Click to view JanaPadham-12-08-2024 E-Paper
పనులు పీక్స్..
పబ్లిసిటీ వీక్….!
సీఎం అమెరికా పర్యటన అద్భుతం.. పీఆర్ లో పూర్తి వైఫల్యం..
ఊహించని ఒప్పందాలు.. లెక్కకు మించి డీల్స్..
పక్కా ప్లాన్ చేసిన ఉన్నతాధికారి జయేష్
ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ ఫెయిల్యూర్స్..
మంచేమోగానీ, చెడు ప్రచారమే ఎక్కువైంది..
బీఆర్ ఎస్ సోషల్ మీడియా ముందు హస్తం బలాదూర్..
‘తప్పదు మరీ.. ఆఫ్ట్రాల్ సిగరెట్టు పెట్టే నన్ను కాల్చకు.., చస్తావ్… అని ప్రచారం చేసుకున్నప్పుడు నాలాంటి వాడు కూడా నన్ను కెలక్కు.. పోతావ్.. అని చెప్పుకోవడంలో తప్పులేదు సార్..’ అని ఓ సినిమాలో డైలాగ్. అవును పబ్లిసిటీ అనేది తప్పుదు మరి. ఎప్పుడో ఒకప్పటిలా ‘పనిచెయ్.. ఫలితం ఆశించకు..’ అనేది ఔట్ డేటెడ్. చేసింది చెప్పుకోవాల్సిందే.., చెప్పకపోవడం ఫెయిల్యూరే. సీఎం పర్యటన తాలూకు వ్యవహారం కూడా అదే విషయాన్ని తెలియజెప్పుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో ఎన్నో మల్టీ నేషన్ కంపెనీలతో ఊహించని రీతిలో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పనుల్లో పీక్స్ గా ఉన్నా, పబ్లిసిటీ మాత్రం వీక్ గా ఉండడంతో పొగడ్తలేమోగానీ, పైకెళ్లి అపవాదు మూటగట్టుకునే పరిస్థితి దాపురించింది.
========================
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసుకుంటున్న ఒప్పందాలు ఎవరూ ఊహించనవి. అమెరికా పర్యటనను పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి జయేష్ రంజన్ అద్భుతంగా డీల్ చేస్తున్నారు.
ముందుగానే ఆయన ఏర్పాట్లు చేసి పెట్టి పక్కా ప్రణాళికతో అన్నీ జరిగేలా చేశారు. కానీ, వాటికి ప్రచారం తెచ్చుకునే విషయంలో, ప్రజలకు సమాచారం చేరే వేసే విషయంలో విఫలమయ్యారు. ఎన్నో అద్భుతాలు సాధించినా వాటిపై అసలు ప్రచారాలు చేసుకోక పోగా, నెగెటివ్ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
పీఆర్ టీం వైఫల్యమే..
ముఖ్యమంత్రి పది రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం మల్టీ నేషన్ కంపెనీలతో చాలా వాటిని కవర్ చేసింది. కొత్తగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడమో, విస్తరించే ప్రణాళికలకో ఒప్పించారు. చాలా డీల్స్ కు ఎంవోయూలు చేసుకున్నారు. రేవంత్ స్థానంలో కేటీఆర్ పర్యటన గనుక ఉండి ఉంటే చేసే హడావుడి మరోలా ఉండేది. ఆ స్పందన కూడా వేరే లెవల్లో వచ్చేది. ఆ పార్టీ శ్రేణులు ప్రతిదానిని ప్రజలకు చేరే వేసేలా, ఇతర పార్టీల వారు సాధించనివి ఎన్నో తాము తేలిగ్గా కేటీఆర్ చేశాడనే రేంజ్ లో పబ్లిసిటీ చేసుకునేవారు. ఇప్పుడు రేవంత్ విషయంలో అలాంటి ప్రచారం జరగకపోవడానికి ప్రధాన కారణం చేస్తున్న వాటిని ప్లాన్డ్ గా చూసుకోవల్సిన పీఆర్ టీం విఫలమనే అభిప్రాయం వినిపిస్తోంది.
పాసిటివ్ కాస్త నెగటివ్..
సీఎం రేవంత్ పర్యటనలో కంపెనీలు.., చేసుకున్న ఒప్పందాలు.., సమావేశాల వివరాలతో ఎప్పటికప్పుడు వీడియో లతో సహా అప్ డేట్స్ మీడియాకు అందాల్సి ఉంది. కానీ, ఈ విషయంలో విఫలమయ్యారు. అదీకాకుండా ఆయా కంపెనీల గొప్పతనం, అవి రాష్ట్ర రాజధానికి వస్తే కలిగే లాభాలు ఏంటో వివరించేలా ప్రణాళికలు చేయాల్సి ఉండే. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువే అని చెప్పాలి. దీంతో పాజిటివ్ ప్రచారం జరగకపోగా, ఎదుటి పక్షం ఒకటి, రెండు కంపెనీల పేర్లను చూపించి పూర్తిగా నెగెటివ్ ప్రచారం చేయడం మరింత మైనస్ గా మారింది.
సోదరుడి పేరుతో అప్రతిష్ట..
సీఎం రేవంత్ రెడ్డి చేసిన డీల్స్ ఎన్నో గొప్పవే అయినా బీఆర్ఎస్ మాత్రం వాటిని పసలేనివి అన్నట్టుగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. స్వచ్ఛ బయోలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఓ డైరెక్టర్ అనే కారణంతో చేసిన ప్రచారంతో మొత్తం సీఎం పెట్టుబడుల టూర్ ను పక్కదారి పట్టించింది. బీఆర్ ఎస్ సోషల్ మీడియా బలం ముందు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలహీనతలు బయటపడ్డాయి. గులాబీ పార్టీ శ్రేణులు చేసిన విషప్రచారాన్ని తిప్పికొట్టడంలో హస్తం పార్టీ ఆ విభాగం ముమ్మాటికి అపకీర్తినే మూటగట్టుకోవాల్సి వచ్చింది. గట్టిగా పని చేయడమే కాదు, ఆ పనిని ప్రజలకు చేరవేయడంలో కూడా సమర్థవంతంగా చేయలేదేనే అభిప్రాయం.. వ్యక్తమవుతున్నాయి. అదే విషయం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విషయంలో స్వయానా కాంగ్రెస్ పార్టీ లోనూ వినిపించడం గమనార్హం.