Saturday, December 28, 2024
HomeTelanganaVikarabad | భూముల కేటాయింపుపై గందరగోళం..

Vikarabad | భూముల కేటాయింపుపై గందరగోళం..

Janapadham_EPaper_TS_12-11-2024

12-JP-08-24-8pm_compressed (1)

ఫార్మా.. ఫైర్..?!

భూముల కేటాయింపుపై గందరగోళం..
ఇవ్వడానికి ఇష్టపడని అన్నదాతలు..
లగచర్లకు చర్చలకెళ్లిన యంత్రాంగం..
కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు..
వాహనాలపై రాళ్ల దాడి..
తీవ్ర ఉత్కంఠ.. భారీగా పోలీసుల మోహరింపు..

జనపదం, వికారాబాద్ బ్యూరో

అన్నదాతలకు ఆగ్రహమొచ్చింది. తల్లిగా భావించే భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారనే కోపంతో ప్రతిఘటనకు సిద్ధమయ్యారు. ఎంతటివారు వచ్చినా సరే భూములిచ్చేది లేదని భీష్మించారు. పంటభూములను పాడు చేయొద్దని, ఫార్మా పేరుతో బజారున పడేయొద్దని బతిమిలాడారు., చివరకు ఎదురు తిరిగారు. ఈ క్రమంలోనే చర్చించడానికి వచ్చిన కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తమ బతుకులు తమను బతకనివ్వాలని, మందుల గత్తరలో మసి చేయొద్దని వేడుకున్నారు. యంత్రాంగం వినిపించుకోకపోవడంతో విసుగుపుట్టి ఎదురు తిరిగారు. కలెక్టర్ వాహనంపై రాళ్లదాడికి దిగారు. ఒకానొక సందర్భంలో ఓ మహిళా కలెక్టర్ పై చేయిచేసుకున్నట్టుగా కూడా సమాచారం. హఠాత్ పరిణామంతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన చర్యలతో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారు.

==================

జనపదం, వికారాబాద్ బ్యూరో

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. రైతుల నుండి నిరసన సెగ తగలడంతో పాటు ఆయన ప్రయాణిస్తున్న కారుపై లగచర్ల గ్రామస్తులు రాళ్లు విసిరారు. ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు స్థానిక తహసీల్దారు, కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డితో కలిసి కలెక్టర్ సోమవారం మధ్యాహ్నం గ్రామానికి వెళ్లారు. అదే సమయంలో రైతులు కారుపై రాళ్లతో దాడి చేశారు. ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా రైతులతో చర్చించేందుకు లగచర్ల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అధికారులు గ్రామసభను పెట్టారు. సభ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఊరి బయట చర్చలకు ఏర్పాట్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో చర్చకు గ్రామం వెలుపల ఏర్పాటు చేసిన గ్రామసభకు రైతులు గైర్హాజరయ్యారు. గ్రామసభ వద్ద ఇద్దరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ గ్రామానికి వెళ్లగా, కలెక్టర్ గ్రామానికి రాగానే రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కి వెళ్లాలని కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు పగిలాయి. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా భారీగా పోలీసులు మోహరించారు.

సీఎం రేవంత్ ఇలాకాలో తీవ్ర ఉద్రిక్తత..
తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్మా కంపెనీకి భూసేకరణ నిమిత్తం ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో మరోసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణకు వెళ్లిన నాయకులపై గ్రామ రైతులు దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసి తిరిగి సోమవారం నిర్వహించేందుకు ప్రయత్నించిన ఉన్నతాధికారులకు చేదు అనుభవం ఎదురైంది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట్ మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం సమావేశానికి సిద్ధమైన అధికారులపై గ్రామానికి చెందిన రైతులు ఏకంగా దాడులకు పాల్పడ్డారు. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారి (కడ) వెంకటరెడ్డి వాహనాలపై రైతులు దాడులకు పాల్పడి కారు అద్దాలను ధ్వంసం చేశారు. రెండు కార్ల అద్దాలు ధ్వంసం కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు హుటాహుటిన లగచర్ల గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఘటన పూర్తి వివరాలిలా..
సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ కోసం బొమ్రాస్ పేట్ మండలం లగచర్ల గ్రామానికి వెళ్ళిన కలెక్టర్ ప్రత్యేక అధికారి రెవిన్యూ అధికారులపై గ్రామ రైతులు ఏకంగా రాళ్లు కర్రలతో దాడి చేయడం గమనార్హం. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులను గ్రామస్తులను నిలువరించేందుకు ప్రయత్నించగా వెనుక వైపు నుంచి ఓ మహిళ దాడి చేసినట్లు సమాచారం. సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ విషయమై రైతుల తో చర్చించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా బొమ్రాస్పె పేట్ మండల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించే సమావేశ స్థలికి వెళ్లగా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించాలని నిర్ణయించిన లగచర్ల గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని అక్కడికి వెళ్లిన కొందరు రైతులు కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో లగ్గిచర్ల గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిచేందుకు వెళ్లిన కలెక్టర్, కడ ప్రత్యేక అధికారి వాహనాలపై రైతులు, గ్రామస్తులు కొందరు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. కలెక్టర్ అధికారులతో కలిసి గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో గ్రామస్తులు ఒక్కసారిగా అధికారులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారులపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. వారు ఏకంగా కలెక్టర్ కారు అద్దాలను ధ్వంసం చేయడం గమనార్హం. శివారులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు కలెక్టర్ ప్రతిక్ జైన్ , కడ అధికారి వెంకట్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్య నాయక్, తాండూర్ రెవిన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ తదితరులు బొమ్మరాస్ పెట్ గ్రామ శివారుకు వెళ్లగా లగిచర్ల గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేసిన రైతులు అధికారులను నమ్మించి దాడికి తెగబడటం గమనార్హం. బొమ్మరాస్ పేట్ శివారులో కాకుండా లగిచర్ల గ్రామంలోనే ప్రజానాభిప్రాయ సేకరణ జరపాలని అధికారులను నమ్మించిన రైతులు ఈ దాడులు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తన కారుపై దాడులకు పాల్పడడంతో పొలాల గుండా ఆత్మరక్షణ కోసం పరుగులు తీయడం గమనార్హం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు భారీస్థాయిలో ఘటన స్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు