HariHara VeeraMallu| టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా హరిహర వీరమల్లు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతుంది. 17వ శతాబ్దంలో హిస్టారికల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాబీ డియోల్ ఢిల్లీ మోఘల్ చక్రవర్తి పాత్రలో కనిపించి సందడి చేయబోతున్నారు. ఈ మూవీని రెండు పార్ట్‌లుగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. తొలి పార్ట్ ఈ ఏడాదిలోనే థియేటర్‌లోకి రానున్నట్టు తాజాగా తెలియజేశారు.
ఇక కొద్ది సేపటి క్రితం విడుదలైన టీజర్‌లో హరిహర వీరమల్లు తీరుతన్నుల గురించి చెబుతూ, బలమైన సంభాషణ, అలానే కొన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో టీజర్‌ని హృద్యంగా నడిపించారు. పేదలు దోపిడీకి గురవుతుంటే, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతుండగా, న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో కనిపించి సందడి చేయనున్నారు. టీజర్‌లో అదిరిపోయే యాక్షన్ సీన్లతో గూస్‌బంమ్స్ తెప్పించాడు పవన్ కళ్యాణ్. యుద్ధ సన్నివేశాల్లో తనదైన యాక్షన్‌తో మంత్ర ముగ్ధులని చేశాడు. అయితే టీజర్‌లో పవన్‌కి డైలాగ్స్ లేకపోవడం కాస్త నిరాశపరుస్తుంది
ఇక ఈ సినిమా నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. టీజర్‌తో అది నిజమేనని తెలియజేశారు. క్రిష్ స్థానంలో ఏఎమ్ జ్యోతికృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. టీజర్‌తో పాటుగా గురువారం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో క్రిష్ పేరుతో పాటు జ్యోతికృష్ణ పేర్లు కనిపించాయి. సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తైనట్టు తెలుస్తుండగా, మిగిలిన షూటింగ్ పార్ట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జ్యోతికృష్ణ పూర్తి చేస్తాడని మేకర్స్ తెలియజేశారు. క్రిష్ పర్యవేక్షణలోనే జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తిచేస్తాడని వారు స్పష్టం చేశారు. జ్యోతికృష్ణ.. నిర్మాత ఏం రత్నం తనయుడు కాగా, ఆయన గతంలో తరుణ్‌తో నీ మనసు నాకు తెలుసు, గోపీచంద్‌తో ఆక్సిజన్ సినిమాలను తెరకెక్కించాడు.ఇటీవలే రూల్స్ రంజన్‌తో తిరిగి మెగాఫోన్ పట్టిన ఫలితం మారలేదు. మరి ఇప్పుడు పవన్ సినిమాని ఏం చేస్తాడో చూడాలి.