Wednesday, April 2, 2025
HomeTelanganaవిలీనం.. గేమ్ విత్ గులాబీ..

విలీనం.. గేమ్ విత్ గులాబీ..

జనపదం శనివారం – 17-08-2024 E-Paper

విలీనం..
గేమ్ విత్ గులాబీ..
ఆటాడుకుంటున్న హస్తం, కమలం..
కాంగ్రెస్ లో కలుస్తుందంటున్న బండి..
బీజేపీలో చేరబోతుందని సీఎం..
పార్టీలే పోస్టులిచ్చేస్తున్న విచిత్రం..
గవర్నర్ గా కేసీఆర్.. కేంద్ర మంత్రిగా కేటీఆర్..
కవితకు బెయిల్..!, హరీష్ కు అసెంబ్లీ వ్యవహారాలు..?
మెర్జింగ్ మానియా..?

చీల్చి చెండాడుతున్నరు. చెండిని కొట్టినట్టు కొడుతున్నరు. ఎటు వైపైతే అటు, ఎవరికి వైపైతే వాళ్లు చెడుగుడు చెడుగుడు ఆడుతున్నరు. నిజమెంతో.., అబద్ధమెంతోగానీ అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు.. ఎవరిష్టమున్నట్టు వాళ్లు తంతనే ఉన్నరు. అక్కరట్లున్నదో.., లేదంటే వాళ్ల కష్టాలు వీళ్లకు సంబురమనిస్తున్నయోగానీ నోటికొచ్చినట్టు మాట్లాడుతనే ఉన్నారు. ఎదుటోడు అన్నప్పుడు మనమెందుకు ఊర్కోవాలనో.., వాళ్లొక్కటంటే మనం పదనాలనో గానీ కాంగ్రెస్ అండ్ కమలం గులాబీతో గేమ్ ఆడుతున్నయి. బీఆర్ఎస్ విలీనం బీజేపీతోనే అని రేవంత్ ఢిల్లీలో చిట్ చాట్ చేస్తే.., పీసీసీ ఛీఫ్ కేటీఆర్ అని బండి ఏకంగా డిక్లరేషనే ఇచ్చేశాడు. ఇవన్నీ జోస్యాలా.., జరుగబోయేటివా.. భవిష్యత్తే తేల్చాలిగానీ కష్టాల్లో ఉన్న కారును జాతీయ పార్టీలు చెడామడా ఆడేసుకుంటున్నాయి. విలీనం ఎప్పుడో, పదవులు పొందేది ఎన్నటికోగానీ కేసీఆర్ ను గవర్నర్ గా., కేటీఆర్ ను కేంద్ర మంత్రిగానో లేదంటే పీసీసీ ఛీఫ్ గానో.., హరీష్ అసెంబ్లీ వ్యవహారాలు చూసేవాడిగా చూడబోతున్నామా.., కవితకు బెయిల్ కూడా వెన్వెంటనే రాబోతోందా….?!

========================

జనపదం, హైదరాబాద్ బ్యూరో
బీఆర్ఎస్ ను అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఆటాడుకుంటున్నాయి. భారత రాష్ట్ర సమితి త్వరలోనే బీజేపీలో విలీనం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బాంబు పేల్చుతూనే ఉన్నారు. రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న గులాబీ గట్టెక్కాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో కమలాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందని సీఎం సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. కూతురు కవితకు బెయిల్ రావాలంటే మోదీని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు తప్పని సరైందని పేర్కొంటున్నారు. అందుకే సైలెంట్ గా సంప్రదింపులు జరుగుతున్నాయని, ఏదో ఒక రోజు బీఆర్ఎస్ శ్రేణులకు చావుకబురు సల్లగా చెప్పినట్టుగా విలీనం వార్తను చెప్పబోతున్నారని ఆయన కుండబద్ధలు కొడుతున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ చెలిమి విలీనం దిశగా దారులు వేయబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొంటున్నారు. రాష్ట్రావిర్భావం సందర్భంగా కేసీఆర్ సోనియా గాంధీతో చెప్పినట్టుగానే ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరగబోతోందని వివరిస్తున్నారు. అప్పుడంటే పదవి వ్యామోహమో., విలీన అవసరం లేకనోగానీ మాటతప్పిన కేసీఆర్ ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఆ పనికి శ్రీకారం చుట్టబోతున్నారని బండి తెలుపుతున్నారు. ఇలా సీఎం రేవంత్, కేంద్రమంత్రి బండి ఎవరికి వారుగా బీఆర్ఎస్ విలీనంపై ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.

గవర్నర్ గా కేసీఆర్..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ పదవి దక్కబోతోందని, కేటీఆర్ కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు సీఎం మాటలతో తెలిసిపోతోంది. కేటీఆర్ ఢిల్లీలో మకాం వేయడం, పెద్దలను గుట్టు చప్పుడు కాకుండా కలువడం వెనక మర్మం ఇదే అని సీఎం బహిరంగంగానే పేర్కొంటున్నారు. బీజేపీలో చేరితో వెంటనే కవితకు బెయిల్ కూడా వస్తుందని, హరీష్ రావు అసెంబ్లీలో కమలం పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడని జోస్యం చెబుతున్నారు.

పీసీసీ చీఫ్ గా కేటీఆర్..?
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నియామకం కాబోతున్నాడని కేంద్రమంత్రి సంజయ్ పేర్కొన్నారు. సోనియాతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో బీఆర్ఎస్ పెద్దలు టచ్ లో ఉన్నారని, అన్ని విషయాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే డిక్లరేషన్ జరుగబోతోందని ఆయన తెలుపడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇంతకీ నిజమేనా..?
బీఆర్ఎస్ విలీనంపై జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారుగా చేస్తున్న ఆరోపణలు నిజమేనా అనే మీమాంస పరిశోధనలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కవిత జైలుకు వెళ్లి సుమారు ఆరు నెలలు కావస్తున్నా బెయిల్ రాకపోవడంతో ఇక నేషనల్ గా తమ బలం పనిచేయడం లేదనే క్లారిటీకి బీఆర్ఎస్ లీడర్లు వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పార్లమెంట్ లో కనీసం బోణీ కూడా కొట్టకపోవడంతో ఇప్పటికి చాపచుట్టేయాల్సిన అవసరం తప్పకపోతోందనే ఆలోచనతోనే పెద్ద పార్టీల వైపు చూస్తున్నట్టు వినికిడి. నిప్పులేనిదే పొగరాదన్నట్టుగా, ఎంతోకొంత అలాంటి ఆలోచన లేకపోతేనే ఇలాంటి పుకార్లు షికారు చేయడం సాధ్యమయ్యే పనేనా అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మెర్జింగ్ మానియా..?
ఏది ఏమైనా ఇప్పుడు అధికారం., ప్రతిపక్షం అనే వ్యతిరేఖ కోణంలో విలీనమే అంతిమం అనే ట్రెండ్ నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల మనుగడకు జాతీయ పార్టీలు ఊతమందించే రోజులు అంతగా లేకపోవడం, కష్టకాలంలో ఒంటరిగా మారాల్సిన పరిస్థితులు స్థానిక పార్టీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదో తెలియదుగానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మదిలో మెర్జింగ్ మానియా గింగిరీలు కొడుతున్నది. అది బీజేపీతోనా.., కాంగ్రెస్ తోనా.. అనేది స్పష్టత లేకున్నా , జరుగుతుందా.., పుకారా.. అనేది తేలకున్నా మెర్జింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు