కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం (Rain) దంచికొట్టింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సూర్యుడు నిప్పులు కురిపించాడు. అయితే ఒక్కసారిగా ఈదురు గాలులు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మరికొద్ది సేపట్లోనే గాలులకు వర్షం తోడయింది. కరీంనర్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన బహిరంగ సభ రద్దయింది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. అయితే భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలకూలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఈ నేపథ్యంలో సభను రద్దుచేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
మంథనిలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా, అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. ఆ సమయంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కాగా, మరోపక్క, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. వేములవాడ, జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కరీంనగర్‌తో పాటు హుజురాబాద్‌లో ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మరోవైపు రేపు ఉదయం వేములవాడలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సభ కోసం తీసుకొచ్చిన సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. వర్షం తగ్గిన తరువాత నిర్వాహకులు మళ్లీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
భారీ వర్షానికి కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో కూలిన టెంట్లు
కరీంనగర్ – ఒక్కసారిగా ఈదులుగాలులతో కూడిన వర్షం రావడంతో నేడు కరీంనగర్ SRR కళాశాల గ్రౌండులో జరగనున్న కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో కుప్పకూలిన టెంట్లు. pic.twitter.com/QYAdKSKk7u
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024