Saturday, December 28, 2024
HomeTelanganaCM comments | ఖతం..?! కేసీఆర్ కనుమరుగు..

CM comments | ఖతం..?! కేసీఆర్ కనుమరుగు..

Janapadham_EPaper_TS_30-10-2024

ఖతం…?!

కేసీఆర్ కనుమరుగు..
ఏడాది తర్వాత పేరే వినిపించదు
కొడుకు తో తండ్రిని ఖతం చేయించా..
తర్వాత బావతో బావమర్దిని చేయిస్తా..
హరీష్ ను ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు..
వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా ..
చిచ్చుబుడ్లకు బదులు కేటీఆర్ బావమరిది ఇంట్లో సారా బుడ్లు
రాజ్ పాకాల తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయిండు..?
నవంబర్ 1 న మూసీ పునరుజ్జీవం పనులకు శంకుస్ధాపన
బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహం ఏర్పాటు
మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్

ఖతం.. టాటా.. బాయ్ బాయ్… రాహుల్ డైలాగులను రేవంతుడు తూచ తప్పకుండా చేసి చూపుతున్న ఆనవాళ్లు.. కాదుకాదు.., అనుమానాలు. స్వయంగా సీఎం చెప్పిన మాటల్లోనే ఈ విషయం తెలిసిపోతున్నది. రాజకీయ దురంధరుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను కనుమరుగు చేశానని, ఇంకో యేడాది తర్వాత ఆ పేరే వినిపించదని చెప్పిన తీరు చూస్తే ముఖ్యమంత్రి ఎంతటి ఆక్రోషంతో ఉన్నాడో తెలిసిపోతున్నది. టార్గెట్ కల్వకుంట్ల ఫ్యామిలీ అన్నట్టుగా రాజకీయం సాగిస్తూ రాష్ట్రాభివృద్ధి కంటే కూడా వారి పతనంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తున్నది. తన కల నెరవేరిందని, ఇక అంతకుమించిన ఆశలేమీ లేవని, మిగిలింది ఆ ముగ్గురి విషయం తేల్చడమే అని డైరెక్ట్ గా చెప్పిన రేవంత్ రెడ్డి మాటలతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి..0

=================

జనపదం, బ్యూరో

ఏడాది తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వినిపించదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆయన ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమన్న సీఎం ఏడాదిలోగా కేసీఆర్ రాజకీయానికి ముగింపు పలుకుతానన్నారు. ఈ వ్యూహంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ నే పావుగా వాడానని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కేటీఆర్ ను రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్‌రావును వాడుకుంటానని స్పష్టం చేశారు. తర్వాత బావను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని చెప్పారు. చివరకు బావతో కేటీఆర్ రాజకీయం ముగుస్తుందన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో చిట్ చిట్ చేసిన ఆయన రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాలం చెల్లిన మెడిసిన్…
రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయం కాలం చెల్లిన మందులాంటిదని సెటైర్లు వేశారు. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌, విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోందన్నారు. విచారణ సంస్థల రిపోర్టుల ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కావాలన్న తన కల నెరవేరిందన్న సీఎం దీనికంటే పెద్ద కలలేమీ తనకు లేదన్నారు. ప్రస్తుతం ప్రజలకు మంచి చేయడమే నా కల, కర్తవ్యం అని అన్నారు. రైతులు, పేదలు, మహిళలు అందరూ సంతోషంగా ఉండాలన్నారు. రైతులు, మహిళలు ఆనందంగా ఉంటే ఆ రాజ్యం సంతోషంగా ఉన్నట్లే అని అన్నారు.

దీపావళి దావతా అలా కూడా చేసుకుంటారా..?
రాష్ట్ర రాజకీయాలకు కుదిపేసిన జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ లో జరిగిన విందుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి అంటే చిచ్చుబుడ్లను చూస్తాం కానీ కేటీఆర్ బావమరిది ఇంట్లో సారా బుడ్లను చూశామన్నారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదని ఎద్దేవా చేశారు. రాజ్‌ పాకాల ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్‌, విదేశీ మద్యం ఎందుకు దొరికాయన్నారు. ఆ విందులో పాల్గొన్న ఒకరికి కొకైన్ పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఆ కొకైన్ ఇచ్చింది రాజ్ పాకాలనేనని విజయ్ మద్దూరి చెప్పడంతో రాజ్ పాకాలను ఏ వన్ గా చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వారి ఇళ్లల్లో సోదాలు చేశారనీ అదే వివాదాస్పదం అయిందన్నారు. తర్వాత రాజ్ పాకాల హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయాన్ని హైకోర్టు ఇచ్చిందని చెప్పారు. రెండు రోజుల తర్వాత రాజ్ పాకాల పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉందనీ ఆయనకు డ్రగ్ టెస్టులతో పాటు విజయ్ మద్దూరికి ఇచ్చిన కొకైన్ ఎక్కడి నుంచి తెచ్చారో కూడా ప్రశ్నించే అవకాశం ఉందన్నారు.

నవంబర్ 1న మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం..
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగే కానీ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నవంబర్ 1న మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. ఎవ్వరు ఎంత అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించామని, ఇప్పుడు వెనక్కి వెళ్లేది లేదన్నారు. మొదటి దశలో గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21 కి.మీ వరకు అభివృద్ధి చేస్తామన్నారు. నది పరివాహక ప్రాంతాలను ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తామన్న సీఎం దాని వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామన్నారు. నెల రోజుల్లో డిజైన్లు పూర్తి అవుతాయన్నారని వెల్లడించారు.

15 రోజుల్లోనే టెండర్లు..
మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని చెప్పిన సీఎం దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామన్నారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహ ఏర్పాటుతో పాటు అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం చేపడతామన్నారు. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ భూములు కూడా ఆడిగామన్నారు. 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే రూ.140 కోట్లతో డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చామన్నారు. మూసీ నిర్వాసితులకు ఉచితంగా విద్య, అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూసీ కోసం భూములు ఇచ్చే వారికి వంద శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. మూసీ కోసం ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని ప్రకటించారు. మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. కేటీఆర్‌ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటారని, మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్‌ తన ఆలోచనలు చెప్పొచ్చని సూచించారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సీఎం తెలిపారు. తనను నేరుగా కలవవచ్చని, తనను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలకు అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి తమ అభ్యంతరాలు చెప్పొచ్చన్నారు. మూసీ పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

పాదయాత్ర చేస్తా..
మూసీ విషయంలో వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు కూడా తనతో కలిసి రావాలని సవాల్ విసిరారు. పాదయాత్రలోనే మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదామని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చర్చతో ప్రజలకు అవగాహన కలిగిందని తెలిపారు. మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసిందని అన్నారు. తాను ఫుట్‌బాల్‌ ప్లేయర్‌నని, గేమ్‌ ప్లాన్‌పై తనకు పూర్తి స్పష్టత ఉందని వెల్లడించారు. 55 కి.మీ. మూసీ పునరుజ్జీవం పూర్తి అయితే అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ నుంచే 65 శాతం ఆదాయం వస్తోందని, మరింత పెంచుతామని సీఎం వివరించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు