీ విస్తరణలో పదవి రాకపోతుందా అని ఎదురు చూస్తున్న వారంతా ఆవేదనతో ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎనిమిది నెలలుగా నెట్టుకొస్తున్నా, ఇంకా విస్తరణ జరగకపోవడంతో ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మంత్రి వర్గ విస్తరణ చేపట్టి పదవుల పంపకం ముగించకపోతారా అని ఎదురుచూస్తున్నారు.
ఊరిస్తున్న పీసీసీ
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ అనంతరం నుంచి పీసీసీపై అనుభవశాలురంతా కన్నేసి చూస్తున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి స్వయంగా తన అనుచరుడికి పీఠం కట్టబెట్టాలని యత్నిస్తుండగా, మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, భట్టి, పొంగులేటి వంటి సీనియర్లంతా పీఠం దక్కించుకునేలా ప్లాన్లు చేస్తున్నారు. ఎవరికి వారుగా హైకమాండ్ తో టచ్ లో ఉంటూ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ పదవి చేజారకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పటికి ఏదో ఒక ఆటంకంతో వాయిదాపడుతూ వస్తున్న పీసీసీ ఇప్పటికైనా తేల్చే అవకాశం ఉంటుందని అంతా ఆత్రుతగా చూస్తున్నారు.
నామినేటెడ్ కోసం పడిగాపులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపుమీదుంది. బీఆర్ఎస్ చతికిలపడడంతో పదవులే పరమావధిగా భావించిన వాళ్లంతా హస్తం కండువా కప్పుకుంటున్నారు. అందే సమయంలో కాంగ్రెస్ లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వారు కూడా నామినేటెడ్ పదవుల కోసం కాచుక్కూర్చున్నారు. రేపు, మాపంటూ ఊరిస్తున్న నామినేటెడ్ కేటాయింపులే ఆశగా చూస్తుండగా, రేవంత్ పర్యటనతో మరింత ఉత్కంఠగా మారింది. పార్టీలో కొనసాగుతున్నందుకు ఓ పదవి దక్కితే అంతే చాలన్నట్టుగా పడిగాపులు పడుతు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.