హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. లంగర్ చౌరస్తాలో డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో తొట్లు, రథంతో ఊరేగింపుగా బోనాలను ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో కొండపైకి తొట్లు, రథం ఊరేగింపు నిర్వహించారు. పోతురాజులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. హైదరాబాద్, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా, బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని అన్నారు.
ఇవాళ గోల్కొండలో మొదలైన ఈ బోనాలు 9 వారాల పాటు ఘనంగా జరుగుతాయి. మళ్లీ గోల్కొండ కోటలనే బోనాలు ముగుస్తాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దేశ, విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
బోనాలకు భారీ పోలీస్ బందోబస్తు : దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
గోల్కొండ బోనాల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం 600 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామని, సీసీ కెమెరాల నిఘాలో బోనాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. గోల్కొండ కోటకు వచ్చే వారికి మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఉంటుందని, సెవన్ టూంబ్స్ వద్ద ఓ పార్కింగ్, లంగర్‌హౌస్ హుడా పార్కు వద్ద పార్కింగ్, రాందేవ్‌గూడ దాటిన తర్వాత ఓ పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయిస్తున్నామన్నారు. అంతేకాకుండా సెవన్ టూంబ్స్, రాందేవ్‌గూడల వైపు నుంచి వచ్చే వారికి పార్కింగ్ దగ్గర నుంచి కోట వరకు ఉచిత సెట్విన్ బస్సు, లంగర్‌హౌస్ హుడా పార్కు నుంచి వచ్చే వారి కోసం ఫ్రీ ఆటోలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్నట్లు డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహాయ సహకారాలు అందించి ప్రశాంత వాతావరణంలో బోనాలను జరుపుకోవాలన్నారు.