GT vs CSK| ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ చెన్నైకి పెద్ద షాకే ఇచ్చింది.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం ( మే10) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ చేయగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయిసుదర్శన్ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో జీటీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలలో 231 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9×4, 6×6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5×4, 7×6) చెన్నై బౌలర్స్‌కి చుక్కలు చూపించారు. ముందు కాస్త స్లోగా ఆడుకుంటూ వచ్చిన వీరిద్దరు ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయి ఆడారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చెన్నై బౌలర్లలో తుషార్ (2/33) రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
ఇక భారీ టార్గెట్‌ను ఛేదించడంలో తడబడిన చెన్నై 196 పరుగులు మాత్రమే చేసింది. 232 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయాలని స్పీడ్‌గా ఆడే క్రమంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది సీఎస్కే. ముందు రచిన్ రవీంద్ర ఒక్క పరుగుకే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అంజిక్య రహానే మరోసారి (1 రన్) నిరాశపరిచాడు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 10 పరుగులకే మూడు కీలక వికెట్లు పడిపోవడంతో చెన్నై ఓటమి ఖాయం అని ముందే డిసైడ్ అయ్యారు. అయితే డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో, 7×4, 3×6), మొయిన్ అలీ (56; 36 బంతుల్లో, 4×4, 4×6) అర్ధశతకాలు చేసి చెన్నైకి ఊపిరి పోసారు. వీరిద్దరు క్రీజులో ఉన్న సమయంలో చెన్నై గెలిచే అవకాశం ఉంటుందని భావించారు.
కాని చెన్నైని విజయం దిశగా నడిస్తోన్న వీరిద్దరిని ఔట్ చేసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు మోహిత్ శర్మ. ఆ తర్వాత శివమ్ దూబే( 13 బాల్స్‌లో 21 రన్స్)ను కూడా మోహిత్ శర్మ ఔట్ చేయడంతో ఇక చెన్నై ఓటమి ఖాయమైంది.చివర్లో ధోని కాస్త బ్యాట్ ఝుళిపించిన అప్పటికే భారీ స్కోరు సాధించాల్సి ఉండడంతో గుజరాత్ గెలుపు ఖరారైపోయింది. 35 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. గుజరాత్ గెలుపుతో ప్లే ఆఫ్ మరింత రసవత్తరంగా మారింది.అయితే ఇప్పటికీ చెన్నై నాలుగో స్థానంలోనే ఉన్నా ప్లే ఆఫ్ ఆశలని కాస్త సంక్లిష్టం చేసుకుంది