Heat Wave | ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో ఉక్కపోతకు జనాలు విలవిలలాడిపోతున్నారు. బయటనే కాదు.. ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేడి గాలులకు మనషులే కాదు, మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో జనాలు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏయే పనులు చేయాలో తెలుసుకుందాం..
చేయాల్సిన పనులు..
1. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. దాహం వేయనప్పటికీ తరుచుగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ కలిపిన వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది. నిమ్మకాయ రసం, మజ్జిగ వంటి ద్రావణాలను తీసుకోవాలి. పండ్ల రసాలు కూడా మంచిదే.
2. తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తే.. నీటిని వెంట తీసుకెళ్లాలి.
3. నీటి పరిమాణం అధికంగా ఉండే పుచ్చకాయ(వాటర్ మెలన్), కర్భూజ(మస్క్ మెలన్), ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి పదార్థాలను తీసుకోవాలి.
4. లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
5. ఎండకు బయటకు వెళ్లినప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని తలకు కప్పుకోవాలి. సూర్యకిరణాలు తలపై పడకుండా చూసుకుంటే వడదెబ్బకు దూరంగా ఉండొచ్చు.
6. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో కాళ్లకు చెప్పులు కచ్చితంగా ధరించాలి.
7. సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉండాలి.
8. ఇంట్లోకి వడగాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
9. ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లడం మంచిది.
10. వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు టీవీ చూస్తుండాలి. అలాగే న్యూస్ పేపర్స్ కూడా చదవాలి. వెదర్ అప్‌డేట్ కోసం mausam.imd.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
చేయకూడని పనులు..
1. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లకూడదు.
2. బలాన్ని ఉపయోగించి చేసే పనులకు మధ్యాహ్నం సమయంలో దూరంగా ఉండాలి.
3. చెప్పుల్లేకుండా అసలు బయటకు వెళ్లకూడదు.
4. మిట్ట మధ్యాహ్నంలో వంటలు చేయకూడదు. ఒక వేళ తప్పని పరిస్థితుల్లో వంట చేయాల్సి వస్తే కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. స్టౌవ్‌కు గాలి తగిలేలా ఉండాలి.
5. మద్యం, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
6. ప్రోటిన్ అధిక పరిమాణంలో ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. చద్ది ఆహారాన్ని కూడా తీసుకోకూడదు.
7. పార్కింగ్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను ఉంచకూడదు.
ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే..
1. ఒత్తిడికి గురైనప్పుడు
2. చర్మం ఎర్రగా మారినా, దురద వచ్చినా
3. బాడీ టెంపరేచర్ 104 డిగ్రీల ఫారెన్ హీట్స్ దాటినా
4. తలనొప్పిగా ఉన్నా..
5. ఆందోళనకు, మూర్ఛకు గురైనా..
6. శరీరంలో తిమ్మిర్లు వచ్చినా
7. వికారంగా ఉన్నప్పుడు, వాంతులు వచ్చినప్పుడు
8. హార్ట్ బీట్‌లో తేడా ఉన్నా, శ్వాస సమస్యలు తలెత్తినా..
వీళ్లు అసలు బయటకు వెళ్లొద్దు..
ఎండలు గట్టిగా కొడుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. చిన్న పిల్లలు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడేవారు, మానసిక వైకల్యం ఉన్నవారు బయటకు వెళ్లకపోవడమే మంచిది. మరి ముఖ్యంగా గుండె సమస్యతో బాధపడే వారు, బీపీ పేషెంట్లు అసలు బయటకు వెళ్లకూడదు.