Saturday, December 28, 2024
HomeTelanganaమాఫీ.. మాయ...

మాఫీ.. మాయ…

మాఫీ.. మాయ…

రుణం కేంద్రంగా రాజకీయం..
అప్పు కేంద్రంగా పార్టీల ముప్పు తిప్పలు..
అన్నదాత మెప్పుకోసం ఆరాటం..
చేసి చూపామంటున్న సర్కార్..
వంచించి ఫోజులెందుకుని బీఆర్ఎస్..
నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు..

అప్పు చుట్టూ పార్టీల తిప్పలు. అన్నదాత ప్రసన్నం కోసం నేతల పాట్లు. మంచిని చెడుగా, చెడును మంచిగా ఎవరికి వారుగా ప్రచారంతో ఊదరగొడుతున్న తీరిది. మాఫీని ముసురుకుని సాగుతున్న రాజకీయంలో, చెప్పాం, ఇచ్చామని హస్తం వారంటే…, మీ బొంద…. ఎందరికో ఎగనామం పెట్టి కొందరికి మమ అనిపించి ఫోజులు కొడుతున్నారని గులాబీలు ఆరోపిస్తున్నారు. లక్షకే సవాలక్ష కొర్రీలు పెట్టారని వాళ్లు దుమ్మెత్తిపోస్తుంటే.., లక్షణంగా లక్షల మందిని ఎగురగొట్టి ఆ కాస్త మందితో ముగించారని వీళ్లు విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర రాజకీయం మొత్తంగా రైతు కేంద్రంగా సాగుతున్న తరుణంలో మాటలు మంటలవుతున్నాయి. నేతలు పరోక్షంగానే ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు. మాఫీ మాయ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాలక్ష ఆరోపణలకు ఆజ్యం పోస్తూ రక్తికట్టిస్తోంది.

========================

జనపదం, బ్యూరో
రుణమాఫీ చుట్టే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. రైతులను ఆదుకునే ప్రభుత్వం తమదని వాళ్లంటే, మోసం చేస్తూ పబ్బంగడుపుకునే చరిత్ర మీదని వీళ్లంటున్నారు. మీరు చేయని పనిని మేం ఎనిమిది నెలల్లోనే చూపామని హస్తం సెలవిస్తే.., అన్నీ తప్పుడు లెక్కలతో ప్రజలను వంచిస్తున్నారని గులాబీ బదులిస్తోంది. మూడు విడతల మాఫీ కార్యక్రమం ఎట్టకేలకు గురువారంతో ముగిసినా, మాటల మంటలు మాత్రం ఇప్పుడిప్పుడే మరింత రాజుకుని అసలు రూపాలను బయటపెడుతున్నాయి.

అన్నదాత మెప్పుకోసం ఆరాటం..
రాష్ట్ర రాజకీయం అన్నదాత మెప్పు కోసం సాగుతున్న ఆరాటంగా మారింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం లక్ష రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దానిని కూడా నాలుగు విడతలుగా చేపట్టి మిత్తి డబ్బులకే సరిపోని విధంగా మాఫీ వ్యవహారం ఎప్పటికి పూర్తవుతుందో అన్నంత మందకోడిగా నడిపారని తీవ్ర విమర్శలకు గురైంది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లిన అన్ని పార్టీలు రుణాలను మాఫీ చేయడమే ప్రధాన ఎజెండాగా ప్రకటనల వర్షం కురిపించాయి. అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ మొదట్లో తడబడినట్టుగా కనిపించినా తర్వాత చాలెంజ్ గా తీసుకుని అన్న పని చేసి చూపింది. అన్నదాతల కోసం ఎంతకైనా వెళ్తామని గర్వంగా ప్రకటించింది.

సిగ్గుంటే రాజీనామా చెయ్ : సీఎం
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని, మాఫీ వ్యవహారం అంత తేలిగ్గా జరిగేది కాదని గులాబీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు ఒకానొక దశలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనుకున్న గడువులోగా రైతులను రుణవిముక్తులను చేస్తే తాను రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. అప్పటి నుంచి రైతన్న చుట్టూ సాగుతున్న వాడివేడి రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ కూడా ఎంతో పట్టుదలతో రుణమాఫీని పరిపూర్ణం చేసి బీఆర్ఎస్ నేతలకు ప్రతిసవాల్ విసిరింది. అందులో భాగంగా నేడు సీఎం హరీష్ రావును ఉద్దేశించి.. ‘‘నిజంగా సిగ్గు, శరం, మానం ఉంటే వెంటనే రాజీనామా చెయ్..’’అంటూ సవాల్ విసిరారు. నేను కూడా మామ కేసీఆర్ మాదిరిగానే మాటమీద నిలబడే మనిషిని కాదనుకుంటే వదిలెయ్ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
కాగా, సీఎం స్వాతంత్ర్య దినోత్సవం వేళ రుణమాఫీ చేసి రైతుల ముఖంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టడంపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇంత దరిద్ర్యంగా ఉంటాయా.., స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించాలని.., ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని ఘాటుగానే బదులిచ్చారు. మాఫీ పేరుతో మాయలు చేస్తూ ఎందరో రైతులకు అన్యాయం చేశారని, ఆధారాలతో సహా చూపిస్తామని ప్రతిసవాల్ విసిరారు.

నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు..
అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎక్కడ మీడియా ముఖంగా మాట్లాడినా మొదట రుణమాఫీ విషయమై దుమ్మెత్తిపోసుకోవడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ గా మారింది. గల్లీ నుంచి రాజధాని వరకు ఏ నేతను కదిపినా ఎదుటి పార్టీని విమర్శించడం, తిట్టడమే పనిగా రాజకీయం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో వ్యక్తిగత ఆరోపణలు కూడా వదలకుండా పలుచనవుతున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు