అంత భయమెందుకో..?
హరీష్ ట్రాప్ లో రేవంత్..
తన్నీరు నోరు తెరిస్తే చాలు సీఎంకు పూనకాలే..
సమస్యలపై ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్న ముఖ్యమంత్రి..
అటాక్ పేరుతో అడ్డంగా దొరికిపోతున్న వైనం..
పనులన్నీ పాతరే.. హైడ్రాకే ప్రాధాన్యం..
‘భరోసా’ ముచ్చట లేదు.., మాఫీపై క్లారిటీ లేదు..
గ్యారంటీలన్నీ గయాబ్..
మొక్కుబడిగా ముగిసిన కేబినెట్..?
ప్రతిపక్షాలపై గరానికి మాత్రం తయార్..
సీఎం తీరుపై తీవ్ర అసంతృప్తులు..
ముఖ్యమంత్రి మాజీ మంత్రి ట్రాప్ లో పడ్డారని కేబినెట్ లోనే విస్తృత చర్చ..
మాటలతో అదలగొట్టుడేగానీ పనులు ముందుకు కదిలేది ఉండదు. మాట్లాడిన వారిపై చిందులేయడం., ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడం… తొమ్మిదినెలలుగా సాగుతున్న తంతే ఇది. రాష్ట్రంలో ప్రతిపక్షానికి నూకలు చెల్లించాలని చూస్తున్న అతితో స్వపక్షంలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న ఏకైక వ్యక్తిగా నిలుస్తున్న సీఎం తీరిది. ఏ పనిగురించి అడిగినా ఏకైక అస్త్రంగా హైడ్రాను చూపుతూ, నెట్టుకొస్తున్న విధానం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. ప్రతిపక్షంలో ప్రశ్నించే కీలక నేత హరీష్ టార్గెట్ ఏదేదో చేయబోయి, చివరకు హరీష్ ట్రాప్ లోనే పడి తనను తాను సెల్ఫ్ అవుట్ చేసుకునే ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్న తీరే బాధాకరం. ప్రజా సమస్యలపై పెట్టాల్సిన ఫోకస్ ను, కేవలం తనకు నచ్చని వారిపై పెట్టి, ప్రజల్లో తానేదో అనే కటింగ్ విన్యాసాలు చేస్తూ నవ్వులపాలవుతున్న విధానం సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తికి కేరాఫ్ గా మారుతున్నది. గోల్ కొట్టడం దేవుడెరుగు., తానే గోల్ లో ఇరుక్కునే ఇబ్బందికర పరిస్థితులు కల్పించుకుంటున్నారు.
===============
జనపదం, బ్యూరో
మాట్లాడిన వారిపై విరుచుకపడడం, సలహాలు, సూచనలు ఇస్తే చిందులేయడం., ప్రజా సమస్యలపై మాట్లాడితే తాండవం ఆడడం., మైకు చేతిలో ఉంటే చాలు మాటలకు బ్రేకుండదు., మీడియా ముందుంటే చాలు ఫోజులకు హద్దుండదు. ప్రతిపక్షాలపై దుమ్మెతిపోసే పోటీలో ఒలింపిక్ మెడల్ సంపాదించినంత దూకుడు., జనాలకు కావాల్సినవి చేయడంలో కనుచూపు మేరలో కూడా కనిపించని నెమ్మదిత్వం. వెరసీ రాష్ట్రంలో హస్తం పాలన అటకెక్కించే పనిలో ఉన్నట్టుగానే తోస్తున్నది., ప్రతిపక్ష పార్టీని ఢీకొనలేక తనను తాను కోల్పోతున్నది.
హరీష్ ట్రాప్ లో రేవంత్..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రజా క్షేత్రంలో తిరుగులేని అభిమానం అనేది ఎవ్వరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన నిఖ్ఖచ్చి అయిన నిజం. ప్రతిపక్షంలో కూడా ఆయన ప్రజల పక్షాన పోరాడుతున్న తీరు కాంగ్రెస్ సర్కార్ కు మరింతగా మింగుడు పడని విధంగా మారింది. ఊదాసీనతతో ప్రభుత్వం పట్టించుకోని పనులను ఆయన గుర్తు చేస్తూ సాగుతున్న విధానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అందుకే హరీష్ రావే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి మాటల యుద్ధం ప్రకటిస్తున్న తీరు ప్రతి సందర్భంలో చూస్తున్నదే. శత్రువుగా భావించిన హరీష్ ను నిద్ర పట్టకుండా చేస్తానన్నే ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కొద్దికొద్దిగా ఆయన ట్రాప్ లోనే పడ్డ దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరీష్ రావును ఇబ్బందుల పాలు చేస్తే ఇక తన జోలికొచ్చే వారే లేరనే అతి విశ్వాసంతో ఉన్న సీఎం హరీష్ ప్రజా బలాన్ని ఢీకొనలేక ఆయన వలయంలోనే ఇరుక్కుంటున్నారు. పైకి హరీష్ ను పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ప్రకటనలు, నిందలు., తిట్ల దండకం అందుకుంటూనే లోలోపల మాత్రం హరీష్ చెప్పిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆయన ప్రజా క్షేత్రంలో నిలదీస్తున్న వాటిపైనే సమీక్షలు, ఇతరాత్ర అధికారులతో వివరాలు తెప్పించుకుని ఆరాలు తీయడం చేస్తుండడం పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా చూపుతున్నది. భయం ఉన్నచోటే జాగ్రత్త ఉన్నట్టుగా హరీష్ అంటే, ఆయన నిలదీసే విషయాలపై సీఎం అండ్ టీంకు నిజంగా భయం ఉండడంతో జాగ్రత్తగా ముందుకు సాగాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు.
ఏదో చేయబోతున్నట్టుగా కలరిస్తూ అడ్డంగా దొరికిపోతూ..
ప్రతిపక్షంలో కీలక నేతగా భావించి హరీష్ రావు అసెంబ్లీ వేదికగానే కాకుండా సమయం చిక్కిన ప్రతి సందర్భంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హస్తం సర్కార్ చేస్తున్న చిత్రవిచిత్రమైన ప్రకటనలను తిప్పికొడుతూ , ఆధారాలతో సహాఅంతా సవ్యమే అనే సంకేతాలను ప్రజలకు చేరవేస్తున్న హరీష్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి అండ్ టీం ఏదో చేస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. తమను తాము ప్రజల్లో పలుచన కాకుండా చూసుకోవాలనే ఆతృతలో గత సర్కార్ హయాంలో సాగించిన పలు పనులకు మించి ఇంకా ఏదో చేస్తున్నామని చూపుకోవాలని ప్రతి సందర్భంలో తప్పులో కాలేస్తున్నారు.
పనులన్నీ పాతరేసి హైడ్రానే పట్టుకు వేలాడుతూ…
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు హడావుడిగా నెరవేర్చినట్టుగా కలరింగ్ ఇచ్చి, ఆ తర్వాత అటకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. మొక్కుబడిగా కొన్ని ప్రారంభించారేగానీ అన్నదాతల విషయంలో మాత్రం సర్కార్ తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుంటున్నది. రుణమాఫీ దేవుడెరుగు, కనీసం పంటల సాయం రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ప్రకటించకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేఖత పెరుగుతున్నది. దీంతో ఎలాగైనా ప్రతిపక్షాలు నిలదీస్తున్న విషయాన్ని నిలువరించి, అందరి చూపు ఓ కేంద్రంగా సాగించాలనే హైడ్రా పేర చూపు మళ్లించిందని స్వయంగా కాంగ్రెస్ లోని సీఎం వ్యతిరేక శక్తులే సెలవిస్తున్నాయి. ఏది మాట్లాడినా హైడ్రానే బూచీగా చూపడం, ఏ పని విషయమైనా ప్రశ్నిస్తే గత ప్రభుత్వం చేసిన తెలివి తక్కువ పనులతోనే ఇప్పుడీ పరిస్థితులు తలెత్తాయని బుకాయించడం పరిపాటిగా చేసుకుంటున్న తీరు అంతా గమనిస్తూనే ఉన్నారు.
సీఎం తీరుపై మంత్రులే పెదవి విరుస్తున్న స్వయంకృతం..
ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై విపక్షాల మాట పక్కనబెడదాం., స్వయంగా ఆయన మంత్రివర్గంలోని వారే పెదవి విరుస్తున్నారు. ఒంటెత్తు పోకడలతో పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని పలువురు అధిష్టానం వద్ద ఫిర్యాదులు కూడా చేశారు. కొత్తగా వచ్చిన వారికి ఏమీ తెలుస్తుందని, అలాంటి వారితో పార్టీ దీర్ఘకాలంలో ఎంతో కోల్పోవాల్సిందే తప్ప, పొందేదేమీ ఉండదని అధినేత్రి సోనియా, అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ కు తెలియజెప్పినట్టు వినికిడి. రాష్ట్రంలో అంతా తానే అనే ధోరణిని పైకి కనిపించకుండా లోలోపల ఇష్టారీతిగా చేస్తున్నాడని సీనియర్లు తీవ్ర అసహనంతో ఆయన చేస్తున్న తెలివి మీరిన పనులపై పెదవి విరిచి అవకాశం కోసం చూస్తున్నారు.
గ్యారంటీలన్నీ గయాబ్..
గ్యారంటీల పేరుతో చేస్తున్న గారడీ ప్రజలకు తెలిసిపోవడంతో సీఎం మరింత అసహనానికి గురవుతున్నారు. ప్రతిపక్ష నేత హరీష్ రావు నిత్యం రేవంత్ గుండెల్లోనే నిద్రిస్తానని చెప్పడంతో మింగుడు పడలేక సీఎం మరింత ఆగమాగం అవుతున్నారు. కేబినెట్ భేటీలో ప్రధాన సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలను కనుగోవాల్సిన సమయంలో కేవలం హైడ్రా పేరుతో హడావుడి చేసి చేతులు దులుపుకున్న తీరు మరింత విమర్శలకు తావిస్తోంది. స్వయంగా మంత్రులే సీఎం తీరును తప్పుబడుతున్నారు. హైడ్రా ఒక్కదానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం, మిగతా వాటిని పట్టించుకోకపోవడంతో మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదని పేర్కొంటున్నారు. సీఎం మాట్లాడితే ప్రతిపక్షాలపై విరుచుపడుతున్న తీరు స్వయంగా ఆయన కేబినెట్ సహచరులే తప్పబడుతున్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షాలను దుయ్యబట్టడానికి కేటాయించడమేంటని పెదవి విరుస్తున్నారు. హరీష్ రావు చాలెంజ్ విసిరితే ఆ దిశగా ముందుకెళ్లాలేగానీ, ప్రతి విషయాన్ని ఆయనకు కౌంటర్ అన్నట్టుగా చేస్తే ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు. ఆ మాటకొస్తే సీఎం కేవలం తన ఆలోచనలు ఆచరణలో పెడుతూ సహచరులవి పట్టించుకోవడం లేదని అసహనం వెలిబుచ్చుతున్నారు. ప్రతిపక్షం భయంతో అందునా హరీష్ రావు ట్రాప్ లో పడి పాలనను గాలికి వదిలేసినంత పనిచేస్తున్నాడని వాపోతున్నారు. ఏదిఏమైనా ప్రతిపక్షం గట్టిగా ఉంటే పాలక పక్షం దిగిరావాల్సిందే అనడానికి హరీస్ రావు మొండితనం, బీఆర్ఎస్ సాహసం ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయి.