రుణమాఫీ ఎగ్గొట్టడానికి 31 సాకులు..
రేషన్ కార్డు లేదని, పెళ్లి కాలేదని.. రుణమాఫీ ఎగవేత
రేవంత్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే
ముఖ్యమంత్రిపై హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్ : రైతు రుణమాఫీ పేరిట రైతుల ప్రాణాలను బలిగొంటున్న రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు 31 సాకులు చూపుతున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేదని, పెళ్లి కాలేదని, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటూ.. రుణమాఫీ చేయడం లేదు.. రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని హరీశ్‌రావు విమర్శించారు. నిన్న మేడ్చల్ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం హత్యేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ అంశంపై తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వంచన, దుర్మార్గ పద్ధతులపై, అన్నదాతల పట్ల ఆవేదనతో, కొంత బాధ, దుఃఖంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశానని హరీశ్‌రావు తెలిపారు. రైతు రుణమాఫీ జరగలేదని రైతు సురేందర్ రెడ్డి నిన్న మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేంద్ రెడ్డి ఆత్మహత్యనే. నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చే అని పాస్ బుక్ మీద రాసి సురేందర్ రెడ్డి చనిపోయాడు. సురేందర్ రెడ్డి, ఆయన తల్లి సుశీలకు ఒకటే రేషన్ కార్డు ఉండడంతో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో.. తీవ్ర మానసిక వేదనకు గురై సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తల్లి సుశీల పేరు మీద 2 ఎకరాలు ఉండగా, ఆమె రూ. 1,15,662 లోన్ తీసుకున్నారు. సురేందర్‌కు 4 ఎకరాల భూమి ఉండగా, రూ. 1,92,443 లోన్ తీసుకున్నారు. వేర్వేరు పాస్ బుక్‌లు ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంక్ మేనేజర్‌ను ప్రశ్నిస్తే.. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడంతో రుణమాఫీ కాలేదని మేనేజర్ అనిరుధ్ సమాధానం చెప్పినట్లు తెలిసిందని హరీశ్‌రావు తెలిపారు. ఇద్దరికి కలిపి రూ. 2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుందని, మిగతా డబ్బులు చెల్లించాలని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో, మానసికంగా కలత చెందిన సురేందర్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చివరకు మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నిన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడని హరీశ్‌రావు తెలిపారు.
సురేందర్ రెడ్డి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతున్నా..
సురేందర్ రెడ్డి సూసైడ్ నోట్ సాక్షిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. ఖమ్మంలో పంద్రాగస్టు నాడు రుణమాఫీ అయిపోయిందని చెప్పావు..? అయిపోతే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో నేను ప్రెస్ మీట్ పెడితే.. రేషన్ కార్డుతో లింక్ లేదని కొద్ది గంటలకు రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కానీ లింక్ ఉన్నది. కాబట్టే బ్యాంక్ మేనేజర్ రేషన్ కార్డు ప్రకారం రుణమాఫీ చేశారు. అందుకే సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని స్పష్టమవుతుంది. రుణమాఫీ లబ్దిదారులను ఆంక్షల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నవ్. నీవు పన్నిన పన్నాగం రైతుల మెడకు ఉరి తాడైంది. రాజకీయంగా బ్లప్ చేద్దామనుకున్నవ్.. నీ బ్లప్‌కు మూల్యం సురేందర్ రెడ్డి మరణం. సురేందర్ రెడ్డి నోట్‌లో ప్రతి అక్షరం నీ దురాగాతన్ని, నీ రాజకీయ దివాళకోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇవాళ బజారులో నిలబెట్టిందని చెప్పక తప్పదు. సురేందర్ రెడ్డి సూసైడ్ నోట్ నీ దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది..
కాంగ్రెస్ పాలనలో ఈ రోజు వరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్య జాబితాను సీఎం రేవంత్‌కు పంపితే.. ఇప్పటి వరకు స్పందించలేదు. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కిన తర్వాత ఒక మాట, బడ్జెట్‌లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఒక మాట.. పూటకో మాట మాట్లాడుతున్నావ్. పొద్దు తిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతున్నవ్. ఊసరవెల్లులు కూడా నిన్ను చూసి సిగ్గుపడుతున్నాయి. ఎన్నికల ముందు ఏం చెప్పవ్.. అప్పులు తెచ్చుకోండి డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నావ్.. మరి అప్పుడు ఈ నిబంధనలు ఎందుకు చెప్పలేదు..? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
రూ. 49 వేల కోట్లు అని చెప్పావ్.. చేసిందేమో రూ. 17 వేల కోట్లు
రైతు రుణమాఫీ విషయంలో ఎన్నో మాటలు మాట్లాడినవ్. ఎన్నికల తర్వాత ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే రూ. 49 వేల కోట్ల రుణాలు మాఫీ చేసేస్తా అన్నావ్. మరి ఎందుకు కోతలు పెడుతున్నావ్.. కేబినెట్ మీటింగ్ అయ్యాక నీవే ప్రెస్ మీట్ పెట్టి రూ. 31వేల కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అన్నావ్. బడ్జెట్‌లో చూస్తే రూ. 26 లక్షల కోట్లు పెట్టావ్.. చేసిందేమో కేవలం రూ. 17 వేల కోట్లు అని హరీశ్‌రావు తెలిపారు.
కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన చరిత్ర రేవంత్‌ది..
ఇవాళ ఎంత బాధంటే.. తల్లికి, పిల్లల మధ్య గొడవ పెడితివి. తండ్రి, కుమారుల మధ్య గొడవ పెడితివి. నీ దరిద్రపు గొట్టు రాజకీయం వల్ల, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతున్నాయి. కేసీఆర్ పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని చెప్పి రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేసి కుటుంబ బంధాలను బలోపేతం చేశారు. కానీ కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బు తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టన చరిత్ర రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. నా చావుకు మా తల్లి కూడా కారణం అని సురేందర్ రెడ్డి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఇంత దరిద్రంగా ఉంది పాలన అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
రుణమాఫీలో 31 రకాల సమస్యలు.. చూస్తే ఆశ్చర్యమేస్తది..
ఒక ఎమ్మెల్యేగా రుణమాఫీ విషయంలో రివ్యూ చేశాను. రైతు రుణమాఫీలో 31 రకాల సమస్యలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ ఫేజ్-1, 2లో రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇచ్చారు. ఫేజ్-3లో మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించారు. వ్వయసాయ శాఖ అధికారులకు జాబితా ఇవ్వలేదు. బ్యాంకులకు వెళ్లమని చెప్పారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి 31 సాకులు చూపించింది. ఒకటి రేషన్ కార్డు. రెండోది ఫ్యామిలీ.. ఇలా 31 సాకులు ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు.
సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామానికి చెందిన గురజాల బాల్ రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్ భాస్కర్ రెడ్డికి 2013లో పెళ్లైంది. ఉదయ్ భాస్కర్ రెడ్డికి 2018లో పెళ్లైంది. ముగ్గురికి క్రాప్ లోన్ ఉంది. కుమారులకు పెళ్లిళ్లు కావడంతో మూడు సెపరేట్ కుటుంబాలు.. కానీ రేషన్ కార్డులు ఒక్కటే ఉన్నాయి. ముగ్గురికి కలిసి అప్పు ఎంతంటే రూ. 6,91,806 ఉంది. రేషన్ కార్డు నిబంధనల వల్ల కేవలం రూ. 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అయింది. ముగ్గురి భూములు, కమతాలు, వ్యవసాయం, అప్పులు వేరు. రేషన్ కార్డులో ఒకటే దగ్గర పేర్లు ఉన్నాయి కాబట్టి ఆరు లక్షలకు బదులుగా 2 లక్షలు మాత్రమే మాఫీ చేశారు. ఇదేదో నేను స్వతహాగా చెప్పిన లెక్కలు కావు.. ఇది అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక అని హరీశ్‌రావు తెలిపారు.
సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నారాయణరావుపేటకు చెందిన నల్ల మణెమ్మ భర్త 2010లో చనిపోయారు. మణెమ్మ రూ. లక్షా 30 వేలు క్రాప్ లోన్ తీసుకున్నారు. రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లింది. భర్త ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పారట. ఆమె భర్త చనిపోయింది 2010లో.. 2011 తర్వాత ఆధార్ కార్డులు వచ్చాయి. ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ కాదని అంటున్నారట. ఇలా సాకు చూపి ఆమె రుణమాఫీ ఎగ్గొట్టారని హరీశ్‌రావు చెప్పారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన కుంభాల సిద్దారెడ్డికి 51 ఏండ్లు. పెళ్లి చేసుకోలేదు ఒంటరిగా ఉన్నాడు. రూ. లక్షా 99 వేల అప్పు ఉంది. రుణమాఫీ ఎందుకు కాలేదని అధికారులను ప్రశ్నిస్తే.. నీ భార్య ఆధార్ కార్డు కావాలని అధికారులు అడుగుతున్నారట. నాకు పెళ్లి కాలేదు.. భార్య ఆధార్ కార్డు ఎక్కడ్నుంచి తీసుకురావాలని సిద్దారెడ్డి వాపోతున్నాడు. భార్య లేకపోతే కూడా రుణమాఫీ కాదని అధికారులు అంటున్నారట. 51 ఏండ్లకు ఎట్ల పెళ్లి చేసుకోవాలని సిద్ధారెడ్డి ఏడుస్తున్నడు. పెళ్లి చేసుకోకపోవడం కూడా రుణమాఫీకి ఒక కారణమట అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
సీఎం మాత్రం ఉల్టా దబాయిస్తున్నారు..
ఎన్‌పీఏ(నాన్ ఫార్మామింగ్ అకౌంట్స్) ఖాతాదారులకు కూడా రుణమాఫీ కాలేదు. ఇలాంటి ఖాతాదారులకు అప్పు ఉన్నది వాస్తవం.. కానీ లోన్స్ రెన్యూవల్ చేసుకోలేదు. ఇలాంటి కేసులు ప్రతి ఊరిలో 40 నుంచి 50 దాకా ఉన్నాయి. రైతు పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే రుణమాఫీ కావడం లేదు. కుమారులకు నౌకరి ఉందని చెప్పి కొంతమంది రైతులకు మాఫీ చేయలేదు. ఇలా 31 సాకులు పెట్టి కోతలు పెట్టింది. కాంగ్రెస్ సర్కార్ కన్‌ఫ్యూజన్ సర్కార్ అయిపోయింది. కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఎన్నికలప్పుడు కట్టుకథలు.. పాలనలో మాత్రం అన్ని కోతలే. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి ఇవాళ కోతలు పెడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులు ఉంటారు. ఆదిలాబాద్‌లో పర్యటించినప్పుడు అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ రుణమాఫీ చేయట్లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు 22 లక్షల మందికి రుణాలు మాఫీ చేశామని చెప్పారు. 2 లక్షలు వాపస్ వచ్చాయని చెప్పారు. రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారం ఇంకా రుణమాఫీ కావాల్సినోళ్లు 21 లక్షల మంది ఉన్నారు. సీఎం మాత్రం ఉల్టా దబాయిస్తున్నారు.. హరీశ్‌రావు రుణమాఫీ అయిపోయింది వాగుల దుంకు అంటున్నడు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడుతాం..
సురేందర్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కానీ, మంత్రులు కానీ, స్థానిక నాయకులు కానీ ఎవరూ పరామర్శించలేదు. రైతు రుణమాఫీ చేస్తాం.. రైతులెవరూ ధైర్యం కోల్పోకండి అని ప్రభుత్వం చెప్పనేలేదు. రైతులంటే పట్టింపు లేదు. రైతుల ప్రాణాలు కాపాడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు పదవులు ఉపయోగపడాలి.. కానీ ప్రాణం తీసేందుకు పదవులు వద్దు. కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించారు. 3 కోట్లకు పైగా మెట్రిక్ టన్నుల వడ్లు పండించి నంబర్ వన్ రాష్ట్రంగా మార్చారు. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభం వైపు వెళ్తుంది. రైతుబంధు, రైతు రుణమాఫీ ఎగ్గొట్టి రైతుల ప్రాణాలు తీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రైతులెవరూ అధైర్య పడొద్దు.. ఈ రాష్ట్రంలోని అన్నదాతల కోసం ఎంతవరకైనా, ఎంతటికైనా తెగిస్తామని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడుతామని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
సురేందర్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కానీ, మంత్రులు కానీ, స్థానిక నాయకులు కానీ ఎవరూ పరామర్శించలేదు. రైతు రుణమాఫీ చేస్తాం.. రైతులెవరూ ధైర్యం కోల్పోకండి అని ప్రభుత్వం చెప్పనేలేదు. రైతులంటే పట్టింపు లేదు. రైతుల ప్రాణాలు కాపాడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు పదవులు ఉపయోగపడాలి.. కానీ ప్రాణం తీసేందుకు పదవులు వద్దు. కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించారు. 3 కోట్లకు పైగా మెట్రిక్ టన్నుల వడ్లు పండించి నంబర్ వన్ రాష్ట్రంగా మార్చారు. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభం వైపు వెళ్తుంది. రైతుబంధు, రైతు రుణమాఫీ ఎగ్గొట్టి రైతుల ప్రాణాలు తీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రైతులెవరూ అధైర్య పడొద్దు.. ఈ రాష్ట్రంలోని అన్నదాతల కోసం ఎంతవరకైనా, ఎంతటికైనా తెగిస్తామని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడుతామని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.