రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
పంట పండించే రైతన్న ప్రాణంకోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందని, రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండని వేడుకొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి గారూ.. మీ తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నరు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు, దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చెయ్యండి. రుణమాఫీ అమలు విషయంలో మీరు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెలకావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.