మాఫీలో కాంగ్రెస్ మార్క్..
మోసపోయిన అన్నదాత..
పెరిగిన కర్షకులు.. తగ్గిన సాయం..
లెక్కల్లో బొక్కలు.. చెప్పుకోవడానికే గొప్పలు..
జనపదం, బ్యూరో
రైతులకు పంట రుణాలు మాఫీ అంశంలో మాయాజాలం కనిపించింది. మార్గదర్శకాల రూపంలో లక్షల మంది ఈ పథకానికి దూరమైనట్లు తేలింది. నిజానికి గతంలో లక్ష రుణ మాఫీకి 36.68 లక్షల మంది అర్హులుగా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయగా అర్హుల సంఖ్య మాత్రం 22.37 లక్షల దగ్గరే ఆగిపోయింది. 2018లో రూ.లక్ష వరకు రుణమాఫీకి 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఇప్పుడు కాం గ్రెస్ సర్కారు రూ.2 లక్షల వరకు మాఫీకి మూడు విడతల్లో కలిపి సుమారు 22,37,848 మంది రైతులకు వర్తింపజేసినట్లు ప్రకటించింది.
31 వేల కోట్లు కాదు.. 18 వేల కోట్లే..
మూడు విడతల్లో మొత్తం రూ.17,934 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొదటి విడతలో 11,50,193 మంది రైతులకు, రూ.6098.93 కోట్లు నిధులను జమ చేయగా, రెండో విడతలో 6,40,823 మంది రైతులకు, రూ.6190.01 కోట్లు, మూడో విడతలో 4,46,832 మంది రైతులకు రూ.5644.24 కోట్లు నిధులను జమ చేసింది. మూడు విడతల్లో 22,37,848 మంది రైతులు రుణమాఫీకి నోచుకున్నారు. నిజానికి పథకం ప్రకటించినప్పటి నుంచి రూ.31 వేల కోట్లు అవసరమని, రైతుల రుణాలు మాఫీ కోసం ఈ నిధులు సమీకరిస్తున్నామంటూ ప్రభుత్వం అన్ని బిల్లులూ ఆపింది. పైసా పైసా కూడబెట్టి 31 వేల కోట్లు జమ చేశామంటూ అసెంబ్లీలోనూ ప్రకటించారు. కానీ, రుణమాఫీ ప్రక్రియ పూర్తయ్యే వరకు రూ. 17,934 కోట్లతో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంటే.. ముందు నుంచి ప్రకటించిన సొమ్ములో సగం వరకు ఖర్చు అయింది.
మాఫీ 22.37 లక్షల మందికే..!
రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతులు 70 లక్షల మంది ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ లెక్కన కాస్త అటూ ఇటుగా 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ, మూడు విడతల్లో కలిపి ప్రభుత్వం సుమారు 22.37 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నది. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తొలి విడతలో జూలై 18న రూ.లక్ష వరకు రుణాలు ఉన్నవారిలో 11.34 లక్షల మందికి మాత్రమే రూ.6,034.96 కోట్ల రుణాలను మాఫీ చేసింది. జూలై 30న రెండో విడతలో రూ.1.5 లక్షల వరకు రుణం ఉన్నవారిలో 6.40 లక్షల మందికి మాత్రమే రూ.6,190 కోట్లు మాఫీ చేసింది. మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణాలను పంద్రాగస్టున 4.46 లక్షల మందికి రూ. 5644 కోట్లను మాఫీ చేశారు. ఈ లెక్కన మూడు విడతల్లో కలిపి రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 22.37 లక్షలు మాత్రమే. దీంతో దాదాపు 48.25 లక్షల రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోయినట్టే. ఒకవేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్క ప్రకారం రుణం తీసుకున్న రైతుల సంఖ్య 44 లక్షలు అనుకున్నా ప్రభుత్వం 22.25 లక్షల మంది రైతులను రుణమాఫీకి దూరం చేస్తున్నదనే విమర్శలున్నాయి. వాస్తవానికి 2018తో పోల్చితే ప్రస్తుతం రైతుల సంఖ్య భారీగా పెరిగింది. రైతుబంధు లెక్కల ప్రకారం 2018లో కేవలం 50 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 70 లక్షలకు చేరింది. అయినప్పటికీ రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.