చెన్నై: ఐదేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు ఎల్ఈడీ బల్బు (LED bulb) మింగిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకున్నది. గత శుక్రవారం బాలుడు విపరీతంగా దగ్గడంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో అతని తల్లిదండ్రులు చెన్నైలోని దవాఖానకు తీసుకెళ్లారు. స్కానింగ్‌లో అతడు ఎల్ఈడీ బల్బు మింగినట్లు అది శ్వాసకోశనాళంలో చిక్కుకున్నట్లు తేలింది. దీంతో బ్రోంకోస్కోపి ద్వారా దానిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఛాతీ ఓపెన్ చేసి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
అయితే భయాందోళనలకు గురైన బాలుడి తల్లిదండ్రులు శ్రీరామ్‌చంద్ర దవాఖానకు తరలించారు. సీటీ స్కాన్ చేయడగా డిస్టల్ బ్రీతింగ్ ట్యూబ్ బ్రాంచ్‌లో ఎల్ఈడీ బల్బును గుర్తించారు. అనంతరం బ్రోంకోస్కోపీ ప్రక్రియను గురించి అతని తల్లిదండ్రులకు వివరించారు. ఒకవేళ అది విఫలమైతే ఛాతీని ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం ఐసీయూకి తరలిస్తామని, వెంటిలేషన్ అవసరమని సూచించారు.
కాగా, సర్జన్లు బ్రోంకోస్కోపీ ద్వారానే బాలుడి శ్వాస నాళం నుంచి ఎల్ఈడీ బల్బును సురక్షితంగా తొలగించగలిగారు. దీంతో ఐసీయూ, వెంటిలేటర్ వంటి అవసరం లేకుండానే అతని ప్రాణాలను కాపాడగలిగారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.