Mandi | న్యూఢిల్లీ : దేశ ప్రజల దృష్టి అంతా ఇప్పుడు ఆ నియోజకవర్గంపైనే ఉంది. చివరి దశలో ఆ లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మరి ఆ నియోజకవర్గం ఏందంటే హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. మరి కంగనాను విక్రమాదిత్య ఢీకొడుతారా..? లేదా..? అనేది జూన్ 4వ తేదీనే తేలనుంది.
విక్రమాదిత్య సింగ్.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ కుమారుడు. తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. మండి నుంచి ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడికి అవకాశం కల్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం రామ్ స్వరూప్ శర్మ గెలిచారు. 2021లో ఆయన చనిపోవడంతో.. ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభా సింగ్ గెలిచారు.
విక్రమాదిత్య సింగ్ 1989 అక్టోబర్ 17న జన్మించారు. వీర్ భద్ర సింగ్ ఆరు సార్లు సీఎంగా పని చేశారు. ప్రతిభా సింగ్ మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సిమ్లాలోనే విక్రమాదిత్య పాఠశాల విద్య పూర్తయింది. డిగ్రీ ఢిల్లీలో పూర్తి చేశారు. ఎంఏ హిస్టరీ చదివారు. ఇక హిమాచల్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా 2013లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017లో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిమ్లా రూరల్ సీటు నుంచి గెలుపొంది, తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. 2022లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీడబ్ల్యూడీ మినిస్టర్‌గా సేవలందించారు. యూత్ సర్వీసెస్, స్పోర్ట్స్ మంత్రిగా కూడా పని చేశారు.
సుఖ్‌విందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విక్రమాదిత్య 2024 మార్చిలో తిరుగుబాటు చేశారు. తన మంత్రి పదవులకు కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన తండ్రిని అగౌరవపరిచిందని బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత సిమ్లాలో పార్టీ నాయకులు భూపిందర్ సింగ్ హుడా, భూపేష్ భఘేల్, డీకే శివకుమార్‌తో సమావేశం అనంతరం విక్రమాదిత్య తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.