Telangana Cabinet | హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో పాటు ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని, రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించొద్దని ఆదేశించింది.
వాస్తవానికి నిన్న సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగాల్సి ఉండే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి కోసం రేవంత్‌తో పాటు మంత్రులంతా శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి చూశారు. కానీ ఈసీ అనుమతి లభించలేదు. దీంతో రాత్రి 7 గంటలకు సీఎంతో పాటు మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన కీలక విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా పునర్విభజన చట్టంలో ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం నిర్ణయించారు. కానీ ఈసీ తాజా ఆదేశాలతో వీటిలో పలు అంశాలపై చర్చ ఉండబోదని సమాచారం.