Govindaraja Swamy | తిరుపతి గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు గురువారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి భక్తులను కటాక్షిచారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని మొక్కులు చెల్లించారు. శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు. వాహనసేవలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.