JanaPadham_EPaper_TS_06-10-2024
పలికింది కొండ… పలికించింది రేవంత్!?
హైడ్రా, మూసీపై అటెన్షన్ డైవర్షన్..
వేదికపై కొండా చెవిలో గుసగుసలాడిన సీఎం
అరగంటలోనే గాంధీభవన్ వేదికగా సురేఖ హాట్ కామెంట్స్
వివాదం ఇక చాలించడమే అన్న పీసీసీ చీఫ్
తాజాగా కొండాకు అండగా ఉంటామని తేల్చిన మంత్రి పొన్నం
నాగార్జునపై మాదాపూర్ లో కేసు
ఒకటవుతున్న సినీ పరిశ్రమ
గీత చిన్నగా కావాలంటే పక్కన పెద్దగా మరోటి గీయడం.., పరిస్థితులు చేజారుతున్నాయని తెలియగానే దిద్దుబాటుగా మరో వివాదాన్ని సృష్టించి అదుపులోకి తెచ్చుకోవడం లౌక్యం. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ చేసిన పని ముమ్మాటికి అదే కోవకు చెందుతుంది. జనమంతా ఒక విషయంపై సీరియస్ గా ఉన్నప్పుడు దృష్టి మరల్చడానికి తనదైన ప్రత్యామ్నాయం వెతుక్కుంది. డ్యామేజ్ భారీగా జరిగే ప్రమాదం ఉందని గమనించి, నివారణకు మరో హాట్ ఈష్యూను తట్టి మరీ లేపింది. హైడ్రా మట్టికరిచే ప్రమాదం.., మూసీలో పడి మునిగిపోయే ఘడియలు ఆసన్నమయ్యాయని తెలుసుకుని సమంత.., అండ్ సురేఖ ఎపిసోడ్ ను హైలైట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సురేఖ పలుకుల వెనక రేవంత్ స్ర్కిప్ట్., ఆ కసి వెనక సీఎం సపోర్టు ఉన్నట్టుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే తెలిసిపోతుంది.
=======================
అంతా గందరగోళం. ఒక సమస్య చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, చల్లారకముందే మరోటి. కావాలని చేస్తున్నట్టా., కాకతాళీయంగా జరుగుతున్నట్టోగానీ రాష్ట్రం సర్కార్ పరిస్థితి ఉక్కిరిబిక్కిరి. హామీలపై పట్టువదలని ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో స్వయం కృతంగా తవ్వుకుంటున్న గోతులే ఎక్కువ. మరీ ముఖ్యంగా హైడ్రాతో పెట్టుకున్న తలకొరివి సర్కార్ ను తీవ్ర ఇరకాటంలో నెట్టింది. దీంతో దాని నుంచి బయటపడడానికి, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి కేటీఆర్ పై కోపాన్ని దృష్టిలో పెట్టుకుని సినీ ఇండస్ట్రీ ఇష్యూను కావాలనే తెరపైకి తెచ్చినట్టుగా తెలుస్తోంది.
హైడ్రా, మూసీ పై అటెన్షన్ డైవర్ట్..
