CM Siddaramaiah | ప్రేమ అనేదో ఓ మధుర జ్ఞాపకం. జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడ్డవారికి.. ప్రేమించిన వ్యక్తికి ఆ బంధం జీవితాంతం తీపిగుర్తుగా మిగిలిపోతుంది. యవ్వనం పురివిప్పేవేళ.. జీవనగమనంలో ఓ కొత్త తోడు కోసం మనసు ఆరాటపడుతున్న వేళలో ఎదురయ్యే ప్రేమభావం సఫలమైనా, విఫలమైనా అది ఓ అద్భుతమైన భావంగా నిలిచిపోతుంది. ప్రేమలోపడ్డ కొన్ని జంటల్లో కొందరికీ అన్నీ అనుకూలించి పెళ్లితో ఒక్కటవుతుండగా.. మరికొందరు కుటుంబ సభ్యుల అభ్యంతరాలు ఇలా పలు కారణాలతో విడిపోయినవారున్నారు.
అయితే, సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి తాను సైతం భగ్నప్రేమికుడినేనని.. కొన్ని కారణాలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానన్నారు. ఆయన ఎవరో కాదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఇటీవల కర్ణాటకలో సామూహిక కులాంతర వివాహాలు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తన కాలేజీ రోజులను గుర్తు తెచ్చుకున్నారు. కులాంత వివాహాలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కాలేజీ రోజులు, తన లవ్‌స్టోరీని తెలిపారు. దాంతో వేకదిపై చప్పట్లు, కేకలతో హోరెత్తింది. పెళ్లి తంతు పూర్తయ్యాక వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ కులాంతర వివాహాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. కుల వివక్ష రూపుమాపేందుకు ఇలాంటి పెళ్లిళ్లు తోడ్పడతాయని చెప్పారు.
వాస్తవంగా తాను అప్పట్లోనే కులాంతర వివాహానికి మొగ్గు చూపానని, అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు అంగీకరించలేదన్నారు. చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని అనుకొని తల్లిదండ్రులను కలిశానన్నారు. కానీ, కులాల వేరుకావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదన్నారు. దాంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక పోయానని.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో తమ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని సిద్ధరామయ్య తన లవ్‌స్టోరీని రివీల్ చేశారు. కులాంతర వివాహాలు, వెనకబడిన కులాలను ఆర్థికంగా పైకి తీసుకురావడం ద్వారా సమాజంలో సమానత్వం సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.