Group-1 Prelims | హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రధాన కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్‌టీ.. ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని, పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానీ గ్రూప్-1కు 4.03 లక్షల దరఖాస్తులు రావడంతో సీబీఆర్‌టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని కమిషన్ భావించింది. దీంతో ప్రిలిమ్స్‌ను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.
హాల్‌టికెట్లు కూడా మే నెలాఖరులోగా విడుదల చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాల రూపకల్పన, తర్జుమా చేయడంతోపాటు పరీక్షా కేంద్రాల గుర్తింపు వంటి పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ పరీక్ష వాయిదా వేసే ఉద్దేశమే లేదని తేలిపోయింది. ఇప్పటికే గ్రూప్-1 కోసం అభ్యర్థులు ప్రిపరేషన్‌పై దృష్టి సారించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19వ తేదీన టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. అయితే చివరి రోజు సర్వర్ మొరాయించడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఫలితంగా 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కేవలం 2.7 లక్షల దరఖాస్తులే వచ్చాయి. దీనిపై అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ క్రమంలో దరఖాస్తుల గడువు ముగిసేసరికి 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి.