🔹 తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వండి
🔹 స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సహాయం అందజేయండి
🔹 క్రీడా సంస్థల అప్‌గ్రెడేషన్ డీపీఆర్‌లను ఆమోదించండి
🔹 కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
ఢిల్లీ:
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్తులో ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని, 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు వేదికగా హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి ముఖ్యమంత్రి గారు శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రి మాండవీయ గారితో సమావేశమయ్యారు.
తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల్లో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద నిధులు విడుదలను పెంచాలని కేంద్ర మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, సెంట్రల్ యూనివర్సిటీలోని (UoH) షూటింగ్ రేంజ్, ఎల్ బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలలో మౌలిక వసతుల అభివృద్ధికి తాము ఇప్పటికే పంపించిన డీపీఆర్‌లను ఆమోదించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.