Wednesday, January 1, 2025
HomeTelanganaDasoju: ప్రొఫెసర్ కోదండరాం గారికి... దాసోజు శ్రవణ్ బహిరంగ విజ్ఞప్తి

Dasoju: ప్రొఫెసర్ కోదండరాం గారికి… దాసోజు శ్రవణ్ బహిరంగ విజ్ఞప్తి

ప్రొఫెసర్ కోదండరాం గారికి 
డా దాసోజు శ్రవణ్ బహిరంగ విజ్ఞప్తి
3rd July, 2024
గౌరవనీయులైన ప్రొఫెసర్ కోదండరాం  గారు,
నమస్కారం..మీకు నా శుభాకాంక్షలు.
మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేసిన సమయంలో, మీరు వామపక్ష విద్యార్థి ఉద్యమాల సిద్ధాంతకర్తగా,  పౌర హక్కుల సంఘం కోసం మీరు చేసిన కృషి, నాకు గుర్తుంది. ఆ సమయంలో నేను నల్లగొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేసి, ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ. చదువుతూ జాతీయ భావజాల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న క్రియాశీలక విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై అనేక బాధ్యతలు నిర్వర్తించాను.
ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకుడిగా, విద్యార్థి హక్కుల కోసం, సమాజంలో అసమానతలకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను. పలు మార్లు జైలుకు వెళ్ళాను. నా అకాడమిక్ కెరీర్ 1990లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. తర్వాత, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ డిపార్ట్‌మెంట్‌లో మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాను. 1996లో పీహెడీ పూర్తి చేసిన నేను, మానవ వనరుల అంశంపై బోధనతో పాటు, ప్రపంచ బ్యాంకు, డీఎఫ్ఐడి, భారత ప్రభుత్వం, తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగరేణి, ఎన్ఎండీసి, హెచ్‌జెడీఎల్ వంటి సంస్థలకు రీసెర్చ్ మరియు కన్సల్టింగ్ సేవలు అందించాను. 2000లో, సామాజిక స్పృహ కలిగిన ‘కుబుసం’ అనే చిత్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి నిర్మించాను. మా చిత్రంలోని “పల్లె కన్నీరు పెడుతుంది” అనే పాటను 2004 ఎన్నికల ప్రచారంలో వై.యస్. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఉపయోగించారు
తర్వాత, హైదరాబాద్‌లోని వివిధ అంతర్జాతీయ ఐటీ కంపెనీలలో మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ విభాగాలకు అధిపతిగా పని చేస్తున్నప్పుడు, శ్రీ చిరంజీవి గారు,  సామాజిక న్యాయం మరియు సామాజిక తెలంగాణ కోసం స్థాపించిన  ప్రజారాజ్యం పార్టీ లో  శ్రీ పవన్ కల్యాణ్ గారి ప్రేరణతో నేను నా లక్షల రూపాయల జీతాన్ని, కార్పొరేట్ భవిష్యత్తును కాదనుకొని, వారి నాయకత్వంలో ప్రజారాజ్యంలో చేరాను. మానవసేవే మాధవ సేవ అనే ధర్మంపై విశ్వాసంతో, పూర్తి స్థాయి క్రియాశీల రాజకీయాలలోకి వచ్చాను. తదనంతరం తెలంగాణ ఉద్యమ నాయకుడు శ్రీ కే.సి.ఆర్ గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో వారి నాయకత్వంలో క్రియాశీల ఉద్యమ బాధ్యతలు నిర్వహించాను.
2010లో మీరు జె.ఎ.సి చైర్మన్‌గా నియమించబడిన వెంటనే, కళింగ భవన్లో శ్రీ  కెసిఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన  సభలో పాల్గొన్నాను. కే.సి.ఆర్ గారి ఆదేశాల మేరకు, టి.ఆర్.ఎస్ ప్రతినిధిగా, జె.ఎ.సి లో దివంగత నేత శ్రీ నాయిని నర్సింహా రెడ్డి, శ్రీ ఈటల రాజేందర్ గారితో కలిసి క్రియాశీల స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాను. మిలియన్ మార్చ్, సాగర హారం, అసెంబ్లీ ముట్టడిలాంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో మీతో పాటు పాల్గొన్నాను. అనేక వ్యక్తిగత, కుటుంబపర  కష్ట నష్టాలకోర్చి, జీతాన్ని, జీవితాన్ని, కుటుంబ శ్రేయస్సును ఫణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యేంత వరకు నా వంతు కృషి చేశాను.
శ్రీ చిరంజీవి గారు ఏంతో  ఆప్యాయతతో పార్టీ వీడొద్దు అంటూ, నాకు కల్పిస్తానన్న రాజకీయ భవిష్యత్తును కాదని, శ్రీ కే.సి.ఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నాకు భగవంతుడు ప్రసాదించిన మహత్తర బాధ్యత, నైతిక ధర్మం అని భావించి, తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, అనేక కారణాలతో, 2004 ఏప్రిల్ 12వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇవాళ పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వారు కూడా, గాంధీభవన్ మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా లేని రోజుల్లో, పార్టీ పటిష్ట కోసం, ప్రజల హక్కుల కోసం పని చేసాం. 2023 ఆగస్టు 5వ తేదీ వరకు ప్రజల గొంతుకగా అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించాను.
అయితే రాజకీయాలలో అనుభవం లేకపోవడం, మా కుటుంబానికి రాజకీయ నేపధ్యం లేకపోవడం, ఇంకా అత్యంత వెనుకబడిన కులాలలో జన్మించడం వలన ఏర్పడ్డ అనేక ప్రతిబంధకాలతో నా రాజకీయ ప్రస్థానం అనేక  ఆటుపోట్లు ఎదుర్కొన్నది. అయినప్పటికీ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు 31-07-2024 నాడు,  నాతో పాటు  శ్రీ  కుర్ర సత్యనారాయణ అనే ఎరుకుల కులానికి చెందిన గిరిజన నేతను, కార్మిక నాయకుడిని గవర్నర్ కోటాలో ఎమ్యెల్సీలుగా  నామినేట్ చేశారు.
కానీ, రాజ్యాంగ విరుద్ధంగా దేశంలో ఎక్కడ ఎప్పుడు జరుగని విధంగా ఆనాటి  గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, శ్రీ కెసిఆర్ గారిపై ఉన్న అర్థరహిత కోపంతో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా,  మా ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉంది, మాకు పూర్తిస్థాయి అర్హత లేదని,  మరియు మాకు సంబందించిన  సరైన సమాచారం తనకు అందలేదు లేదు అనే కుంటి సాకులతో, కనీస విజ్ఞత ప్రదర్శించకుండా మా నియామక ప్రతిపాదనలను  19-09-2023 నాడు తిరస్కరించి, మా హక్కులు కాలరాస్తే,  గవర్నర్ రాజ్యాంగ విరుద్ధ మరియు న్యాయ విరుద్ధ నిర్ణయాన్ని నిరసిస్తూ, అన్నీ అలోచించి, అనేక సంప్రదింపుల తరువాత వ్యక్తిగత హోదాలో ,  07-12-2023 నాడు WP 180 మరియు  WP 181 లను ద్వారా న్యాయం కోరుతూ హై కోర్టుని ఆశ్రయించాం.
అయితే హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో, కోర్టులో చివరి తీర్పు వచ్చే వరకు, ఎమ్యెల్సీ పదవులు భర్తీ చేయము అని న్యాయమూర్తి ముందు వాగ్దానం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు ఆనాటి గవర్నర్ గారు;  దానికి పూర్తి బిన్నంగా,   కోర్టును అగౌరవపరుస్తూ సహజ న్యాయ సూత్రాలకు  విరుద్ధంగా కుట్ర కుతంత్ర పూరిత వైఖరితో 27-01-2024 నాడు మిమ్మల్ని,   మరో జర్నలిస్టు మిత్రుని  ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ  శ్రీ రేవంత్ రెడ్డి మంత్రివర్గం తీర్మానించి, ఆనాటి గవర్నర్  ఆమోదం కోసం పంపితే, మా నియామక ప్రతిపాదనలను రెండు నెలల పాటు తన వద్ద పెండింగులో పెట్టుకుని, మాకు రాజకీయ నేపధ్యం ఉంది అని కుంటి సాకులు చెబుతూ మమ్మల్ని  తిరస్కరించిన ఆనాటి  గవర్నర్ గారు, .రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, మీరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అయినప్పటికీ మీ ప్రతిపాదనలను మాత్రం ఆనాటి గవర్నర్‌పై ఏం వత్తిడి తీసుకువచ్చారో లేదా ఏం ప్రలోభాలకు గురిచేశారో తెలియదు కానీ, రాత్రికి రాత్రే ఆమోదం వేసి,  అధికారిక గజెట్ కూడా వెలువరించారు. మాకు న్యాయం కలుగకుండా రేవంత్ రెడ్డి చేసిన చిల్లర కుట్రలో  మీరుకూడా భాగం కావడం నన్ను బాధించింది.
అయితే హైకోర్టులో కేసు పెండింగులో ఉన్న సమయంలో చేసిన వాగ్దానాలకు వ్యతిరేకంగా జరిపిన మీ నియామకాల విషయంలో రేవంత్ ప్రభుత్వం, మరియు ఆనాటి గవర్నర్ చేసిన తప్పును గుర్తించి,  వాటిపై  హై కోర్ట్  31-01-2024 నాడు స్టే కూడా ఇచ్చారు. తప్పు చేసింది కాక,  చడీ చప్పుడు లేకుండా హైకోర్టు తీర్పును గౌరవంచకుండా, మీ నియామకాలను  శ్రీ కెసిఆర్ గారు రద్దు చేయించారు అనే తప్పుడు ప్రచారం చేస్తూ, తగుదునమ్మా అని బట్ట కాల్చి మీద వేసినట్లు  పత్రిక సమావేశాలు నిర్వహిస్తూ,  శ్రీ కెసిఆర్ గారి  దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ఆయన్ని అవమానించే ప్రయత్నం చేస్తూ, పరోక్షంగాహై కోర్టుపై వత్తిడి తెచ్చే పనికిమాలిన ప్రయత్నం కూడా చేసారు.
అయితే, కోర్టులో పూర్తిగా వాదోపవాదాలు విన్న తర్వాత  07-03-2024  నాడు హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సత్యమేవ జయతే అన్నట్లు చెంప పెట్టు లాంటి తుది తీర్పు వెలువరించడమైంది. మా నియామకాల ప్రతిపాదనలు రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ,  కొట్టివేయడం జరిగింది. అదే విధంగా, మిమ్మల్ని, మరో జర్నలిస్టు  మిత్రుడి నియామకాలను కూడా తప్పుబడుతూ,  వాటిని కూడా కొట్టి వేశారు.
అలాగే, ఆర్టికల్ 171 (5)  ప్రకారం గవర్నర్ కోటాలో నియామకాలు చేయడంలో, మంత్రివర్గం చేసిన సిఫార్సులే గవర్నర్ కు  శిరోధార్యం అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ  గవర్నర్ వద్ద అభ్యర్థుల విషయంలో సమాచారం లోపం ఉంటే  అట్టి సమాచారాన్ని పంపమని అడగవచ్చు కానీ,  మంత్రివర్గం పంపిన  సిఫార్సులను  తిరస్కరించే అధికారం గవర్నర్ కు లేదు అని స్పష్టంగా
చెప్పింది  దాంతోపాటు  ఒకవేళ  ప్రతి  ప్రతిపాదించబడ్డ అభ్యర్థులు ఆర్టికల్ 191 ప్రకారం డిస్క్ క్వాలిఫికేషన్ గురౌతారని గవర్నర్ గారు భావిస్తే, ,గవర్నర్ గారు అట్టి ప్రతిపాదనలపై  పున సమీక్ష
చేసుకోవాలని  మంత్రివర్గానికి సూచించవచ్చు  అని చెబుతూ, నేను మరియు శ్రీ కుర్ర సత్యనారాయణ ఆర్టికల్ 191 పరిధి లో ఉన్న డిస్క్వాలిఫికేషన్ వర్తించదు అని కూడా తీర్పులో చెప్పారు. దాంతోపాటు భారత రాజ్యాంగంలోని 361 ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్ కు ఉన్న విస్తృత అధికారాలను గౌరవిస్తూ ప్రత్యేకమైన నిర్దేశాలు జారీ చేయక పోయినప్పటికీ గవర్నర్ గారు ఈ కేసుల పరిష్కరణ కోసం రాజ్యాంగ విలువలు పాటిస్తారని నమ్ముతున్నాను అంటూ మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్లుగా ( క్షమించండి) సునిశితమైన తీర్పునిచ్చారు.
హైకోర్టు తీర్పు ప్రకారం, గత మంత్రివర్గం చేసిన మా నియామక సిఫార్సులను  ప్రస్తుత గవర్నర్ ఇంకా పున సమీక్షించవలసిన అవసరం ఉంది. అప్పటి సిఫార్సులపై ప్రస్తుత గవర్నర్ గారు తగు నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే రే శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్లీ తగుచర్యలు చేపట్టవచ్చు. కానీ గతంలో కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు చేసిన తప్పే మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ,  లేదా ప్రస్తుత గవర్నర్  గారు పునరావృతం చేస్తే, అది హైకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లు అవుతుంది. అంతేకాదు సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం.
యూనివర్సిటీ ప్రొఫెసర్ గా. తెలంగాణ జేఏసీ చైర్మన్ గా నాకు తెలిసిన కోదండరామ్ రెడ్డి గారు, స్వతహాగా పౌరహక్కుల పోరాట యోధుడు, కానీ మీ ప్రస్తుత దిగజారుడు వ్యవహారం అందుకు పూర్తిగా బిన్నంగా ఉంది. తోటి తెలంగాణ ఉద్యమకారుడిగా, మేము చేస్తున్న హక్కుల పోరాటానికి నైతిక మద్దతు తెలపాల్సిన మీరు, ఇంత దిగజారి, తగుదునమ్మా అంటూ  శ్రీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చిల్లర కుట్రలో భాగస్వామ్యం అవడం ఏ మాత్రం ఆదర్శవంతం కాదు, మీకు ఏ మాత్రం శోభనివ్వదు.
స్వతహాగా భూస్వామి అయినా మీరు, ఒక  రిటైర్ ప్రొఫెసర్ గా, ప్రభుత్వ పెన్షనర్ గా, మీకు ఎమ్యెల్సీ పదవి ద్వారా వచ్చే ప్రభుత్వ జీతం కావాలని కోరుకుంటున్నారు అని నేను అనుకోవడంలేదు, అంతే కాదు, తెలంగాణ జేఏసీ చైర్మన్ గ మీరు నిర్వహించిన పదవి, నిర్వర్తించిన బాధ్యత వంద ఎమ్యెల్సీ లతో సమానం అని గుర్తించే విజ్ఞత మీరు కోల్పోవడం నాకు బాధ కలిగిస్తుంది. అయితే, నాకెందుకు ఎమ్యెల్సీ పదవి అంటే, మధ్య తరగతి కుటుంభం నుండి వచ్చిన నేను, అప్పటికే ఇంకా మిగిలి ఉన్న సుదీర్ఘమైన కార్పొరేట్ వృత్తిపర భవిష్యత్తును వదిలిపెట్టి,  నా జీవిత సర్వస్వము  ఫణంగా పెట్టి ప్రజా జీవితంలోకి వచ్చాను, చేస్తున్న నా ఉద్యోగాన్ని, నా కుటుంబ క్షేమాన్ని,, నెలదిరిగే సరికి వస్తున్న లక్షలకొద్దీ రూపాయల జీతాన్ని వదిలిపెట్టి, 17 ఏళ్లుగా ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా కొట్లాడుతున్న బహుజన బిడ్డను నేను.
ఆధిపత్య కులాల పెట్టుపడి వ్యాపారంగా మారిన వికృత రాజకీయ పోటీలో, ఓ పక్క నెగ్గలేక, మరో పక్క ఓటమిని అంగీకరించలేక ఇంకా ప్రజా ప్రస్థానం లో నిలబడ్డాను. ఏ పార్టీలో ఉన్న ప్రజల పక్షాన నిలబడ్డాను. అయితే, నా హక్కులని నేనే కాపాడుకోలేక పోతే, మరి ప్రజల హక్కులను యెట్లా కాపాడుతాను అనే బలమైన ఆలోచనతో  నేను ఈ న్యాయ పోరాటం చేస్తున్నాను, దీన్ని ఇంతటితో వదిలిపెట్టను.
దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత, శ్రీ కెసిఆర్ గారు మాపై విశ్వాసంతో మాకు కల్పించిన ఒక అపూర్వ అవకాశాన్ని ఆనాటి గవర్నర్ గారు కురచ మనస్తత్వంతో కాలరాస్తే కలిగిన భాద కంటే, చిల్లర రాజకీయాలకు, కరుడు కట్టిన కుతంత్రాలకు  మారుపేరైన రేవంత్ రెడ్డికి బీసీలు, అణగదొక్కబడ్డ వర్గాలు  అంటే స్వతహాగా ఉన్న చులకన భావంతో, మా పట్ల కక్షపూరిత వైఖరితో మహాభారత యుద్ధంలో వలే  మిమ్మల్ని  అడ్డం పెట్టుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అణచివేసే కుట్రలు చేస్తుంటే, మీరు కూడా ఆ కుట్రలో భాగం అవుతుంటే, భాదతో “యు టూ బ్రూటస్”  అన్న రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ చివరి మాటలు మీక్కూడా వర్తిస్తాయి.
తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అయిన శ్రీ రేవంత్ రెడ్డి, లీగల్ లిటిగేషన్ లోకి మిమ్మల్ని జొప్పించి ముమ్మాటికీ మిమ్మల్ని పరోక్షంగా అవమానిస్తూ, ఇద్దరు తెలంగాణ ఉద్యమకారుల మధ్య లేనిపోని పోటీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవమానిస్తున్న విషయం మీకెందుకు బోధ పడుతలేదు? మీ కనీస విజ్ఞత ఏమైంది?
శ్రీ రేవంత్ రెడ్డి గారు మీకు ముమ్మాటికీ పదవి ఇవ్వాలి, ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేనోళ్ళు, కష్టకాలంలో పార్టీని అనేక  ఇబ్బందులకు గురిచేసినోళ్లు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినోళ్లు, మంత్రులుగా చలామణి అవుతుంటే, కాంగ్రెస్ గెలుపుకు కారకులైన మీరెందుకు అధికారానికి దూరంగా ఉండాలి. శ్రీ రేవంత్ రెడ్డికి నిజంగా మీ పట్ల కృతజ్ఞత ఉంటె, మిమ్మల్ని రాజ్యసభకు సభ్యుడిగా పంపించి ఉండవచ్చు. లేదా ఎమ్యెల్యే ల కోటాలో ఎమ్యెల్సీ గ నియమించి ఉండవచ్చు, లేదా నేరుగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి, మెల్లిగా ఆరు నెలల లోపు ఏం ఎల్ సి గా నియమించి ఉండవచ్చు, అదే పద్దతిలో ఎమ్యెల్సీ పదవి నియామక సమయం ఆసన్నమయ్యే వరకు  మంత్రిగా కొనసాగించి ఉండవచ్చు. ఇవ్వాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక మంత్రి లేక, విద్య వ్యవస్థ ఆగమైంది. మిమ్మల్ని డైరెక్టుగా విద్యాశాఖ మంత్రి చేస్తే ఏ దేవుడు కొట్టిండు? ఎవరు అడ్డుకుండ్రు? మంత్రులైన ఉద్యమ ద్రోహులకంటే చెడిపోయిండ్రా మీరు?
అదే పద్దతిలో జర్నలిస్ట్ మిత్రుడు శ్రీ అమీర్ అలీ గారిని, మైనారిటీ వర్గాల ఓట్లు దండుకుని మా లీగల్ లిటిగేషన్ లో అతన్ని జొప్పించి,  ఆయన్ని కూడా అవమానించిండ్రు. శ్రీ రేవంత్ రెడ్డి చేస్తున్న క్షుద్రరాజకీయాలు మీకు అర్ధం అవుతున్నాయా? లేక అర్ధం అయ్యి కూడా అర్ధం కానట్లు నటిస్తున్నారా?
మీరు వయసులో, విజ్ఞతలో మాకంటే పెద్దవాళ్ళు, ప్రజల హక్కుల పోరాటంలో మాకు మార్గదర్శకులు. కానీ మా వంటి వెనుకబడిన వర్గాలకు చెందిన వారి హక్కులను కాలరాయాలని శ్రీ రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తుంటే సహకరించాలని మీకు మనసు యెట్లా వచ్చింది?  తెలంగాణ ప్రజా పోరాటంలో మా ఉన్నత ఉద్యోగాలను, మా జీతాలను,  జీవితాలను కీలక దశలో ఫణంగా పెట్టి క్రియాశీల పాత్ర పోషించిన  మాకే ఈ అన్యాయం చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి?
అనేక సందర్భాలలో, మీరే స్వయంగా తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదని ఆక్రోశం వ్యక్తం చేసి, ఇప్పుడు  స్వయంగా సహచర ఉద్యమకారుడనైన నా అవకాశాలను, కుట్రపూరితంగా, మరియు కృతజ్ఞతా రాహిత్యంతో శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం  కాలరాస్తుంటే మీరు ఎలా ఆయనకు సహకరిస్తున్నారు? అత్యంత దుర్మార్గమైన పెట్టుబడి వ్యాపారంగా  మారిన ప్రస్తుత రాజకీయాలలో,  వెనుకబడ్డ, అణగదొక్కబడ్డ  కులాలకు చెందిన మాలాంటి వాళ్లకు సాధారణంగా అవకాశాలు రావు, వచ్చినా డబ్బు సంచులతో ఓడగొడుతారు. అందుకే శ్రీ కెసిఆర్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము.
మా రాజ్యాంగబద్ధమైన హక్కుల పోరాటానికి మీరు అడ్డం రావద్దని, తెలంగాణ జేఏసీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా మీ నాయకత్వంలో, మీతోపాటు పనిచేసిన నాకు, తోటి ఉద్యమకారుడిగా,  మా న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని, మా ఎమ్మెల్సీ నియామకం పొందే వరకు అన్ని రకాలుగా తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నాను. ఎమ్యెల్సీ నియామక విషయంలో మా రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించుకునే వరకు మాకు అండగా ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాను.
             ఇట్లు, మీ
డా దాసోజు శ్రవణ్ కుమార్
RELATED ARTICLES

తాజా వార్తలు