Tuesday, April 8, 2025
HomeTelanganaRamoji Rao | రామోజీరావు మృతిప‌ట్ల సీఎం రేవంత్ సంతాపం.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు..!

Ramoji Rao | రామోజీరావు మృతిప‌ట్ల సీఎం రేవంత్ సంతాపం.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు..!

Ramoji Rao | హైద‌రాబాద్ : ఈనాడు అధినేత‌, పద్మవిభూషణ్ గ్రహీత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. రామోజీరావు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తిగా సీఎం కొనియాడారు. రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అన్నారు. పత్రిక నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం, ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు రామోజీరావు అని సీఎం కొనియాడారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో భేటీ ఐన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు లేని లోటు తెలుగు మీడియా రంగానికి, వ్యాపార రంగానికి తీరని లోటు అని సీఎం అన్నారు.అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అధికారిక లాంఛ‌నాల‌తో రామోజీ రావు అంత్య‌క్రియ‌లు..!

ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.

రామోజీరావు శ‌నివారం తెల్ల‌వారుజామున 4.50 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు ఈ నెల 5వ తేదీన శ్వాస తీసుకోవ‌డంతో ఇబ్బందులు త‌లెత్తాయి. దీంతో ఆయ‌న‌ను నాన‌క్‌రాంగూడ‌లోని స్టార్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. రామోజీ పార్థివ‌దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు