Click to view JanaPadham-13-08-2024-1 E-Paper
అధికార పార్టీలో అనాథలు…
ఆదరణకు నోచుకోని గులాబీ ఎమ్మెల్యేలు..
ఉన్నా.. లేనట్టుగానే వారి వ్యవహారం..
రెంటికీ చెడ్డ రేవడిగా ఆ పదిమంది దుస్థితి..
సీఎం వచ్చాక తేల్చుకుంటామని ఆవేదన..
గతంలోనే పోచారం ఇంట్లో గోడు వెల్లబోత..
వచ్చీరాగానే తేలుస్తానన్న ముఖ్యమంత్రి..
14 తర్వాతనైనా పదవులు దక్కకపోతాయా అని ఎదురుచూపు..
మరోవైపు వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ..
జనపదం, హైదరాబాద్ బ్యూరో : వ్రతం చెడి.., ఫలితం దూరమైనట్టేనా..? అనుకున్నది ఒకటైతే, అనుభవంలో మరోటా…? ఏం జరుగుతోంది.., ఎప్పటికి దక్కబోతోంది.! అదృష్టాన్ని కాళ్లతన్నుకుని దౌర్భాగ్యాన్ని తలకెత్తుకున్నామా..? చెప్పిందేమిటీ., చేస్తున్నది మరేమిటీ.? ఏదైనా చేస్తారా.., లేదంటే చేయిస్తారా….? ఇది ఆ పది మంది ఆవేదన. ఎన్నో ఆశలతో వెనకా ముందు చూడకుండా గోడ దూకిన వారందరిదీ ఇదే పరిస్థితి. ‘కండువా కప్పుకున్నాం., ఖాళీగానే ఉన్నాం’ అంటూ దిగాలు పడుతున్న గులాబీ ఎమ్మెల్యే మదనమిది. బీఆర్ ఎస్ పార్టీకి అధికారం దూరమైందని ఏగిరమేగిరంగా గీత దాటితే వాళ్లంతా ఇప్పుడు ఆగమాగం కాబట్టే. గెలిచిన పార్టీకి దూరమై, చేరిన పార్టీలో గుర్తింపు లేక రెంటికి చెడ్డ రేవడిగా మారారు.
ముందు నుయ్యి.. వెనక గొయ్యి..
వాళ్లంతా అధికార పార్టీలో అనాథలు. గులాబీ పార్టీ నుంచి గెలిచి దేనికోసమో హస్తం పార్టీలో చేరి ఇబ్బందులు పడుతున్న ప్రజాప్రతినిధులు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ టిక్కెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వలసెళ్లిన ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. అన్నట్టుగా మారింది. గీత దాటి రానైతే వచ్చారుగానీ, వచ్చి నుంచి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరీ ముఖ్యంగా ఆ మధ్య సీఎం బయటనుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చేది లేదని పేల్చిన బాంబు వారిని మరింత గందరగోళంలో పడేసింది.
మారిన గులాబీలకు గుర్తింపు కరువు..
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నుంచి గులాబీ నుంచి ఆకర్ష్ మొదలైంది. బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం కండువాలు కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో మొదలైన ప్రవాహం ఒక్కొక్కరుగా పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలే యాదయ్య (చేవెళ్ల), కృష్ణామోహన్ రెడ్డి (గద్వాల్), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), అరికపూడి గాంధీ (శేర్ లింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి.. ఇలా ఒకరి వెంట ఒకరు వసలెళ్లిపోయారు. అంతా కాంగ్రెస్ కండువా కప్పుకుని నిరీక్షిస్తున్నారు.
హస్తంలో ఉన్నా.. లేనట్టేగానే ..
మొన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి., ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలతో బిజీ బిజీగా మారారు. అసెంబ్లీ సెషన్ జరుగుతున్నని రోజులు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గులాబీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. వారి విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ సలహాలు తీసుకుని పదవిచ్చుతులను చేసేందుకు యత్నాలు చేస్తూనే ఉన్నారు. స్పీకర్ కు కూడా అదే విషయమై ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎప్పుడు ఊడుతుందో పదవి అనే టెన్షన్ లో వారంతా కొట్టుమిట్టాడుతూనే అసలు తమ పరిస్థితి ఏంటని మదన పడుతున్నారు. కనీసం అలాంటి సమయంలో చేరిన కాంగ్రెస్ పార్టీలోనైనా తమకు ఆదరణ దక్కుతుందిలే అనుకుంటే అదీ లేదు. జిల్లాల్లో వారిని పట్టించుకునే వారు లేక, కాంగ్రెస్ పూర్వులు వారిని తమతో కలుపుకుని తిరగనివ్వకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చర్యలు వారిని మరింత కుంగదీస్తున్నాయి.
భరోసా ఇచ్చేనా..?
ఇప్పటి దాకా కాంగ్రెస్ కు వెళ్లిన నేతలకు ఎలాంటి లబ్ది జరిగింది., ఇకముందైనా ఏమైనా ఒరగబోతోందనే లెక్కలేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని సీఎం కూడా వచ్చిన వారికి ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులైనా సంతృప్తి పర్చడమా..? జిల్లా ఇన్చార్జిలుగానైనా పదవులు కట్టబెట్టి శాంతింపచేయడమా చేద్దామని చూస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో వలసెళ్లిన వారంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు 14వ తేదీన సీఎం వచ్చిన వెంటనే తమ ఫ్యూచర్ ఏంటో తేల్చాలనే అంతా ఒక్కటై అడగాలని తీర్మానించుకున్నట్టు వినికిడి. ఇదిలా ఉంటే వచ్చినోళ్లందరికీ పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని కొందరు కాంగ్రెస్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. అసంతృప్తులను కూడా ఎలాగోలా నచ్చజెప్పి పార్టీ మనుగడ కోసం త్యాగాలకు సైతం సిద్ధపడాలని…