రాజధానిలో మూసీ సుందరీకరణ., హైడ్రా కూల్చివేతలు చేసినంత డ్యామేజ్ అంతాఇంతా కాదు. ఆ ఇష్యూలతో కాంగ్రెస్ పార్టీ సర్కార్ తన ఇమేజ్ ను తానే మూసీలో నిమజ్జనం చేసుకుంది. హైడ్రా ఇష్టారీతిగా చేసిన కూల్చివేతలతో జనమంతా సీఎంపై దుమ్మెత్తిపోశారు. మంత్రులు ఎక్కడికక్కడ కవర్ చేసేందుకు యత్నించినా మంటలు పెరిగాయే తప్ప చల్లారింది లేదు. ఆగిన గుండెలు, ఆగమైన బతుకులు., రోడ్డున పడిన జీవితాలు., నేలమట్టమైన దశాబ్దాల కలలు., ఇలా సామాన్యుడి బతుకులన్నీ సర్వనాశనం అయ్యాయి. కష్టపడి నిర్మించుకున్న కలల కట్టడాలను ఎక్కడికక్కడ బుల్డోజర్లతో వికృతంగా కూల్చిన రంగనాథ్ అండ్ టీం పనులకు హైదరాబాద్ మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. స్పష్టత లేని హైడ్రా పనితీరు, వివరాలు చెప్పకుండా చేసిన రెడ్ మార్క్ కలకలంతో రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యమే చెల్లించుకుంది. ఒకానొక దశలో రాష్ట్ర ప్రజలంతా గత బీఆర్ఎస్ సర్కారే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంత సీరియస్ గా మారిన హైడ్రా, మూసీ సుందరీకరణ వ్యవహారం నుంచి తెలివిగా బయటపడాలంటే ఏదైనా చేయాలనే కొండా ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. సీరియస్ గా మారిన రాష్ట్ర పరిస్థితి నుంచి ప్రజల చూపును మళ్లించడానికే నాగార్జున ఫ్యామిలీ అండ్ సురేఖ ఉదంతాన్ని హైలైట్ చేసినట్టు సమాచారం.
వేదికపై కొండా చెవిలో గుసగుసలాడిన సీఎం..
ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రి మీడియా సమక్షంలో ఇష్టారీతిగా మాట్లాడడం అంత తేలికైన పనికాదు. అలా చేయాలంటే తెగింపైనా ఉండాలి., పైనుంచి ఎవరైనా పెద్దల సహకారం అయినా తోడవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండా సురేఖ అంత తేలిగ్గా కోరి సమస్యలు కొనితెచ్చుకునేంత తెగింపు దాదాపుగా ప్రదర్శించరు. కొండా ఫ్యామిలీకి ఇప్పుడున్న మంత్రి పదవి ఊడితే రాజకీయంగా మనుగడే అతి కష్టం. వారిని ఎమ్మెల్యేగా గుర్తించడం దేవుడెరుగు, కనీసం పలకరించే వారు కూడా ఉండరనేది జగమెరిగిన సత్యం. అందుకే ఒకానొక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి స్వయంగా కొండాసురేఖ చెవిలో ఏదో చెప్పిన దృశ్యాలు మీడియా కవరేజీలో రికార్డైన నిమిషాల వ్యవధిలోనే ఇంత తతంగం జరిగింది అనే అనుమానాలు లేకపోలేదు. స్వయంగా సీఎం ఇచ్చిన భరోసాతోనే ఆమె అంత అతిగా ప్రవర్తించారని, సురేఖ స్థాయికి అంత దిగజారుడు మాటలు ఎప్పుడూ చేసిన సందర్భాలు లేవుకనుగా ఇది నిజంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మనోధైర్యంతోనే జరిగిందనే వారు లేకపోలేదు.
అరగంటలోనే గాంధీభవన్ వేదికగా కొండా హాట్ కామెంట్స్..
సీఎం రేవంత్ చెవిలో ఏదో చెప్పిన కేవలం అరగంట వ్యవధిలోనే కొండా సురేఖ గాంధీభవన్ వేదికగా సమంత అండ్ నాగచైతన్య టాపిక్ ను కుండబద్ధలు కొట్టినట్టుగా, ఎలాంటి దాపరికం లేకుండా మీడియాతో పంచుకున్నారు. మంత్రి సురేఖ అలా మాట్లాడడానికి అరగంట ముందు సీఎం అండ్ సురేఖ మధ్య ఏ విషయమై చర్చ జరిగింది., స్టేజీ పైన రేవంత్ సురేఖ చెవిలో ఏం చెప్పారో., అసలేం జరిగిందో ఏమో గానీ మహిళా మంత్రి చెప్పాలనుకున్నది చెప్పేశారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ నాగార్జున ఫ్యామిలీని చుట్టుకునేలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక మాట మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచించి, విలువలతో కూడిన ఖండనలు, మాటలు చేసే సురేఖ ఒక్కసారిగా అంతగా దిగజారుడు మాటలు అనే సరికి రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపునకు గురయ్యాయి. ఆమె బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు అంతర్గతంగా సంబంధాలు, చీకటి కోణాల చుట్టే ఉన్నాయంటే ఆమె ఎంతలా స్థాయి మరిచిపోయి ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒక మంత్రిగా చేసే అవకాశాలే ఉండవని, ముఖ్యమంత్రి ఇచ్చిన సపోర్టుతో పేల్చిన తూటాలని విశ్లేషకులు చెబుతున్నమాట. సీఎం రేవంత్ రాష్ట్రంలోని పరిస్థితిని గాడీలో పెట్టడానికి, హైడ్రా, మూసీ ఈష్యూలు మరుగునపడడానికి కావాలనే సురేఖతో మాట్లాడించారనేది వాదన. ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టుగానే సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల నుంచి నిజంగానే మూసీ, హైడ్రా ముచ్చట పాతబడిపోయింది. హైడ్రా బాధితులు, మూసీ కూల్చివేతలతో రోడ్డున పడిన వారి ఊసే అంతా మర్చిపోయారు. అంతటి చెడు మరకను తుడిచేయడానికి సురేఖతో ముఖ్యమంత్రి సమంత వివాదాన్ని ప్రయోగించినట్టు సమాచారం.
వివాదం ఇక చాలించడమే అని తెల్లారే పీసీసీ చీఫ్..
సురేఖ వ్యవహారం రాష్ట్రమే కాదు, కాంగ్రెస్ హస్తినా పెద్దల వరకు కూడా వెళ్లి కంపకంప చేసింది. తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్రంలో మహిళా సంఘాలు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి చేజారిపోయినట్టుగా గుర్తించిన పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. వెంటనే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి స్వయంగా తన బాధను వ్యక్తీకరించడమే కాకుండా, సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.
తాజాగా కొండాకు అండగా ఉంటామని మంత్రి పొన్నం
కొండాపై ఏదేదో జరుగబోతోందని, పదవి నుంచి పంపించి వేస్తారని., కఠిన చర్యలు ఉంటాయనే ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు మరో కోణాన్ని చూపుతున్నాయి. మంత్రి సురేఖ ఒంటరి కాదని, వెంట తామంతా ఉన్నామనే తీరుగా ఆయన చేసిన మద్దతు మాటలు వివాదాన్ని సర్కార్ కావాలనే చేసిందని చెప్పకనే చెబుతున్నది. సీఎం సురేఖ చెవిలో చెప్పిన ముచ్చట్ల ప్రభావమే ఆ మాటలనే దానికి పొన్నం మాటలు బలాన్ని చేకూర్చుతున్నాయి.
అదే సమయంలో ఇదే విషయమై నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారని తెలిసి ఏదో ఒకటి చేసి దారికి తెచ్చుకోవాలని భావించిన సర్కార్ కావాలనే కేసులో ఇరికించాలని చేస్తున్న ప్లాన్ కూడా అంతా బహిరంగ రహస్యంగా భావించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు లేని నష్టం., ప్రజధనం రికవరీ వంటి ముచ్చట్లు ఇప్పటికిప్పుడు సడెన్ ఎందుకు చేయాల్సి వస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని ఎంతకీ వినే పరిస్థితులు లేవు కనకనే సర్కార్ చేతిలో ఉన్న బలంతో కేసు అస్ట్రాన్ని ప్రయోగించినట్టు తెలిసిపోతున్నది. సినీ పరిశ్రమ కూడా నాగార్జున ఇష్యూలో అంతా ఒక్కటిగా కదలడం కూడా సర్కార్ కు మింగుడు పడని విషయమే. అందుకే దారికి తెచ్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది.