Gutka-Tobacco Addiction | దేశంలో గుట్కా, పాన్ మసాలాలు, జర్దా, ఖైనీతో పాటు పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నాయి. అయితే, వీటితో దేశవ్యాప్తంగా ఎంతో మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, వీటికి చికిత్స ఖర్చు భారీగా ఖరీదుగా మారింది. ఇండియాస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ నోయిడా, న్యూ ఢిల్లీ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, సెంటర్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ పాలసీ (CHIP) ఫౌండేషన్‌తో సంబంధం ఉన్న పరిశోధకుల సహకారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. వీటికి సంబంధించిన విధానాలను మార్చకపోతే.. దేశంలో ప్రజల జీవితకాలంలో ఆరోగ్య సంరక్షణ కోసం సుమారు రూ. 1,58,705 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. ఇందులో నోటి క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూకేఈలోని వివిధ సంస్థల పరిశోధకులు కూడా ఈ అధ్యయనానికి సహకారం అందించారు. అధ్యయన ఫలితాలు ఆక్స్‌ఫర్డ్ అకాడెమిక్స్ నికోటిన్ అండ్ టొబాకో రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే, చాలామంది సెలబ్రిటీలు సైతం తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రమోట్ చేస్తున్నారని పరిశోధకుడు ప్రొఫెసర్ సుభాష్ పోఖారెల్ పేర్కొన్నారు.
సిగరెట్లు, బీడీల మాదిరిగానే మైనర్‌లకు పొగాకు విక్రయించడాన్ని నియంత్రించే చట్టాలు అంత కఠినంగా లేవని.. చట్టపరమైన పరిమితులు ఉన్నప్పటికీ.. సులభంగానే అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న స్మోక్‌లెస్ పొగాకు విధానాల్లో సానుకూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పరిశోధకుడు ప్రొఫెసర్ రవి మెహోత్రా తెలిపారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్దా, ఖైనీ, గుట్కా తదితర ఉత్పత్తులను ఉపయోగించడం కొనసాగిస్తే మరణాలతో పాటు రోగాలు పెరుగుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.