లోక్‌సభ ఎన్నికల వేళ వినియోగదారులకు దేశీయ చమురు కంపెనీలు శుభవార్త అందించాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు (Gas Cylinder Price) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే ఈ గుడ్ న్యూస్ గృహ వినియోగదారులకు కాదులేండి..! కమర్షియల్ గ్యాస్ కస్టమర్లకు. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.19 మేర కంపెనీలు తగ్గించాయి. వీటితోపాటు 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ రేట్లలో కోత విధించాయి.
దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ ధర రూ.1745.50కు తగ్గింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1859, ముంబైలో రూ.1698.50, చెన్నైలో రూ.1911గా ఉన్నాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మార్చి 8న సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు కానుకగా 14 కేజీల ఎల్పీజీ బండ ధరను రూ.100 తగ్గిస్తున్నామని చెప్పారు. దీంతో అప్పటివరకు రూ.1000కి దగ్గరగా ఉన్న సిలిండర్ ధరలు రూ.850 పైచిలుకుకు చేరాయి.
అమెరికాలో ముడి చమురు నిల్వలు పెరగడంతోపాటు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో వరుసగా మూడో రోజూ ప్రపంచ చమురు ధరలు పడిపోవడంతో తాజా తగ్గుదలకు దోహదపడింది. గతనెలలో కూడా దేశంలోని చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 19 కేజీల గ్యాస్ సిలిండర్లతో పాటు 5 కేజీల ఫ్రీట్రేడ్ సిలిండర్ల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే.