Click to view: JanaPadham-07-08-2024 PDF e-paper
బెయిలెప్పుడో…?
* కవిత విడుదలపై కుట్రలా..?
* అర్థాంతరంగా పిటిషన్ రద్దు
* వ్యూహాత్మకమా..,.రాజకీయమా..?
* పై కోర్టుకెళ్లినా మరింత ఆలస్యం
బెయిల్ ఎప్పుడొస్తుంది..? ఇప్పట్లో జరిగేనా, ఇంకా ఆగాల్సిందే.? న్యాయవాదులతో జరుపుతున్న చర్చలేంటి.? అసలు ఇదంతా కావాలని చేస్తున్నారా..? ఒకవేళ అదే నిజమైతే అలాంటి అవసరం ఎవరికుంది…? ఒకవైపేమో తట్టుకునే ధైర్యం లేక తండ్రేమో బాధతో అటు మొఖాన చూసింది లేదు., ఎంతసేపు అటు అన్నా, ఇటు బావ., తదితరులు కవితను తీసుకొచ్చే యత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఏదిఏమైనా ఈ విడత తప్పకుండా బెయిల్ వస్తుందనుకుంటున్న వేళ ఉన్నట్టుండి పిటిషన్ రద్దు చేసుకోవడం వెనక అంతర్యమేమిటో అర్థం కాకుండా ఉంది. అసలు లిక్కర్ కేసులో జైల్లో గడుపుతున్న కవిత ఎప్పటికి బయటకు వస్తుందో అనేది ఆసక్తి కరంగా మారింది. ఆగస్టు 5వ తేదీన వాదనలు ఉండగా ఎమ్మెల్సీ తరఫున న్యాయవాదులు హాజరుకాకపోవడంతో బెయిల్ పై జరుగుతున్నదేమిటో ఎటూ అంతుచిక్కకుండా ఉంది.
-జనపదం, ఢిల్లీ
———-
ఢిల్లీ హైకోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో ఏదేదో మాట్లాడారు. హైకోర్టు లో ఇక బెయిల్ రాదని, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రాథమికంగా నిర్దారించినా ఆ పిటిషన్ విచారణ కొచ్చేసరికి ఇంకా వేచిచూడాల్సిందే. అప్పటి వరకు కవిత జైల్లోనే నలిగిపోవాల్సిందేనా అని అనుమానిస్తున్నారు.
కుట్రలా..?
ఎమ్మెల్సీ కవితను ఇంకా జైల్లో మగ్గేలా కుట్రలు చేస్తున్నారా.., లేక సంప్రదింపులు చేస్తన్నారా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు. ఇందులో రాజకీయ కోణం ఏముందనే చర్చ జాగృతి వర్గాల్లో కూడా జోరుగా సాగుతోంది. నాలుగున్నర నెలల నుండి జైల్లో గడుపుతున్న ఎమ్మెల్సీ కవితను తండ్రి కేసీఆర్ ఇంత వరకు చూసింది లేదు. అప్పుడో ఇప్పుడో అన్నయ్య కేటీఆర్, బావ హరీష్ రావు, ఇతర ముఖ్య నాయకులు వెళ్లి చూడడం ధైర్యంచెప్పి రావడం తప్ప జరుగుతున్నదేమీ లేదు. ఎవరెన్ని చెప్పినా కవిత మాత్రం తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తన పిల్లలు, కుటుంబానికి దూరమై నరకం చూస్తున్నట్టుగా బాధపడుతున్న సందర్భాలున్నాయి. ఇంత పరపతి, అవకాశాలు ఉన్నా తనకు ఎందుకు బెయిల్ రావడం లేదో అర్థం కాక వెళ్లిన వారిని గట్టిగా అడుగుతున్నట్టు అటు బీఆర్ ఎస్ పార్టీ, ఇటు సన్నిహితులు, కుటుంబ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఉపసంహరణ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేసి, వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచిస్తూ కేసును వాయిదా వేస్తూ తుది విచారణ జరుపుతామని చెప్పారు. కాగా, సీబీఐ చార్జ్ షీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత న్యాయవాదులు జూలై 6వ తేదీన డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే చార్జ్ షీట్ లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ చెప్పడంతో జూలై 22న సీబీఐ చార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 9న చార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు పక్కనెట్టిన రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. అది మంగళవారమైనా విచారణకు వస్తుందనుకుంటే రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు.
అరెస్టు.. బెయిల్ పిటీషన్లు..
కవితను మార్చి 15వ తేదీన ఈడీ, ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్టు చేశాయి. అప్పటి నుంచి కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు. ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో ట్రయల్ కోర్టులోనే కవిత మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 22వ తేదీన విచారించిన జడ్జి కావేరి బవేజా కేసును ఆగస్టు 5కు వాయిదా వేయగా, నిన్న కవిత తరఫున న్యాయవాదులు విచారణకు హాజరు కాలేదు. పైగా మంగళవారం కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది.