Gambhir| గత కొద్ది రోజులుగా టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఎవరు హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుంది అనే దానిపై చర్చలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. అయితే చివరికి టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ఫిక్స్ అయినట్టు, త్వరలోనే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా తెలియజేయనున్నట్టు సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత ద్రవిడ్ పదవీ కాలం ముగియనుండగా, ఇక ఆ తర్వాత నుండి కొత్త హెడ్ కోచ్ గంభీర్ బాధ్యతలు చేపట్టి.. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆ పదవీలో కొనసాగుతారు. టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జైషా గౌతమ్ గంభీర్‌తో చర్చించగా ఆయన పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారట.
ఈ విషయాన్ని ఐపీఎల్ టీమ్ ఓనర్ బయటపెట్టారు. వీలైనంత త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రానుంది. అయితే టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి భారీగానే దరఖాస్తులు వచ్చాయి.మొత్తం 3 వేల అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీల పేరిట కూడా కొన్ని ఫేక్ అప్లికేషన్స్ వచ్చినట్టు ఓ జాతీయ ఛానెల్ తెలియజేసింది. అయితే పదవి దరఖాస్తులకు విధించిన గడువు సోమవారంతో ముగిసింది. ఇక ఇప్పుడు ఫార్మాలిటీ ప్రకారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ దరఖాస్తులను పరిశీలించి కొందర్నీ షార్ట్ లిస్ట్ చేస్తోంది. వారిని బీసీసీఐ నియమించే ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేసి తుది నిర్ణయం తీసుకుంటుంది.
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వస్తే జట్టు బలంగా మారుతుందని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. ఆటగాళ్ల నుండి టాలెంట్‌ని బయటకు రాబట్టే సత్తా గంభీర్ లో ఉంది. ఐపీఎల్‌లో మెంటర్‌గా గంభీర్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఐపీఎల్ 2022 నుంచి మెంటర్‌గా పనిచేస్తున్న గంభీర్ 2022, 2023 సీజన్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటర్‌గా వ్యవహరించగా ఆ రెండు సీజన్స్‌లో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కి చేరింది. ఇక ఈ ఏడాది కోల్ కతాకి కప్ మెంటార్‌గా ఉండి ఆ టీమ్‌కి కప్ కూడా దక్కేలా చేశాడు.