Sunday, December 29, 2024
HomeTelanganaపెద్దోనిదే పెత్తనం.. అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు

పెద్దోనిదే పెత్తనం.. అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు

జనపదం – శుక్రవారం – 16-08-2024 E-Paper

పెద్దోనిదే పెత్తనం
అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు
బీఆర్​ఎస్​ హయాంలో నిధులన్నీ గజ్వేల్​, సిద్దిపేట, సిరిసిల్లకు
కాంగ్రెస్​లో ఫండ్స్​ మొత్తం కొడంగల్​, నల్గొండ, ఖమ్మంకు

ప్రభుత్వం ఏది ఉన్నా.. నిధుల విషయంలో మాత్రం బలం చూపించే నేతల జిల్లాలకే వెళ్తున్నాయి. బీఆర్​ఎస్​ హయాంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావులకు గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలే ముఖ్యమైనట్లు నిధులు కూడా ఆ మూడు నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించారు. దీంతో “ సీఎం, మంత్రులుగా పని చేస్తున్నారు కాబట్టే నిధులు అటు వెళ్తున్నాయా? కొడంగల్‌ నియోజకవర్గం రాష్ట్రంలో భాగం కాదా?’ 10 సెప్టెంబర్​ 2023 నాడు పీసీసీ చీఫ్​ గా రేవంత్​ రెడ్డి తన నివాసంలో పలువురు నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. నాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల గురించి మాట్లాడిన రేవంత్​ రెడ్డి.. ఇప్పుడు సీఎంగా తానూ అదే దారిలో వెళ్తున్నారు. కొడంగల్​ అభివృద్ధికి ‘కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్​ ​మెంట్ అథారిటీ’ కడా ఏర్పాటు చేయడంతోపాటు దానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. గడిచిన 8 నెలల్లో దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఒక్క కొడంగల్​ నియోజకవర్గ అభివృద్ధికే కేటాయించడం గమనార్హం.

నల్గొండకు పెద్ద చేయి
ఆ తర్వాత నల్గొండ జిల్లా నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ మేరకు ఈ ఇద్దరు మంత్రులు కూడా వారి సొంత జిల్లా అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి హుజూర్‌నగర్‌లో ఫణిగిరి గుట్ట వద్ద 2,160 ఇందిరమ్మ ఇళ్ల కాలనీని మంజూరు చేయించుకొని పనులు మొదలు పెట్టారు. మంత్రి కోమటిరెడ్డి తన జిల్లాకు రుణమాఫీ నిధులు ఎక్కువ తీసుకువెళ్లారని స్వయంగా సీఎం చెప్పారు. రూ.లక్ష రుణ‌‌మాఫీ జ‌‌రిగిన 32 జిల్లాల్లో నల్గొండ టాప్​ ​లో నిలిచింది. ఈ ఒక్క జిల్లాలోనే 78,463 రైతు కుటుంబాలకు చెందిన 83,124 రైతుల క్రాప్​ ​లోన్లు రూ. 454.49 కోట్ల మేర మాఫీ అయ్యాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి నేతృత్వం వహిస్తున్న ఖమ్మం జిల్లాకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్​ గజ్వేల్​ కు రింగ్​ రోడ్డు వేయించుకున్నట్లుగానే.. ఖమ్మం చుట్టూ రింగ్​ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 654 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి చారిత్రాత్మక నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు మంత్రులు తాజాగా తెలిపారు.

ఇరిగేషన్​ ప్రాజెక్టులకు భారీ నిధులు..
బడ్జెట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న కీలక ప్రాజెక్టుల పూర్తి చేయడానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నల్గొండ జిల్లాకు కీలకంగా ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఏఎమ్మార్పీ) పథకం పనులకు, పెండింగ్‌ బిల్లులు, టన్నెల్‌బోర్‌ మిషన్‌ను తిరిగి పునరుద్ధరించే పనులకు బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించింది. నాగార్జునసాగర్‌ జలాల ఎత్తిపోతకు ఏర్పాటు చేస్తున్న స్కీంలకు కూడా దండిగా నిధులిచ్చారు. డిండి ఎత్తిపోతలకు కూడా ప్రాధాన్యం దక్కింది. నల్గొండ జిల్లా పరిధి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో మిగిలిన పనులకు రూ.400 కోట్లు ఇచ్చింది. ఎస్‌ఎల్‌బీసీ, ఇతర ప్రాజెక్టులకు సీఎం రూ.2,200 కోట్లు ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో ఉన్న కీలక ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డికి రూ.1,285 కోట్లు కేటాయించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.715 కోట్లు దక్కాయి. సీతారామ ఎత్తిపోతలకు రూ.687.81 కోట్లు కేటాయించారు. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతలకు రూ.248.99 కోట్లు ఇచ్చింది. ఇలా నాడు బీఆర్​ఎస్​ పెద్దలు ప్రభుత్వంలో ఉండి వారి సొంత నియోజకవర్గాలు, జిల్లాలకు ఎక్కువ నిధులు తీసుకువెళ్లినట్లే.. ప్రస్తుతం కాంగ్రెస్​ నాయకులు చేస్తున్నారు.

మాకు నిధులు ఏవి?
ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు, జిల్లాలను నిర్లక్ష్యం చేయడంపై ఇటీవల అసెంబ్లీలో గొంతెత్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్​ రెడ్డి, ధన్​ పాల్​ సూర్యనారాయణ లాంటి వారు అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొడంగల్​ కు కేటాయించిన నిధుల్లో కనీసం 10 శాతమైనా తమకు కేటాయించాలని కోరారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఆదరణ కరువు అయిందని ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు