హైదరాబాద్: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత (Madhavi Latha) మరో వివాదం చిక్కుకున్నారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మాధవీలత.. ముస్లిం ఓటర్లను తమ నకాబ్ తొలగించి మరీ పరిశీలించారు. వారి ఓటరు స్లిప్, ఓటరు ఐడీ కార్డులను తీసుకుని చూస్తూ నీవా కాదా అన్నట్టు తనిఖీ చేశారు. అక్కడ ఉన్న ఎన్నికల అధికారులను కూడా ఓటర్లు వీరా కాదా అని తెలుసుకున్నారు. ఓటర్ల వివరాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వారిని ఓటు వేసేందుకు అనుమతివ్వాలని సూచించారు. ఓటర్ల జాబితాల్లో తేడాలు ఉన్నాయని, ఓటర్ల పేర్లు కొన్ని జాబితాలో లేవని ఆరోపించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది స్పందించి పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఆమె ఓటర్లను నకాబ్ తొలగించి పరిశీలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఆయన నేతృత్వంలో మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విషయం తెలసుకున్న ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మాధవీలతపై నమోదు చేయాలని తెలిపారు. దీంతో మలక్‌పేట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.