అగమ్యగోచరంగా మారిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్
గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
బహిరంగ లేఖ
శ్రీ రేవంత్ రెడ్డి గారికి,
ముఖ్యమంత్రి,
తెలంగాణ రాష్ట్రం,
విషయం: అగమ్యగోచరంగా మారిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ గారు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొంది.
సీఎంగా కేసీఆర్ గారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారు. ‘’వివేకానంద” పేరుతో విదేశీ విద్యా పథకం, ‘’శ్రీ రామానుజ’’ పేరుతో ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం, ‘’వేదహిత’’ పేరుతో వేద పాఠశాలలకు మరియు వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి నెల వేద శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ వంటి పథకాలను అమలు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం, విదేశీ విద్యా పథకం కింద 780 మంది పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం రూ.20లక్షల చొప్పున ఖర్చు చేసింది. 436 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంగా 5,074 మందిని గుర్తించి, రూ.150 కోట్ల ఆర్థిక భరోసా కల్పించింది. ఇవే కాకుండా, బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా దేశంలోనే తొలిసారిగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ. 12 కోట్లతో పది ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా మీరు స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నాను.
పరిష్కరించాల్సిన సమస్యలు…..
- బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.
- విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. వారికి స్కాలర్ షిప్స్ అందకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి. 2023-24 ఏడాదికి గాను ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 344 మంది విద్యార్థులకు తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి.
- బ్రాహ్మణ ఎంటర్ ప్రెన్యూయల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలి.
- బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి.
- వేద పాఠశాలల్లోని వేద పండితులకు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న రూ.5వేల గౌరవ వేతనాన్ని తక్షణం చెల్లించాలి.
- 75 ఏళ్లు పై బడిన వేద పండితులకు ఇచ్చే రూ. 5వేల భృతి ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. వారికి ఆర్థిక చేయూత ఎంతో అవసరం కాబట్టి వెంటనే చెల్లించాలి.
- సూర్యపేట, ఖమ్మం, మధిరలో నిర్మించతలపెట్టిన బ్రాహ్మణ సదనాల పనులు ఆగిపోయాయి. వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలి.
ధన్యవాదాలతో…
తన్నీరు హరీశ్ రావు
సిద్దిపేట శాసన సభ్యులు