Monday, December 30, 2024
HomeNationalGold Smuggling | భారీగా బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ ముంబయిలో డీఆర్‌ఐకి చిక్కిన ఆప్ఘన్‌ రాయబారి..!

Gold Smuggling | భారీగా బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ ముంబయిలో డీఆర్‌ఐకి చిక్కిన ఆప్ఘన్‌ రాయబారి..!

Gold Smuggling | భారత్‌కు పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జకియా వార్దక్‌ (58) పట్టుబడ్డారు. దుబాయి నుంచి ముంబయికి ఏకంగా రూ.18.6లక్షల కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని తరలిస్తూ డీఆర్‌ఐ అధికారులకు చిక్కారు. ఈ ఘటన గత నెల 25న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దౌత్యవేత్తలకు ఆయా దేశాలు దౌత్య పాస్‌పోర్టులు జారీ చేస్తుంటాయి.

ఈ పాస్‌పోర్టులు ఉన్న వారికి అరెస్టుల నుంచి మినహాయింపు ఉంటుంది. దాంతో జకియా వార్దక్‌ అవకాశంగా తీసుకున్నది. ఏప్రిల్‌ 25న కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయి నుంచి ముంబయికి చేరుకుంది. లగేజీతో గ్రీన్ చానల్ ద్వారా ఎయిర్ పోర్ట్‌ ఎగ్జిట్‌ వద్దకు చేరుకుంది. ఆమె బంగారం తరలిస్తుందని డీఆర్‌ఐ అధికారులకు పక్కా సమాచారం అందడంతో ఆమెని అడ్డగించారు. లగేజీలో బంగారం తరలిస్తున్నారా? అని ప్రశ్నించగా.. లేదని బదులిచ్చింది. దాంతో అధికారులు లగేజీని తనిఖీ చేశారు. అందులో బంగారం కనిపించలేదు. చివరకు మహిళా సిబ్బంది ఆమెను గదిలోకి తీసుకెళ్లి చెక్‌ చేయగా.. ఆమె ధరించిన కస్టమైస్డ్ జాకెట్‌లో బంగారం కడ్డీలు బయటపడ్డాయి. 25 బంగారం బార్‌లు దొరికాయి. ఒక్కోటి కేజీ ఉంటుందని.. 24 క్యారెట్ల ప్యూరిటీ గోల్డ్‌ అని తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేశారు. దౌత్య పాస్‌పోర్టులు ఉండడంతో వారిని వదిలేశారు.

2021లో అప్పటి ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆమెను భారత్‌లో రాయబారిగా నియమించారు. అఫ్గాన్‌ని తాలిబన్లు తిరిగి ఆక్రమించి పాలన సాగిస్తున్నప్పటికీ భారత్ వారి పాలనను అధికారికంగా గుర్తించడంలేదు. అయితే, భారత్‌లో విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం వచ్చే తమ దేశ పౌరులకు ముంబయి, హైదరాబాద్ లోని అఫ్గాన్ రాయబార కార్యాలయాలు సేవలు కొనసాగిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్‌ ఆరోపణలపై జకియా సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. అఫ్గాన్ తరఫున పనిచేస్తున్న తనను ఏడాదిగా అన్యాయంగా, ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని ఆరోపించారు. తనతోపాటు కుటుంబ సభ్యులు, బంధువుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, పరువుతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారాన్ని తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు