పోటాపోటీగా ఢిల్లీ టూర్లు
నమ్మకం లేకనా.. షో కోసమే వైరి వర్గాలా
ఇంతకీ నామినేటెడ్ పట్టెవరిది
విస్తరణలో పంతమెవ్వరిది
ఇంతకీ ఢిల్లీ ఎవరిని నమ్ముతుంది
గ్రూపు రాజకీయాలు, వర్గ పోరుకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. పదేండ్లు బిఆర్ఎస్ సర్కార్ ను గద్దె దింపాలని గ్రూపులన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఐక్యతారాగం ఆలపించినట్టే ఆలపించి తీరా పార్లమెంట్ ఎన్నికలు ముగిసాక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పాత కథే పునరావత్తమవుతున్నట్టు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్లను సిఏం రేవంత్ రెడ్డి సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నా సీనియర్లు లోలోన రగిలిపోతూ ఆ లావాను సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజాన తుపాకి పెట్టి పేల్చుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాద్యతలు చేపట్టి ఎనిమిది నెలల కాలంలో ఇప్పటికీ 20 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇందులో సగానికి పైగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకూడా ఉంటున్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ సందర్భంలోనూ రేవంత్ ,భట్టి కలిసే ఫోటోలు దిగి కేంద్ర మంత్రులను, అదిష్టానం పెద్దలను కలిసిన ఫోటోలను మీడియాకు విడుదల చేస్తున్నారు. కాని తెరవెనుక ఆ ఇద్దరి మధ్య సయోధ్య లేదన్నది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ.రాష్ట్రంలో కూడా దాదాపు కీలక సమీక్షలు, నిర్ణయాలు డిప్యూటి సిఎం భట్టియే తీసుకుంటున్నట్టు కనపడుతున్నది. ఇటీవల రుణ మాఫీ సందర్భంగా, నిరుద్యోగులతో భేటీ సందర్భంగా, గ్రూపు పరీక్షల వాయిదా సందర్భంలోనూ భట్టీ పాత్ర కీలకమే అయింది. ఆయన కూడా తన ప్రసంగంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ లీడర్ గా తాను ఈ ప్రభుత్వంను అధికారంలోకి తీసుకురావడంకో కష్టపడ్డామని చెప్పుకొచ్చారు.ఇక ఢిల్లీ హైకమాండ్ వద్ద భట్టీ ప్రత్యేక ఆర్జీలు పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. సీనియర్లను రేవంత్ రెడ్డి సమన్వయం చేయలేకపోతున్నారని, సీనియర్లంతా తన వెంటే ఉంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల విస్తరణ వార్తల నేపధ్యంలో సీనియర్ మంత్రి ఉత్తమ్ రెడ్డి పది రోజులు ఢిలీలోనే మాకం వేసి సీఎం రేవంత్ పై ఫిర్యాదుల పరంపర సాగించారని పార్టీలో చర్చ జరుగుతోంది. తాజాగా డిల్లీ సీఎం టూర్ కు ముందే మంత్రి ఉత్తమ్ ఎన్టీఎస్ఏ సమావేశం పేరిట ఢిల్లీలో ఉన్నారు. తనవర్గం నేత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలితో ఢిల్లీలో ఫిర్యాదులిప్పిచ్చినట్టూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటి సీఎం భట్టి కూడా ఒక రోజు ముందే మంత్రి ఉత్తమ్ తో కలిసి ఢిల్లీ అదిష్టానం పెద్దలను కలిసినట్టు చెబుతున్నారు.
తెరవెనుక రాజకీయం ఇంతగా జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ల గ్రూపులను లైట్ తీసుకుని వర్గ పోరును కొట్టిపారేస్తున్నారని చెబుతున్నారు. గుంపులుగా కాకుండా తానెప్పుడు సింగిల్ వచ్చి అదిష్టానం వద్ద విషయాలు వివరించి వెల్తానే తప్పా ఈ తొక్కల మీటింగ్ లతో పనిలేదంటున్నారని చెబుతున్నారు. అదిష్టానం దగ్గర పరస్పర ఫిర్యాదులు దూషణల అనంతరం అదిష్టానం పెద్దలను రుణ మాఫీ కృతజ్ఞత సభకు హాజరుకావాల్సిందిగా అందుకే ఢిల్లీకొచ్చామని కలరింగ్ ఇస్తూ ఫోటోలు మీడియాకు రీలీజ్ చేయడం రివాజును మారుతుంది. అయితే ఎన్నాళ్లు కలహాల కాపురం…ఎన్నాళ్లీ నటించడం అన్నది రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు.