హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం (Election campaign) ముగిసింది. సుమారు రెండు నెలలగా సాగుతున్న ప్రచార పర్వం ముగియడంతో మైకులు మూగబోయాయి. 17 లోక్‌సభ సీట్లతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం పోలింగ్ జరుగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఇన్నిరోజులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కష్టపడిన పార్టీల అభ్యర్థులు.. ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు. ఇదే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించనున్నది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. రేపు (ఆదివారం) సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు.
- 17 పార్లమెంటు స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 475 మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు.
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో 45 మంది ఉన్నారు.
- ఆదివారం రాత్రి ఇంటింటి ప్రచారం చేసుకోవడానికి ఈసీ అనుమతించింది.
- 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది.
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనుంది.
- పోలింగ్ పెంచేందుకు 13న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
- ఎన్నికల విధుల్లో 2.8 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.
- 160 కేంద్ర కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను రాష్ట్రంలో మోహరించారు.
- ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు 20 వేల మంది పోలీసు బలగాలు తరలివచ్చాయి.
- రాష్ట్రంలో 3 కోట్ల 32 లక్షల 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.65 కోట్లు, మహిళలు 1.67 కోట్ల మంది ఉన్నారు.
- 18-19 ఏండ్ల వయస్సు కలిగినవారు 9.20 లక్షల మంది, వికలాంగులు 5.27 లక్షల మంది ఉన్నారు.
- వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- అత్యధికంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3,226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
- రాష్ట్రంలో 9900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది.