Sunday, December 29, 2024
HomeNationalCongress | కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ‌.. నిధులు లేవంటూ పోటీ నుంచి త‌ప్పుకున్న పూరీ...

Congress | కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ‌.. నిధులు లేవంటూ పోటీ నుంచి త‌ప్పుకున్న పూరీ ఎంపీ అభ్య‌ర్థి

భువ‌నేశ్వ‌ర్‌: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. మొన్న సూర‌త్‌లో ఆ పార్టీ అభ్య‌ర్థి నామినేష‌న్‌ను ఎన్నిక‌ల అధికారి తిర‌స్క‌రించ‌డంతో అక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. నిన్న ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి చివ‌రి క్ష‌ణంలో త‌న నామినేష‌న్‌ను ఉపసంహ‌రించుకోవ‌డంతోపాటు ఏకంగా ఆయ‌న కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవని, ఖ‌ర్చుల‌కోసం పార్టీ డ‌బ్బు ఇవ్వ‌డం లేదంటూ తాను పోటీ నుంచి త‌ప్పుకుంటున్నట్లు ఒడిశాలోని పూరీ లోక్‌స‌భ కాంగ్రెస్‌ అభ్య‌ర్థి ప్ర‌క‌టించారు.

నిధుల కొరత కారణంగా పోటీ చేయలేనంటూ పూరీ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతి (Sucharita Mohanty) అధిష్ఠానానికి లేఖ రాశారు. ప‌బ్లిక్ డోనేష‌న్ డ్రైవ్ చేప‌ట్టి, ఎంత ఖ‌ర్చు త‌గ్గించినా తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు అందులో పేర్కొన్నారు. మాజీ ఎంపీ బ్రజామోహన్‌ మొహంతి కుమార్తె అయిన సుచరిత.. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు మెయిల్‌ పంపారు. పార్టీ ఫండ్‌ ఇవ్వనందున ఆ ప్రభావం పూరీలో తన ప్రచారంపై తీవ్రంగా పడినట్లు పేర్కొన్నారు. సొంత వనరులతోనే ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ ఒడిశా ఇన్‌ఛార్జ్‌ అజోయ్‌కుమార్‌ కరాఖండిగా చెప్పినట్లు సుచిత్ర తెలిపారు.

నిధుల కొరత తనను ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేస్తున్న‌దని వెల్ల‌డించారు. పార్టీ ఫండ్‌ లేకుండా ప్రచారం కొనసాగించటం అసాధ్యమని, అందుకే పార్టీ టికెట్‌ను తిరిగి ఇస్తున్నట్లు అందులో సుచిత్ర పేర్కొన్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలైన బీజేపీ, బీజేడీ చాలినంత నిధులు, ధ‌న బ‌లంతో ఉన్నార‌ని, ఇది చాలా క‌ష్ట‌మైన ప‌రిస్థితి తెలిపారు. కాగా, పూరీ లోక్‌సభ స్థానానికి ఆరో విడుతలో భాగంగా మే 25న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 6 వ‌ర‌కు గ‌డువు ఉన్న‌ది.

 

RELATED ARTICLES

తాజా వార్తలు