Janapadham_EPaper_TS_07-11-2024
విషాహారం..
హాస్టళ్లలో చస్తూ బతుకుతున్న విద్యార్థులు..
భయంగుప్పిట్లో ప్రభుత్వ వసతి గృహాలు…
నాణ్యత లేని భోజనం.., అరకొర వసతులు….?
వార్డెన్ల ఇష్టారాజ్యం..
పట్టించుకోని యంత్రాంగం..
సర్కారీ చదువులపై తల్లిదండ్రుల అసహనం..
సన్నగిల్లుతున్న ఆశలు..
పేద పొట్టలోకి పుట్టెడు విషం. చిరు పేగుల్లో జీర్ణం కాని గ్రాసం. పట్టించుకోని యంత్రాంగం., దృష్టి సారించని సర్కార్. పెట్టిందే తినాలి తప్ప., పెట్టాల్సిన దాని విషయమై మాత్రం ప్రశ్నించొద్దు. వెరసి హాస్టల్ విద్యార్థుల జీవితాలు ముందు నుయ్యి, వెనక గొయ్యి.. అన్నట్టుగా తయారైంది. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయడం ఇష్టం లేక, వసతి గృహాల్లో సౌకర్యాలలేమిపై నిలదీయలేక చస్తూ బతుకుతున్న దుస్థితి. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న ఘటనలు., ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థుల ఘటనలే నిర్వహణ తీరును కళ్లకు కడుతున్నది. బాల్యం బంగారుమయంగా వెలగాల్సిన తరుణాన్ని కల్తీతో కక్కుర్తి బుద్ధితో మురికిమయంగా మారుస్తున్న తీరే బాధాకరం. పొట్టకొట్టి సంపాదించాలనే అత్యాశతో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం, ఏర్పాట్లను అటకెక్కించడంతో సదరు గృహాలు సమస్యలకు పుట్టినిల్లుగా తయారవుతున్నాయి.
=====================
జనపదం, బ్యూరో
ఏం పెడుతున్నారో., ఎంతపెడుతున్నారో .., ఎలా పెడుతున్నారో., తెలుసుకోవాల్సిన బాధ్యులు బాగా తిని నిద్రనటిస్తున్నారు. పిల్లల ఆరోగ్యాల పట్టింపు వారికి అక్కర్లేదు., లోపలేం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం వారికి అంతకన్నా కానరాదు. పైగా ఎవరైనా భోజనం గురించి ఫిర్యాదు చెప్తే విషయం పొక్కకుండా బేరాలాడుకుని మరీ పిల్లలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్న ఆనవాళ్లు కోకొల్లలు. ప్రభుత్వ హాస్టళ్లు అంటేనే జంకే పరిస్థితి కల్పిస్తున్నారు. నిత్యం బయటపడుతున్న దారుణాలు., మొక్కుబడిగా ఓదార్పులతో కాలం వెల్లదీస్తున్న వ్యవస్థ తీరును చూసి విసిగిపోయిన పేరెంట్స్ పిల్లలకు దేవుడే దిక్కనే చిత్తానికి వస్తున్నారు.
వాంకిడి సంచలనం..
హాస్టల్ లో ఏం జరిగిందో ఏమోగానీ పిల్లలంతా తీవ్ర అనారోగ్య సమస్య బారిన పడి వాంకిడి ఉదంతం ఇప్పుడు రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశం. వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో పిల్లలు నిమ్స్ ఆస్పత్రికి తరలించాల్సి అవసరం ఏర్పడిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడాలి. సుమారు 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడం, అందునా ఇద్దరు బాలికలను నిమ్స్ కు తరలించడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో భగవంతుడికే తెలియాలి గానీ ప్రస్తుతానికి మాత్రం చికిత్స నడుస్తున్నది.
హస్తం సర్కార్ ఏర్పాటు నుంచి..
