Sunday, December 29, 2024
HomeTelanganaAnti-defection | ఉపశమనమా.. ఉప ఎన్నికలా..

Anti-defection | ఉపశమనమా.. ఉప ఎన్నికలా..

ఉపశమనమా… ఉప ఎన్నికలా..
– అనర్హత వేటు తీర్పు ఎటు
– ముగ్గురిపై వేటు ఖాయమా
– మిగిలిన ఏడుగురిలో గందరగోళమా..
– ఉప ఎన్నికకు కడియం, తెల్లం, దానం రెడీ అయ్యారా
– బీఆర్ఎస్ తలచినదే కాంగ్రెస్ కోరుకుంటున్నదా…
– రాష్ట్రంలో రాజకీయ వేడి
– పార్టీలకు ఏడాది రెఫరెండమ్

చావు తప్పి కన్ను లొట్టపడినట్టా.., కన్నుతో పోయేదాన్ని చావుదాకా తెచ్చుకున్నట్టా..? లేదంటే ఏదైతే అది అని నిమ్మళంగా ఉన్నారనుకోవాలా..? ఊహించనది జరిగేసరికి నోటమాట రాకుండా నిశేష్టులైనట్టుగా భావించాలా..? బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలని ఉవ్విళ్లూరిన రేవంత్ చేతులెత్తేసినట్టుగా వ్యవహరిస్తున్న తీరును ఏమనుకోవాలి..? హైకోర్టు వెంటనే తేల్చండి, సమయం దాటితే సొంతంగా స్వీకరిస్తామని ఇచ్చిన ఆదేశాలతో ఎవరి భవిత్యవం ఏమవుతుందనుకోవాలి. ఇప్పటికే ఆడ గెలిచి ఈడకొచ్చిన తీరుపై ప్రజలంతా పెదవి విరుస్తుండగా కోర్టు కూడా అక్షితలు వేసినట్టుగా మందలించడంతో ప్రజాస్వామ్యానికి మంచిరోజులొచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఏదిఏమైనా గోడ దూకుడు నేతలకు ఉపశమనం కలుగుతుందో.. లేదంటే ఉప ఎన్నికకే తరలాల్సిన పరిస్థితులే మిగులుతాయో చూడాలి మరి..
===========================

జనపదం, బ్యూరో

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకంటే ముందే ఉప ఎన్నికలొస్తయా.. బై పోల్ రావాలని పార్టీలు కూడా ఉవ్విళ్లూరుతున్నయా అంటే పరిస్థితి చూస్తే అట్లనే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి సర్వశక్తులొడ్డిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తడంతో కండువాలు మార్చుకున్న పది మంది గులాబీ ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది. తాజాగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయంగా గందరగోళానికి దారితీస్తున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందా.. లేక ఉప ఎన్నికలను కోరుకుంటోందానన్నది సస్పెన్స్ గా ఉంది. హైకోర్టులో తేలకపోయినా సుప్రీంకోర్టులో ఈ మేరకు న్యాయ నిపుణులను కూడా నియమించుకుని న్యాయ పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది. అంతేకాదు ఓ అడుగు ముందుకేసిన బీఆర్ఎస్ ఉప ఎన్నికలకు రెడీ కావాలని క్యాడర్ ను సమాయత్తం చేస్తోంది. బీజేపి కూడా అదే కోరుకుంటున్నది. ఏడాదిలో ఏ పార్టీ పనితీరు ఎలా ఉందో ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సహా సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. కడియం, తెల్లం, దానం ఉప ఎన్నికలకు కూడా సిద్దమైనట్టు బలమైన సంకేతాలిస్తన్నారు కూడా.

ఉపశమనమో., ఉపఎన్నికోగానీ ఫిరాయింపులు వ్యవహారం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వారు స్వచ్చందంగా ప్రజా తీర్పును అపహాస్యం చేస్తే నెరపుతున్న ఈ సంస్కృతిపై కోర్టులు తీవ్రంగా మందలిస్తున్నా చలనం లేకపోవడం దౌర్భాగ్యం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రతిపక్ష పార్టీల ఊసే లేకుండా చేయాలనే అత్యాశతో చేసిన దూకుడు తనం ఇప్పుడు అదే ఎదుర్కోవడం కాలమహిమే. అప్పటిదప్పుడు కావొచ్చుగానీ, ఇప్పుడు ఫిరాయింపులు సరికాదని ఆ పార్టీ కోర్టును ఆశ్రయించడంతో తీవ్ర చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో తేల్చాలని, లేదంటే నాలుగు వారాల తర్వాత తామే స్వీకరించాల్సి ఉంటుందని తేల్చింది.

పది మంది ఎమ్మెల్యే శాసన సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం, రాజకీయం, పదవులు కొత్తేమీ కాదు అని ప్రగల్బాలు పలికుతూనే గోడ దూకడం ఓ ఫ్యాషన్ గా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీని విలీనం చేస్తారనే లీకులు రావడంతో బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టును ఆశ్రయించింది. దీనిని సీరియస్ గా తీసుకుని ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించాలని అభ్యర్థించింది. దీంతో హైకోర్టు కడియం, తెల్లం, దానం విషయమై సీరియస్ గా స్పందించి వివరణ కోరింది. స్వచ్ఛందంగా కారణాలు తెలుపుతారా.. లేదంటే తామే ఇన్ వాల్వు కావాలా.. అని నిలదీసింది. దీంతో కడియం, తెల్లం, దానం నాగేందర్ పై వేటు పడుతుందా.. ఉపశమనం పొందుతారా.. అనే చర్చ సాగుతున్నది. రాజకీయంగా ఫిరాయింపుల వ్యవహారం పార్టీల్లో తీవ్ర ఉత్కంఠకు తెరతీసింది. వాడివేడి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు ఇఫ్పుడు మరింత హాట్ గా మారాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో నేతలు దుమ్మెత్తిపోసుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు.
అద్దంకి క్లియర్..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ స్వాగతిస్తున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తూ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను కాంగ్రెస్‌ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతోనే రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీఎల్పీని మెర్జ్‌ చేసుకోకునే వరకు హైకోర్టు ఆగకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యాలతోనే జరుగుతోందని పేర్కొన్నారు.
గతంలో ఇలా..
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతోంది. రాహుల్ గాంధీ సైతం గతంలో ఫిరాయింపులపై అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ మాటలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏం చేద్దాం..
హై కోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. అనర్హత అంటే భవిష్యత్ ఏంది అనే ఆలోచనలో పడ్డారు. టఫ్ ఎన్నికల్లో గెలిచిన మనం.. తొందరపడి అడుగులు వేశామా..? అని ఆగమవుతున్నారు. ఏం చేస్తే ఈ గండం నుంచి బయటపడుతామంటూ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఒక వేళా స్పీకర్ అనర్హత వేస్తే.. ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో తాము గట్టెక్కుతామో లేదో అనే భయం పట్టుకుంది. అధికారం పార్టీ అని వస్తే.. నేటికీ ఏ పదవులు అందడం లేదనే నిరాశలో ఉన్న వారికి హై కోర్టు తీర్పు మరింత నిరాశలోకి నెట్టివేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు