Saturday, December 28, 2024
HomeTelanganaPM Vs CM | అంత తేలికా..? ఆపు చాలికా..?!

PM Vs CM | అంత తేలికా..? ఆపు చాలికా..?!

Janapadham_EPaper_TS_03-11-2024

*అంత తేలికా..?
ఆపు చాలికా…?!*

పీఎం వర్సెస్ సీఎం

ఫేకెవరు… ఫెయిరెవరు…?
మోదీ ట్వీట్ కు రేవంత్ కౌంటర్..
ఖర్గే మాటలతో రాచుకున్న కుంపటి..
పోటాపోటీగా ట్వీట్ల యుద్ధం…
పదివేల రోజులిచ్చినా సరిపోదు.. : బండి
సీఎంకు సంజయ్ ఘాటు బదులు..

అంత తేలికేం కాదని మోదీ., మీరు చెప్పొచ్చు కానీ చాలికా.. అని రేవంత్. పీఎం వర్సెస్ సీఎం. మౌనంగా సాగిస్తున్న యుద్ధమిది. రాతలు, మాటల మధ్య సమరమిది. పార్టీ శ్రేణులకు చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన సూచన మొత్తం ఎపిసోడ్ కు ఆజ్యమైంది. ఎన్నికల్లో ఆచరణ సాధ్యమైన, ఆర్థికంగా చేయగలిగే హామీలు మాత్రమే ఇవ్వండని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీలోని మహామహుల ముందు ఆ స్థాయి వ్యక్తి మాట్లాడిన ముచ్చట అంత తేలిగ్గా తీసుకునేది కాదని ఇరుగుపొరుగు పార్టీవాళ్లు అనుకోవడంలో తప్పు లేదు., తప్పదు కూడా. సరిగ్గా ఆ విషయాన్ని పట్టుకుని తన ఎక్స్ వాల్ లో ప్రధాని మోదీ ‘ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ కాంగ్రెస్’ అని రాసుకొచ్చారు. అది చూసిన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకేమోగానీ మనోడికి మాత్రం మండినట్టుంది. వెంటనే తనదైన శైలిలో కౌంటర్ అటాక్ ఇచ్చి సంతృప్తిపర్చుకున్నట్టు అనిపిస్తోంది.

=====================

జనపదం, బ్యూరో

హామీలు వర్సెస్ ఆచరణలు., వాగ్దానాలు వర్సెస్ వాయిదాలతో కాలం నెట్టుకు రావడం మధ్య రాజుకున్న సమరమిది. ఎన్నిక ప్రచారం వేళ కుమ్మరించిన వరాలు, ఎడాపెడా ఇచ్చిన వాయినాలకు ఫలితాల అనంతరం వాటిని తీర్చడానికి మీనమేషాలు లెక్కించే యత్నాలకు మధ్య రగులుకుంటున్న యుద్ధమిది. కాంగ్రెస్ చీఫ్ నోటి నుంచి వెలువడిన మాటలకు నిగుఢార్థం తీసి రాతలు రాసిన పీఎం కు కౌంటర్ గా సీఎం మళ్లీ తనదైన విధానంతో విరుచుకుపడిన వివరణ… ఇలా మొత్తంగా హామీలు.., అమలు.., సాధ్యాసాధ్యాలపై సాగుతున్న చర్చంతా మీడియాలో రచ్చరచ్చ. ఇప్పటికిప్పుడు బేరీజులేసే పరిస్థితులు లేకపోయినా, కాలగమనంలో అర్థమేంటో తెలియాల్సిందే అనిపించే విషయమిది.

=================

ఎప్పుడూ ఏదో ఓ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం. దుమ్మెత్తిపోసుకునే క్రమంలో గోతులు తవ్వుకోవడం., ఒకరి తప్పులను మరొకరు ఏకరువు పెట్టుకోవడం పరిపాటే. అందునా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం కోసం తప్పని సమరం. ఈ క్రమంలోనే ప్రతి విషయం ఒక ప్రత్యేకంగానే భావిస్తుంటారు నేతలు. అందులో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీ ముఖ్యుల సమావేశంలో ఆర్థికంగా ఇబ్బందిలేకుండా ఉండే హామీలనే ఇవ్వాలనే ఓ సూచన చేశారు. దీంతో ఇంచుమించు ఆచరణ సాధ్యం కానివి వద్దని, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నదనే అర్థంలో ఆయన తన మాటలను కొనసాగించారు. దీంతో ఆ మాటల వెనకున్న అసలు మర్మం ఏంటో పీఎం మోదీ తనదైన స్టైల్ లో ఎక్స్ వేదికగా వివరించారు.

ప్రజల దృష్టిలో పల్చనకాకుండా..
నిజానికి మల్లికార్జున ఖర్గే మాటలు ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చేవిగా భావించాల్సి ఉంటుంది. ప్రజలను మోసం చేయకుండా, చేస్తామన్ని చేసేంత సత్తా ఉండేలా మనకు మనం జాగ్రత్త పడాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఎన్నికల వేళ నోటికొచ్చింది వాగుతు, ఏదిపడితే అది హామీలు గుప్పిస్తూ, ఎముకలేని నేతలుగా ఫోజులు కొట్టి గెలిచిన తర్వాత వాటిని తీర్చడానికి ఆస్తులు పోగేయలేక, అంతకు ముందున్న ప్రభుత్వాలు చేసిన అప్పులను పూడ్చలేక జనం దృష్టిలో పలుచనై పార్టీ పరువు తీయొద్దనే ధోరణిలో ఆయన తన వ్యాఖ్యలు చేశారు. అధికారమే పరమావధిగా, ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పార్టీలు చేస్తున్న వికృత క్రీడలో ప్రజలు అన్ని సందర్భాల్లో పావులు అవుతారనుకోవడం మూర్ఖత్వమే తప్ప మరోటి కాదు, తప్పకుండా ఇచ్చిన హామీల నెరవేర్చడంపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.

ఖర్గే వ్యాఖ్యలకు సైటైర్ గా పీఎం..
మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను పీఎం చాలా సైటైర్ గా వివరించారు. కాంగ్రెస్ కు హామీల అమలు అంత తేలికేం కాదనే విషయం అర్థమైందని పేర్కొన్నారు. వాగ్దానాలు చేయడం సులభమేగానీ, వాటిని అమలు చేయడం చాలా కష్టమైన పని అని కాంగ్రెస్ గ్రహిస్తోందని తెలిపారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ఇప్పుడు జనం ముందు ఘోరంగా విఫలమై నిలబడ్డారని విమర్శించారు. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లలో పాలన మొత్తంగా కుంటుపడిందని వివరించారు. ఆఖరులో ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ కాంగ్రెస్ అని తనదైన విధానంతో ప్రధాని ట్వీట్ చేశారు. ఇలా వ్యాఖ్యలు చేయడంపై సహజంగానే తెలంగాణ సీఎం రేవంత్ కు ఎక్కడో మండి తనదైన విధంగా వివరణ ఇచ్చారు.

బీజేపీకన్నా బెటర్..
బీజేపీ పాలన కన్నా తెలంగాణలో తమ పాలన అద్భుతంగా ఉందని, తమను ఒకరు వేలెత్తి చూపాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఎంకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బొందలు పూడ్చుకుంటూ, పాలనను గాడిలో పెట్టే పనిలో తలమునకలై ఉన్నామని తమ పాలనపై మరకలు అంటించాలని చూడడం సరికాదని ఘాటుగానే విమర్శించారు. తాము పగ్గాలు చేపట్టి కేవలం పదినెలలు కూడా కాలేదని, అప్పుడే ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. ఇలా ఒకరికి ఒకరుగా కౌంటర్లు ఇచ్చుకుంటూ రాజకీయాలను హాట్ హాట్ గా మార్చారు.

RELATED ARTICLES

తాజా వార్తలు