Click to view JanaPadham-14-09-2024 EPaper
ఇమేజ్.. డ్యామేజ్..
విలవిల్లాడుతున్న విశ్వనగరి..
రాజకీయ దుమారంతో అబాసుపాలు..
పెట్టుబడుల స్వర్గధామం కాస్త నరకప్రాయం..
సర్కార్ అనాలోచిత చర్యలు.. ప్రతిపక్ష ఆందోళనతో ఆగమాగం..
యుద్ధవాతావరణంతో జనజీవనం అస్తవ్యస్తం..
రోజుకో ఇష్యూతో వణుకుతున్న హైదరాబాద్..
ఎమ్మెల్యే ఇళ్లకే దిక్కులేదు.. ప్రజానీకం పరిస్థితేంటనే అనుమానాలు.. .
గొప్పతనాన్ని కొంచెపు బుద్ధి చిదిమేస్తున్నది. వర్ణణలు అందుకునే స్థాయిని అందవిహీనం అదిమిపడుతున్నది. పేరు ప్రఖ్యాతులు., పరువు మర్యాదలను పార్టీల పోరులు పాతాళానికి తొక్కేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ఎలాంటి అనుమానం లేకుండా గుర్తెచ్చె హైదరాబాద్ పేరు ఇప్పుడు రాజకీయ కలుషితంతో కుళ్లుతున్నది. పదేళ్లుగా వెలుగులు పరుచుకున్న నగరం, దారులు తెరుచుకున్న జనజీవనం., ఇప్పుడు పూర్తిగా డైలామాలో పడుతున్నది. ఉద్యమ పార్టీ నిర్మించిన పునాదుల నామరూపాలు లేకుండా చేయాలనే సంకుచితమో., ప్రజలకు కొత్తగా చేయడానికి ఏమీ లేక పాతవి ముందరేసుకుని కాలం వెళ్లదీయాలనే సందర్భమోగానీ కాంగ్రెస్ చర్యలతో పరువు గంగలో కలుస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కష్టపడితే గుర్తింపు వస్తుందికానీ, ఇతరుల కష్టాలను చెరిపేయాలని చూస్తే ఉన్న గౌరవం పోతుందనే కనీసం కూడా లేకుండా వ్యవహరిస్తున్న తీరుతో రాజధాని కాస్త రంగెలిసిపోయి నిర్వికారంగా కనిపిస్తున్నది.
========================
జనపదం, బ్యూరో
బ్రాండ్ హైదరాబాద్ కాస్త.., బ్యాడ్ హైదరాబాద్ గా మారుతున్నదా..? సర్వమతాలకు, అన్ని వర్గాలకు, సకల కళలు, సంస్కృతులకు కేరాఫ్ అయిన భాగ్యనగరి తీవ్రంగా బాధపడుతున్నదా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. మినీ ఇండియాగా అభినందనలు అందుకునే నగరం ఇప్పుడు పార్టీల కొట్లాటలు, నాయకుల దూషణల పర్వంతో పరువు కోల్పోతున్నది. శాంతి భద్రతలకు నిలయంగా, పదేళ్లుగా చిన్న మరకైనా లేకుండా సాగిన నగర జీవితం ఇప్పుడు నరకప్రాయంగా మారుతున్నది. ఆధిపత్య పోరులో ఎవరికి వారుగా సాగిస్తున్న బీభత్స కాండకు నిలయంగా మారడంతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారగా, పెట్టుబడి దారులు ఆలోచనపడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎంతో చరిత్ర, గొప్ప సంస్కృతికి ఆలవాలమైన హైదరాబాద్ రంగుల జెండాల రణంతో., పాలన కోసం చేసుకుంటున్న పోరుతో ఆగమాగం అవుతున్నది.
విలవిల్లాడుతున్న విశ్వనగరి..
పెంచకపోతే పోయిందిగానీ, ఉన్నదానిని కూడా ఊడ్చేస్తున్న తీరే బాధాకరం. హైదరాబాద్ అంటేనే ఆ చరిత్రకు ఓబ్రాండ్ ఇమేజ్. దేశ చరిత్రలో ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలో దానికి ఓ ప్రత్యేక స్థానం. విశ్వవిఖ్యాతమైన గొప్ప విషయాలకు నిలయం. అలాంటి నగరం ఇప్పుడు కొన్ని పార్టీల కుంచిత బుద్ధికి, అల్పమైన ప్రయోజనాలకు నీరుగారిపోతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని దేశాల నుంచి ఇక్కడకు ప్రజలు రావడం సర్వసాధారణం, ఆ విషయంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అలాంటి నగరంలో ఇప్పుడు రాజకీయ కొట్లాటలు వలస జీవులను, విశ్వ ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి.
రాజకీయ దుమారంతో అబాసుపాలు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్రంలో పాలన పగ్గాలు తారుమారయ్యాయి. పదేళ్లు పదవికి దూరమైన హస్తం నేతలకు ఇది అందివచ్చిన అవకాశం కావడంతో రెచ్చిపోతున్నట్టుగా చేస్తున్న పనులను చూస్తేనే తెలిసిపోతున్నది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కరెక్ట్ గా ఉందా.. లేదా అనేది కొంచెం పక్కనబెడితే, అధికార పక్షం అన్ని కోణాలను సుతిమెత్తగా డీల్ చేయాల్సి ఉంటుందనే ఇంగితాన్ని మర్చి ప్రవర్తిస్తున్నతీరు బాధాకరం. గెలిచిన వారు ఒదిగి ఉండాలనే కనీస సూత్రాన్ని కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు విశృంఖలంగా రెచ్చిపోతుండడంతో ఓడి అవమానంగా భావించే వారు ఎదురు తిరగడం పరిపాటే. దీంతో ఇటు అధికారానికి, అటు అణచివేతకు మధ్య పోరు తీవ్ర రూపం దాల్చుతున్నది.
ఈ క్రమంలోనే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్న రేవంత్ అండ్ టీం బీఆర్ఎస్ ను రాచిరంపాన పెట్టే పనికి ఏ మాత్రం వెనుదీయడం లేదు. హుందాగా జరగాల్సిన అసెంబ్లీ వ్యవహారాలు కూడా పర్సనల్ పట్టింపులతో విలువలు దిగజారుడుగా మారాయి. దీంతో పాలనకు కేంద్రమైన రాజధానిలో నెగెటివ్ షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనాభాలో దేశంలోనే ఆరో పెద్ద నగరమైన జంటసిటీలో ఏ చిన్న ఆందోళన జరిగినా ప్రజాజీవితం ఆగమవడం ఖాయం. అలాంటిది హస్తం, కారు యుద్ధంలో వర్గాలుగా చీలిన ప్రజలు ఉద్రిక్త వాతావరణంలో బిక్కుబిక్కున కాలం వెల్లదీయాల్సిన దుస్థితి దాపురించింది. ఆవులవులు కొట్లాడుకుని లేగల కాళ్లు విరగ్గొట్టినట్టుగా నాయకులు, నాయకులు., పార్టీలు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుకుని మధ్యలో అమాయక ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తుండడంతో నగర ఖ్యాతి కాస్త అపఖ్యాతిగా మారుతున్నది.
పెట్టుబడుల స్వర్గధామం కాస్త నరకప్రాయం..
భాగ్యనగరి నిజంగా సిరికి కేరాఫ్. పెట్టుబడులకు సర్వధామం. సాక్షాత్తు ప్రపంచ కుబేరులే నగరాన్ని సందర్శించి బిజినెస్ డెవలప్ మెంట్ పై చర్చలు జరిపిన చరిత్ర ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా కంపెనీలు వెలిస్తే అందులో హైదరాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పాటు చేయాల్సిందే అనేంత అభివృద్దిని చూసిన నగరం. యువతకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు, కొత్తకొత్త ఆవిష్కరణకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉండడంతో రాజధాని నిజంగా ఓ అక్షయ పాత్ర మాదిరే. అలాంటి నగరంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే శాంతియుత వాతావరణం కనిపించే దాఖలాలు కరువవుతున్నాయి. రేవంత్ సర్కార్ అనాలోచిన చర్యలతో ప్రతిపక్ష పార్టీ ఆందోళనతో పరిస్థితులన్నీ తలకిందులవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. కేవలం కేసీఆర్ అంటే కోపమో., బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలంటే అయిష్టమోగానీ ప్రస్తుత సీఎం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు నగరాన్ని నరకంగా మారుస్తున్నాయని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.
రోజుకో ఇష్యూతో వణుకుతున్న హైదరాబాద్..
రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రాజధానిలో పెరిగిన క్రైమ్ రేట్ మరీ ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, బాలికల కిడ్నాప్ వ్యవహారాలు, మత సంబంధిత కల్లోల్లాలు వంటివి ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇదే విషయమై బీఆర్ఎస్ నేతలు అందునా మాజీ మంత్రి హరీష్ రావు లెక్కలు సహా ప్రజల ముందుంచిన తీరుతో ఆందోళన చెందాల్సిన దుస్థితి దాపురించింది. ఇంటి నుంచి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇల్లు చేరుతారనే గ్యారంటీ కూడా లేదని హరీష్ రాస్ట్రసర్కార్ తీరును ఎండగట్టిన విధానం మేధావులను కూడా ఆలోచనలో పడేసింది. రోజురోజుకు క్రైమ్ పెరగడం, రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట దారుణాలు జరగడం పరిపాటిగా జరిగిన విషయం ఇప్పుడు పార్టీల మధ్య మరింత చిచ్చుకు ఆజ్యం పోస్తున్నాయి. ఉన్నది ఉన్నట్టు అంటే ఉలుక్కెక్కువా.. అని హరీష్ రావు నేర ప్రవృత్తి పెరగడంపై రాష్ట్ర సర్కార్ ను ఇరకాటంలో పెడుతున్నాడనే ఆందోళనతో సర్కార్ అణచివేత ధోరణి అవలంబిస్తోందనే వారు లేకపోలేదు.