Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టెన్త్, ఇంటర్ ఫలితాలు రావడంతో తమ మొక్కులను తీర్చుకునేందుకు పిల్లలతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు కూడా ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా అక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
ఇక క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి కొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందన్నారు. శనివారం నాడు శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజు రూ.3.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.