AP DGP | మరో వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ క్రమంలో ఆదివారం ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డీజీపీ కే రాజేంద్రనాథ్‌రెడ్డిపై (AP DGP) ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. విపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్.. ఆయనపై చర్యలు చేపట్టింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి (DGP Rajendranath Reddy)ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితాను సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు పదే పదే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాయి. సీఎస్ జవహర్‌రెడ్డిపై సైతం ఫిర్యాదులు చేశాయి. సీఎస్, డీజీపీపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా ఈసీ డీజీపీపై బదిలీ వేటు వేసింది. గతంలో అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా డీజీపీ వ్యవహరించినట్లుగా తెలిపేందుకు పలు ఆధారాలు సైతం అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఐదు రోజుల కిందట డీజీపీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు.. నివేదికను ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల అధికారికి పంపారు.
నివేదికను పరిశీలించిన ఈసీ.. డీజీపీపై బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 1994లో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఏఎస్పీగా తొలిసారిగా పోస్టింగ్ అందుకున్నారు. 1996లో జనగాం ఏఎస్సీగా, ఆ తర్వాత వరంగల్ ఏఎస్పీగా పనిచేశారు. 1996-1997 మధ్య కరీంనగర్ ఏఎస్పీగా సేవలందించారు. రాష్ట్ర విభజన అనంతరం 2015-17 మధ్య ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. 2018-19 మధ్య డ్రగ్ కంట్రోల్ డీజీగా, 2019-20 మధ్య విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంటెలిజెన్స్ డీజీగాను అదనపు బాధ్యతలు పని చేసిన ఆయన.. 2022 ఫిబ్రవరిలో డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు.