Friday, December 27, 2024
HomeTelanganaT PCC | ఆ కుర్చీ అయితేనే బెట‌ర్.. సెంటిమెంట్‌గా భావిస్తున్న‌ మ‌హేశ్ కుమార్ గౌడ్

T PCC | ఆ కుర్చీ అయితేనే బెట‌ర్.. సెంటిమెంట్‌గా భావిస్తున్న‌ మ‌హేశ్ కుమార్ గౌడ్

T PCC | తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఆ పార్టీ సీనియ‌ర్ నేత బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆదివారం మ‌ధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల‌కు బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. ఈ క్ర‌మంలో గాంధీ భ‌వ‌న్‌లో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్న మ‌హేశ్ కుమార్ గౌడ్ ఓ కీలక నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ కుర్చీలో అయితే ఆశీనులు అయ్యారో.. ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా అదే కుర్చీని వాడాల‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్న‌ట్లు గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా వాడిన కుర్చీనే.. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి కూడా వాడుతాన‌ని, ఆ చైర్‌ను పీసీసీ అధ్య‌క్షుడి చాంబ‌ర్‌లోకి మార్చాల‌ని గాంధీ భ‌వ‌న్ సిబ్బందికి మ‌హేశ్ కుమార్ గౌడ్ సూచించిన‌ట్లు స‌మాచారం. మ‌ధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్సీ సమక్షంలో రేవంత్‌ రెడ్డి వద్ద నుంచి మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకుంటారు. అక్కడే పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేశ్​కుమార్ గౌడ్​కు రేవంత్‌ రెడ్డి అప్పగిస్తారు.

మొదట మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్దకు ఆయన చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరువీరుల స్థూపం వద్ద మహేశ్​ కుమార్ గౌడ్‌ నివాళులు అర్పిస్తారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా ఇందిరాభవన్‌ వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు. సభ నిర్వహణ వద్ద కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నియోజకవర్గ ఇంఛార్జిలకు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు కూర్చోడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రెండు వేలకుపైగా కుర్చీలు సభ వద్ద ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివస్తున్నందున గాంధీభవన్‌ ప్రాంగణలో నిలబడి వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎల్​ఈడీ తెరలు కూడా ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు