Saturday, December 28, 2024
HomeTelanganaFinancial Crisis | దండగమారి పదవులు.. జీతం లేదు.. భత్యం లేదు

Financial Crisis | దండగమారి పదవులు.. జీతం లేదు.. భత్యం లేదు

JanaPadham_EPaper_TS_21-10-2024

*దండగమారి పదవులు

జీతం లేదు.. భత్యం లేదు*

చాయ్, బిస్కెట్లకు పైసల్లేవ్
సొంత జేబు నుంచి నెలకో లక్ష
కార్పొరేషన్ చైర్మన్లకు ఆర్థిక గండం
పదవుల్లో చేరినప్పటి నుంచీ రూపాయి లేదు

పాలిచ్చే బర్రెను ఇడ్సిపెట్టి.., తన్నే బర్రెను పట్టుకున్నట్టున్నది కొత్తగా పీఠాలు దక్కించుకున్న వారి పరిస్థితి. పార్టీ అధికారంలోకి వచ్చింది., పదవి వరించింది.., సో హ్యాపీ. జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి. దర్జాకు దర్జా., పలుకుబడికి పలుకుబడి., అధికారిక కార్యక్రమాల్లో మర్యాద. ఎన్నాళ్లుగానో చూసిన నిరీక్షణకు ఫలితం దక్కిందన్న సంబురం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.., అస్సలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. పదవి దక్కిందని సంబురపడాలో.., ప్రతిఫలం ఊరిస్తూనే ఉందని మదనపడాలో అర్థం కాని పరిస్థితుల్లో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు. అందలం ఎక్కామన్న సంబురం కూడా వారిని ఆనందంగా ఉంచలేకపోతున్నది. తృణమో., ఫణమో దక్కితేనే పదవికి అందం అని తెలిసినా, అవేవీ లేకుండానే ‘అనుభవించండి..’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ అధిష్టానం తీరుతో వారంతా మదనపడుతున్నారు. ఆఖరుకు చాయ్, బిస్కెట్ పైసలు కూడా ఇచ్చే అవకాశాలపై ఒకటికి పదిసార్లు ఆలోచించి చెబుతామంటున్న తీరుతో ఇటు కక్కలేక., అటు మింగలేక నోరు నొక్కుకుని కుక్కిన పేనులా పదవిని పట్టుకుని వేలాడుతున్నారు..

===================

జనపదం, బ్యూరో

రాష్ట్రంలో రాజకీయ నేతలకు పదవీ సంబురం లేకుండా పోయింది. పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆశ పెట్టి.. ఆశ పెట్టి ఇటీవలే కొన్ని కార్పొరేషన్లతో పాటుగా వివిధ విభాగాల్లో పదవులను భర్తీ చేసింది. నిజానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కానీ, అనూహ్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాటిని పెండింగ్ పెట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే.. అదే పాత తేదీల్లో జీవో జారీ చేసింది. అప్పటి నుంచి 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమితులయ్యారు. కానీ, వీరికి పదవీ సంబురమే మిగిలింది. కుర్చీ ఎక్కినప్పటి నుంచి రూపాయి లేక ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు.

పదవి మాత్రమే.. పైసల్లేవ్
రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లతో పాటుగా పలు పోస్టులను రేవంత్ సర్కారు నియామకం చేసింది. ప్రస్తుతం గత ప్రభుత్వ అప్పులు, అప్పటి పనులపై విచారణ అంటూ కొంతకాలం కాలయాపన చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు హైడ్రా, మూసీ పరిరక్షణ అంటూ సాగదీస్తున్నది. మరోవైపు ప్రతినెలా ఉద్యోగుల జీతాల కోసం కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఏకంగా 80 వేల కోట్ల అప్పులు తీసుకున్నది. రోజువారీ ఖర్చుల కోసం కూడా నానా తంటాలు పడుతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్పుతూనే ఉన్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన వారికి అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి జీతం ఇవ్వలేదు. ఒక్కో కార్పొరేషన్ చైర్మన్కు రెండు లక్షల జీతం, ఇతర అలవెన్స్లు అంటూ జీవోలు జారీ చేసినా జీతం కింద రూపాయి విడుదల చేయలేదు. సంబంధిత శాఖల నుంచి తీసుకునేందుకు కూడా వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. చైర్మన్ల జీతాల ఫైల్ను కూడా ఆర్థిక శాఖ అటు సీఎంకు, డిప్యూటీ సీఎంకు పంపిస్తున్నారు. ఇప్పటికే మార్చి నుంచి అక్టోబర్ వరకు జీతాలు పేరుకుపోయాయి. దీంతో ఒక్కసారి వాళ్లందరికీ జీతాల సొమ్మును విడుదల చేసేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు.

సొంత ఖర్చులు తడిసిమోపెడు
రాష్ట్రంలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్ నేతలకు పదవుల ఆశ నెరవేరుతున్నది. ఈ నేపథ్యంలో పదవి వచ్చింది.. జీతం రూపంలో లక్షలకు లక్షలు వస్తాయని కొంత ఆశపడినా.. జేబుల్లోకి మాత్రం రూపాయి రావడం లేదు. ఇదే సమయంలో పదేండ్ల నుంచి తమ వెంట తిరిగిన నేతలు, అనుచరులకు కనీసం రూపాయి పని ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. సొంతంగా ఏదైనా ఆర్థిక అవసరాలు తీర్చుదామంటే.. వారికే చాలా ఖర్చులు వెంటాడుతున్నాయి. ఆఫీస్కు వస్తే.. చాయ్, బిస్కెట్లు, మధ్యాహ్నం భోజనాలు అంటూ వేలు ఖర్చు కావడంతో.. కొంతమంది చైర్మన్లు ఆఫీస్లకు కూడా రావడం లేదు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా సిబ్బంది, అనుచరులకు ఏదైనా ఆర్థికంగా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని.. కొంతమంది చైర్మన్లు ఏకంగా ఊరు దాటేశారు. రాక రాక పదవి రావడంతో వాళ్ల దగ్గరకు ఏదైనా ఆశించి వచ్చేవారు కూడా ఉంటున్నారు. వారికి కూడా జేబు నుంచి ఏదైనా చేయాల్సిన పరిస్థితే. వీటికితోడు వాహనాల మెయింటనెన్స్ కూడా భారమే అవుతుంది.

బిల్లు లేదు
ఇటీవల ఓ కార్పొరేషన్ చైర్మన్ ఇష్టారీతిన లక్షలు ఖర్చు పెట్టినట్లుగా ఓ సంస్థ నుంచి బిల్లులు ట్రెజరీకి పంపించారు. కానీ, అక్కడి నుంచి వచ్చిన రిప్లై చూసి ఖంగుతిన్నట్లుగా మారింది. ఈ బిల్లులు చెల్లవని, అవన్నీ సొంతంగా భరించాల్సిందేనని సదరు శాఖ ఉన్నతాధికారి నుంచి రిప్లై వచ్చింది. కొత్తగా పదవి వచ్చింది… ఆఫీస్కు వచ్చిన వాళ్లకు కూడా చాయ్, బిస్కెట్లు తెప్పించాలి కదా.. అంటూ నెత్తీనోరూ బాదుకున్నా.. రూపాయి విడుదల చేయలేదు. ఈ విషయం ఇటీవల ఓ క్లబ్లో బయటకు వచ్చింది.

RELATED ARTICLES

తాజా వార్తలు