Manish Sisodia | ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కష్టాలు తీరడం లేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 15 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ సమయానికి చార్జిషీట్ దాఖలు చేయాలని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈడీని ఆదేశించారు. మనీష్ సిసోడియా బెయిల్ కోసం దాఖలు చేసి పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించిన తర్వాత ఢిల్లీ హైకోర్టులో మళ్లీ బెయిల్ కోసం సిసోడియా పిటిషన్ దాకలు చేశారు. అనంతరం సిసోడియా పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియాను వారానికి ఒకసారి పరామర్శించేందుకు ఆయన భార్యను అనుమతిస్తూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ అనుమతి ఇచ్చారు.
సిసోడియాను పరామర్శించేందుకు ఈడీ సైతం అభ్యంతరాలు తెలుపలేదు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 8కి కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ బవేజా గత నెల 30న సిసోడియాకు రెండోసారి కూడా బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే. సీబీఐ తరఫున ప్రాసిక్యూటర్ పంకజ్ గుప్తా కోర్టులో జస్టిస్ ఎదుట వాదనలు వినిపించారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఈ కేసులో సిసోడియా చాలా కీలక నిందితుడని వాదనలు వినిపించారు. ఈ దశలో బెయిల్‌కి అనుమతి ఇస్తే విచారణ పక్కదారి పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా ఉపశమనం కల్పించేందుకు నిరాకరించిన విషయం విధితమే.