✅ భగవద్గీత స్పూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి
✅ ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ
✅ జనహితం, భవిష్యత్ తరాల మేలు కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు
✅ హైడ్రా విషయంలో ఒత్తిళ్ళను పట్టించుకోం.. ఎంతటివారినైనా వదలం
✅ ప్రభుత్వ అస్పత్రుల్లో భోజనానికీ హరే కృష్ణ సంస్థ సహకారం తీసుకుంటాం
✅ హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.
ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు. భగవద్గీత స్పూర్తిగా శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను
ధర్మ రక్షణగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
“శతాబ్దాల కిందటే హైదరాబాద్ ను చెరువుల నగరం(లేక్ సిటీ)గా నాటి పాలకులు అభివృద్ధి చేశారు. కోట్లాది మందికి దాహార్తిని తీర్చిన చెరువుల పరిధిలో ఇవాళ కొందరు వ్యక్తులు విలాసాల కోసం ఫామ్ హౌస్ లు కట్టి వ్యర్ధజలాలను వదులుతున్నారు. వీటిని విస్మరిస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి కూడా వ్యర్ధమే అవుతుంది. అందుకే చెరువుల పరిరక్షణకు పూనుకున్నాం.
కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. ఇది రాజకీయ కక్షల కోసం కానేకాదు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా పట్టించుకోం. చెరువుల ఆక్రమణదారులు ఎంతటివారైనా భరతం పడతాం. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతో వైభవోపేతంగా నిర్మితం కానున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. అనంతశేష స్థాపన పూజలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పలువురు ప్రజాప్రతినిధులు, హరే కృష్ణ ఉద్యమ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
కాంక్రీట్ జంగల్ గా మారిన కోకాపేట ప్రాంతంలో హరే కృష్ణ హెరిటేజ్ భవనం ద్వారా యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, ఇలాంటి మహోత్తమ కార్యక్రమంలో పాల్గొనడం జన్మ సుకృతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ ఆస్పత్రులల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.