అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం వరకు డీజీపీగా కొనసాగిన రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం వేటువేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఇంచార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ నియామకమైన విషయం విదితమే.
మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి డీజీపీని నియమించింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న సీహెచ్ తిరుమల రావుకు డీజీపీ పదవి వరిస్తుందని అందరూ ఊహించారు. 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, 1991వ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను కూడా పరిశీలనకు పంపారు. కానీ అనూహ్యంగా హరీశ్ కుమార్ గుప్తా పేరు తెరపైకి వచ్చింది. ఆయనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.