CM Revanth Reddy | హైదరాబాద్ : డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరయ్యారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమీక్షకు హాజరు అయ్యారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్‌గా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్‌ను బ్రేక్ చేయాలని ఆదేశించారు. సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేయండని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్‌గా పని చేసేవారిని ప్రోత్సహించండని చెప్పారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.