లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో (Ghazipur) దారుణం చోటుచేసుకున్నది. రూ.50 కోసం కన్నకొడుకుపై ఓ తండ్రి విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడటంతో తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నది.
ఘాజీపూర్‌లోని భగీరథ్‌పూర్‌కు చెందిన మోతీరాం.. తన రెండో కుమారుడు రామ్ ప్రవేశ్‌కు కొన్నిరోజుల క్రితం సైకిల్ తాళం కోసం రూ.50 ఇచ్చాడు. అయితే రామ్ సైకిల్ తాళం కొనుగోలు చేయలేదు. గురువారం సైకిల్‌కు తాళం లేకపోవడాన్ని గమనించిన తండ్రి రామ్‌ను నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అతనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మోతీరాం.. శుక్రవారం ఉదయం ఇంటి బయట మంచంపై నిద్రిస్తున్న రామ్ ప్రవేశ్‌పై గడ్డపారతో దాడిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో పడిఉన్న రామ్‌ను స్థానికులు దవాఖాను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఉందని పోలీసులు వెల్లడించారు. అతని తల, మెడ, భుజంపై తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. మోతీరామ్‌కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారని వెల్లడించారు. బాధితుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశామన్నారు.