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి పూర్తిగా దిగజారినట్టే అనిపిస్తున్నది. పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లితండ్రుల సర్కార్ విద్యా సంస్థలపై పూర్తి నమ్మకాన్ని పోగొట్టుకున్నటే అనిపిస్తున్నది. రెసిడెన్షియల్ స్కూళ్ల లో మౌలిక సదుపాయాల కల్పన లో ప్రభుత్వం ఘోరంగా విఫల మయ్యిందని వరసగా జరుగుతున్న ఘటనలు చెబుతున్నాయి. కేవలం ఏడు నెలల కాలంలోనే సుమారు 600 మంది విద్యార్థులు ఫుడ్ ఫాయిజనింగ్ బారిన పడి తీవ్ర ఇబ్బంది పడ్డారు.
36 ప్రభుత్వ హత్యలు..
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నుంచి హాస్టల్ లోని విద్యార్థుల బతుకులు గాల్లో దీపాల మాదిరిగా మారినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెదక్ హవేలీ ఘన్ పూర్ లో కరెంట్ షాక్ కొట్టి పిల్లలు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఎన్ని సార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా దున్న పోతు మీద వాన పడ్డట్టే ఉంది . ఇప్పటి వరకు హాస్టళ్ల నిర్వహణ లోపంతో సుమారు 36 మంది మృత్యువాత పడడం తీవ్రంగా కలచివేయించే విషయం. కేవలం సర్కార్ నిర్లక్ష్యం., యంత్రాంగం పట్టింపులేని తనం.., వెరసీ ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అలా చనిపోయిన ఈ 36 మరణాలు కేవలం ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి ఉంటుంది.
నిర్మల్ లో మరో రకం ఘటన..
నిర్మల్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి మృతి రాష్ట్రంలో మరోకలకలాన్ని రేపింది. ఈ ఘటనపై పైస్థాయి అధికారులు వెంటనే స్పందించి నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆర్డిఓ ఆధ్వర్యంలో విచారణ కమిటీని కూడా వేసి నలుగురిని సస్పెండ్ చేశారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపల్ ఎం.సంతోష్, ఉపాధ్యాయుడు టి. రమేష్, పీఈటీ పెంటన్న, హెల్త్ సూపర్వైజర్ సుజాత లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
గత వారం రోజుల కిందట పెద్దపెల్లి జిల్లాలో కూాడా హాస్టల్ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రికి రాత్రి విపరీతమైన అస్వస్థతతో ఇబ్బందిపడడంతో హుటాహుటీనా వారిని బస్సుల్లో ఆస్పత్రికి తరలించారు. రాత్రి వేళల్లో పిల్లలను దవాఖానకు తీసుకెళ్తున్నారన్న సమాచారం రావడంతో తల్లిదండ్రులు తీవ్ర హైరానాపడి అర్ధరాత్రి దవాఖానకు తరలివెళ్లడం మరచిపోలేని విషయం. అసలేమైందో ఏమోగానీ సుమారు 60 మంది విద్యార్థినులు విపరీతమైన దగ్గు, ఇతరత్రా సమస్యలతో బెడ్ ఎక్కాల్సిన వచ్చిన దౌర్భాగ్యం.
ఇలా చెప్పుకుంటూ పోతే హాస్టళ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఊహించొచ్చు. సర్కార్ పెద్దలు పట్టించుకోకపోవడం, ఆర్థిక స్తోమత సరిపోక తల్లిదండ్రులు తప్పనిసరై అక్కడే చదివించాల్సి రావడం, సౌకర్యాలు లేకున్నా, ప్రాణాపైకి తెస్తున్నా ఏమీ చేయలేక బలవంతంగా జైల్లుగా భావిస్తు మరీ అందులోనే చదువుకోవాల్సి వస్తున్న భయానక పరిస్థితిని ఎదుర్కునే క్రమంలో విద్యార్థినులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, కొన్ని సందర్భాల్లో మృత్యువాతకూడా పడుతున్నారు. అంతెందుకు స్వయంగా కాకతీయ యూనివర్సిటీలోనే సౌకర్యాలు సరిగా లేక పీజీ విద్యార్థిని తలపై ఫ్యాన్ ఊడిపడిన ఘటనలో సుమారు 32 కుట్లు పడ్డాయంటే నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు